Published : 14 Sep 2022 01:18 IST

భలే.. భలే.. అలక్‌పుర!

వాళ్లంతా బాలికలు! కానీ మైదానంలో దిగితే మాత్రం కదనరంగంలో కాళికలు! ఫుట్‌బాల్‌లో సత్తా చాటుతున్న చిరుతలు.. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా!

అది హరియాణా రాష్ట్రంలోని ఓ మూరుమూల గ్రామం. ఆ పల్లె పేరు అలక్‌పుర. ఈ ఊరు పేరు చెప్పగానే పత్తి, గోధుమ పంటలు గుర్తుకు వస్తాయి. కానీ ఇప్పుడు వీటితో పాటు ఫుట్‌బాల్‌ కూడా మదిలో మెదులుతుంది. ఈ గ్రామంలో వందల సంఖ్యలో బాలికలు ఫుట్‌బాల్‌ నేర్చుకుంటున్నారు మరి.

ఉదయం.. సాయంత్రం..

వీళ్లంతా కలిసి ఏఎఫ్‌సీని ఏర్పాటు చేసుకున్నారు. ఏఎఫ్‌సీ అంటే అలక్‌పుర ఫుట్‌బాల్‌ క్లబ్‌. ఈ క్లబ్‌లోని సభ్యులంతా బాలికలే. కోచ్‌ కూడా మహిళే. ఆమె పేరు సోనియా బిజారియా. వీళ్లంతా రోజూ రెండుసార్లు ఫుట్‌బాల్‌ ప్రాక్టీస్‌ చేస్తారు. ఉదయం 5:30కే మైదానంలోకి వచ్చివాలతారు. ప్రాక్టీస్‌ చేసుకుని స్కూలుకు వెళతారు. మళ్లీ స్కూలు నుంచి రాగానే సాయంత్రం మరోసారి ప్రాక్టీస్‌ చేస్తారు.

గ్రామస్థులే కొండంత అండ!

ఈ ఏఎఫ్‌సీ నిర్వహణకు కావాల్సిన సౌకర్యాలన్నీ అలక్‌పుర గ్రామస్థులే చూసుకుంటున్నారు. నిధులూ వాళ్లే సమకూరుస్తున్నారు. ఇంతా చేస్తే ఆ గ్రామంలో ఉండేది కేవలం 2,000 మందే. అయినా వాళ్లంతా తమ ఆడపిల్లలు ఫుట్‌బాల్‌లో రాణించడం కోసం తమ వంతు చేయూత ఇస్తున్నారు. గత సంవత్సరమే అలక్‌పుర టీమ్‌ ‘ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌’లో అధికారికంగానూ నమోదైంది. అలక్‌పుర ఫుట్‌బాల్‌ క్లబ్‌కు ఎప్పుడైనా నిధులు అవసరమైతే.. ఊరు ఊరంతా కదిలి వస్తుంది. కొందరు వంద రూపాయలిస్తారు. మరికొందరు అయిదువేల రూపాయలు ఇస్తారు. ఇలా ఎవరి స్తోమతకు తగ్గట్లు వాళ్లు ఆర్థికసాయం చేస్తారు. ఈ పల్లె ప్రజల్లో ఉన్న చైతన్యం, ఐకమత్యమే నేడు ఈ గ్రామాన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది.

అడుగు అడుగు కలిపి...

అలక్‌పుర ఫుట్‌బాల్‌ టీమ్‌ ‘నేషనల్‌ ఇంటర్‌ స్కూల్‌ కాంపిటేషన్‌- 2014’లో సత్తా చాటి మొదటిసారిగా వార్తల్లో నిలిచారు. తర్వాత 2016, 2017లోనూ గెలిచారు. హర్యానా రాష్ట్ర ఫుట్‌బాల్‌ జట్టులోనూ పలువురు అలక్‌పుర గ్రామానికి చెందిన క్రీడాకారిణులు ఉన్నారు. అండర్‌-14, అండర్‌-17, అండర్‌-19 టీముల్లోనూ అలక్‌పుర ప్రాతినిధ్యం ఉంది. 

ఆరంభం ఎలా అంటే...

అది 2008వ సంవత్సరం అలక్‌పురలో గోవర్ధన్‌ దాస్‌ అనే స్పోర్ట్స్‌ టీచర్‌ ఉండేవారు. ఆయన కొంతమంది బాలురకు ఫుట్‌బాల్‌లో శిక్షణ ఇస్తుండేవారు. ఓ రోజు కొంతమంది బాలికలు ఆయన్ను కలిసి తమకూ శిక్షణ ఇవ్వమని కోరారు. కానీ ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ వాళ్లు మళ్లీ మళ్లీ ఇలా దాదాపు ప్రతిరోజూ అడిగే సరికి ఆయన అయిష్టంగానే వాళ్లకొక పాత ఫుట్‌బాల్‌ ఇచ్చారు. అప్పటికీ ఆయన శిక్షణ ఇవ్వలేదు. బాలికలే సొంతంగా ప్రాక్టీస్‌ చేసుకున్నారు. కానీ వాళ్లలో పట్టుదల ఆయనకు నచ్చింది. బాలురకంటే వేగంగా వాళ్లు ఆటలో మెలకువలు సొంతంగా నేర్చుకుంటుండటం చూసి ఆయనకు ముచ్చటేసింది. తర్వాత వాళ్లకు ఆయన శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత వారు జిల్లా స్థాయిలో జరిగిన పోటీల్లో సత్తాచాటారు. అలా అలక్‌పుర బాలికల్లో ఉన్న ప్రతిభ బయట ప్రపంచానికి తెలిసింది. అలా అప్పటి నుంచి దశలవారీగా ఆ పల్లెలో బాలికల అడుగులు ఫుట్‌బాల్‌ వైపు పడ్డాయి.. పడుతూనే ఉన్నాయి. త్వరలో అసోంలో జరగనున్న ఫుట్‌బాల్‌ లీగ్‌లోనూ పాల్గొననున్నారు. మరి మనం వాళ్లకు మనసారా ఆల్‌ ది బెస్ట్‌ చెబుదామా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని