పిట్టకొంచెం.. రాత ఘనం!

‘పిట్టకొంచెం.. కూత ఘనం’ కదా... ‘రాత ఘనం’ అంటున్నారేంటబ్బా.. అని ఆలోచిస్తున్నారా ఫ్రెండ్స్‌.. ఈ నేస్తం గురించి తెలుసుకుంటే.. మీరూ ‘ఓహో.. ఇదే నిజం’ అని ఒప్పుకుంటారు. ఎందుకంటే తను వ్యాసరచన పోటీలో చక్కని ప్రతిభ కనబరిచింది. ఇంతకీ ఎవరా నేస్తం..

Updated : 12 Sep 2022 06:34 IST

‘పిట్టకొంచెం.. కూత ఘనం’ కదా... ‘రాత ఘనం’ అంటున్నారేంటబ్బా.. అని ఆలోచిస్తున్నారా ఫ్రెండ్స్‌.. ఈ నేస్తం గురించి తెలుసుకుంటే.. మీరూ ‘ఓహో.. ఇదే నిజం’ అని ఒప్పుకుంటారు. ఎందుకంటే తను వ్యాసరచన పోటీలో చక్కని ప్రతిభ కనబరిచింది. ఇంతకీ ఎవరా నేస్తం.. ఏంటా వ్యాసం అని తెలుసుకోవాలని ఉందా? అయితే ఇంకెందుకాలస్యం ఈ కథనం చదివేయండి.

హైదరాబాద్‌ సమీపంలోని నల్లగండ్లకు చెందిన స్నిగ్ధ గోవిందరాజుల ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతోంది. కేంబ్రిడ్జి, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ ఆన్‌లైన్‌ వ్యాసరచన పోటీల్లో ఇటీవల ఈ చిన్నారి పాల్గొంది. ఈ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. వాళ్లు ఎంచుకున్న అంశాలపై వ్యాసాలు రాయాల్సి ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌ కూడా వస్తుంది.

మన దేశం నుంచి ఒక్కరే...!

మన స్నిగ్ధ ‘అంతర్జాతీయ సంబంధాలు’ అనే అంశం మీద వ్యాసం రాసింది. ఈ అంశం మీద మన దేశం నుంచి ఈ చిన్నారి ఒక్కరే వ్యాసం రాశారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ‘అంతర్జాతీయ సంబంధాలు’ చాలా ముఖ్యమైన అంశం. దేశాల మనుగడ దీనిమీదే ఆధారపడి ఉంది. రాజకీయ, ఆర్థిక స్థితిగతులను నిర్ణయించేది ఇదే. శాంతిస్థాపనకూ అంతర్జాతీయ సంబంధాలే కీలకం. ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం నేపథ్యంలో ఈ విషయం మరోసారి నిరూపితం అయింది’ అంటోంది ఈ చిన్నారి. స్నిగ్ధ రాసిన వ్యాసం ఎంపికవడంతో లండన్‌లో నిర్వహించిన కార్యక్రమాలకూ ఆహ్వానం అందింది. వాటిలో పాల్గొని, తన ప్రతిభను చాటింది.

చిత్రం భళారే!

కేవలం వ్యాసాలే కాదు నేస్తాలూ... మన స్నిగ్ధ చక్కగా బొమ్మలు కూడా వేస్తుంది తెలుసా. ఇంకా పియానో కూడా వాయించగలదు. అదీ సాదాసీదాగా కాదు. ట్రినిటీ కాలేజీ లండన్‌ నుంచి రెండు గ్రేడ్‌లనూ పూర్తి చేసింది. ఇదంతా తనకు ఖాళీ సమయం దొరికినప్పుడు ఆన్‌లైన్‌ ద్వారా పూర్తి చేస్తోంది. అన్నట్లు తనకు ఓ యూట్యూబ్‌ ఛానల్‌ కూడా ఉంది నేస్తాలూ! దాని ద్వారా తన కళలను, అభిప్రాయాలు, ఆలోచనలను తన సబ్‌స్క్రైబర్లతో పంచుకుంటోంది. అన్నట్లు మరో విషయం మన స్నిగ్ధకు కరాటే కూడా వచ్చు తెలుసా! అందులో బ్లాక్‌బెల్ట్‌ కూడా సాధించింది. ఇవన్నీ చేస్తూనే... చదువు మీదా శ్రద్ధ కనబరుస్తోంది.

అమ్మానాన్న ప్రోత్సాహంతో...

కుసుమప్రియ, వంశీధర్‌ ఈ చిన్నారి తల్లిదండ్రులు. నాన్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. అమ్మ మ్యూజిక్‌ టీచర్‌. సొంతంగా బిజినెస్‌ కూడా చేస్తున్నారు. వీళ్లిద్దరూ ప్రత్యేక శ్రద్ధ కనబరిచి మన స్నిగ్ధకు చేయూత అందిస్తున్నారు. ముఖ్యంగా ‘నా విజయాల వెనక మా అమ్మ ప్రోత్సాహం చాలా ఉంది’ అంటోంది ఈ చిన్నారి. ఇంత చిన్న వయసులోనే ఇన్ని విభాగాల్లో తన ప్రత్యేకతను చాటుతున్న మన స్నిగ్ధ ఎంతైనా గ్రేట్‌ కదూ! భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధించాలి అని మనమూ తనకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుదామా మరి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని