Published : 13 Sep 2022 00:44 IST

రయ్‌ రయ్‌.. రికార్డులోయ్‌!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనందరికీ స్కేటింగ్‌ బోర్డు మీద నిల్చొని రయ్‌ రయ్‌మంటూ దూసుకెళ్లడం ఎంతో ఇష్టం కదూ! ఏదో సరదాగా ఆడుకోవడం వరకూ అయితే ఓకే.. కానీ రికార్డు సాధించే స్థాయిలో ఎక్కువ మంది నేర్చుకోరు. ఓ నేస్తం మాత్రం స్కేటింగ్‌ బోర్డుకంటే కాస్త విభిన్నంగా ఉండే కాస్టర్‌ బోర్డుతో ఏకంగా ప్రపంచ రికార్డే సాధించాడు. ఆ వివరాలే ఇవీ..

గుజరాత్‌ రాష్ట్రంలోని వడోదరకు చెందిన హార్దిక్‌కు ప్రస్తుతం 11 సంవత్సరాలు. ఈ నేస్తం సరదాగా ప్రారంభించిన కాస్టర్‌ (వేవ్‌) బోర్డు ప్రాక్టీస్‌.. ఇటీవల తన పేరును గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లోకి చేర్చింది. నిమిషంలో ఎక్కువసార్లు బోర్డును గుండ్రంగా తిప్పిన వ్యక్తిగా గుర్తింపు సాధించాడు.

అనుకోకుండా ఒకరోజు..

ఏడో తరగతి చదువుతున్న హార్దిక్‌ మూడేళ్ల క్రితం సరదాగా వేవ్‌ బోర్డుపైన ఆడుకోవడం ప్రారంభించాడు. ఒకరోజు అలా ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ బోర్డుతో గుండ్రంగా తిరిగాడు. అప్పుడే తాను బోర్డును గుండ్రంగా కూడా తిప్పగలనని, తనలో ఆ ప్రతిభ ఉందని గుర్తించాడు. ఆ విషయాన్ని తండ్రికి చెప్పడంతో, ఆయన ఏదైనా రికార్డు సాధించే ప్రయత్నం చేయాలని సూచించారు. ఏ శిక్షణకూ వెళ్లకుండానే.. సొంతంగా ప్రాక్టీస్‌ చేయసాగాడు. అలా ఏడాదిపాటు బోర్డుతో సర్కిళ్లు వేయడంపైనే తీవ్రంగా శ్రమించాడు.

రికార్డును తిరగరాసి..

వేవ్‌ బోర్డుపైన పట్టు సాధించాక.. తన ప్రతిభ విషయాన్ని గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులకు సమాచారం అందించాడు హార్దిక్‌. గిన్నిస్‌ బుక్‌ వారి ఆధ్వర్యంలో గత జనవరిలో నిమిషం వ్యవధిలోనే 22 సర్కిళ్లు తిరిగాడు. అంటే బోర్డుతో 360 డిగ్రీలు తిరిగితే ఒక సర్కిల్‌ అవుతుందన్నమాట. నిమిషంలో ఎక్కువ రోటేషన్లు చేసిన వ్యక్తిగా గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు సంబంధిత వివరాలను నమోదు చేసుకున్నారు. తాజాగా బాలుడి పేరు రికార్డు చేసినట్లు అధికారిక సమాచారం అందించారు. ఇప్పటివరకూ నిమిషంలో 18 రొటేషన్లు చేసిన అమెరికా యువకుడైన 17 సంవత్సరాల జువియర్‌ లోపెజ్‌ పేరిట ఆ రికార్డు ఉండేది. అతడికి 2019లోనే ఈ గుర్తింపు దక్కింది. ఆ యువకుడి కంటే నాలుగు రౌండ్లు ఎక్కువ వేసి, పాత రికార్డును చెరిపేశాడు మన హార్దిక్‌.

అదీ తేడా..

ఎక్కువ మందికి స్కేటింగ్‌ బోర్డే తెలిసి ఉంటుంది. దానికంటే కొంచెం భిన్నం ఈ కాస్టర్‌ బోర్డు. దీన్నే వేవ్‌ బోర్డు అని కూడా అంటారు. స్కేటింగ్‌ బోర్డు దీర్ఘచతురస్రాకారంలో నాలుగు చక్రాలతో ఉంటే.. ఈ వేవ్‌ బోర్డు మాత్రం కాస్త వంకర టింకరగా రెండు చక్రాలే ఉంటాయట. మామూలు బోర్డుతో పోల్చుకుంటే ఇది కాస్త వేగంగా దూసుకెళ్తుందట. భవిష్యత్తులో వ్యోమగామి కావడమే తన లక్ష్యమని చెబుతున్నాడీ బాలుడు. అంతేకాదు నేస్తాలూ.. వేవ్‌ బోర్డుతో ఎక్కువ రొటేషన్లు చేసి, అందులోనూ గిన్నిస్‌ రికార్డు సాధిస్తాడట. ఇంకేం.. హార్దిక్‌కు మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని