Updated : 16 Sep 2022 00:43 IST

కుస్తీమే సవాల్‌!

అది ఓ పట్టణం... అక్కడ చాలామంది కుస్తీ వీరులు ఉన్నారు! ఇప్పుడిప్పుడే బాలికలూ కుస్తీలో మెలకువలు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ పెద్దసంఖ్యలో రెజ్లింగ్‌లో ఆరితేరిన బాలికలున్నారు. మరి ఆ వివరాలేంటో మనమూ తెలుసుకుందామా.. 

ర్ణాటక రాష్ట్రం గదగ్‌ పట్టణంలో 2017లో కేవలం ఎనిమిది మంది అమ్మాయిలు మాత్రమే కుస్తీ తెలిసినవారు ఉండేవారు. కానీ ఇప్పుడా సంఖ్య బాగా పెరిగింది. జాతీయ, అంతర్జాతీయ పోటీల కోసం వీరు నిత్యం అబ్బాయిలతో కలిసి ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఇదంతా చదువుతుంటే మనకు దంగల్‌ సినిమా గుర్తుకు వస్తుంది కదూ! అందుకే స్థానికులు దంగల్‌ 2.0 అంటుంటారు.

జాతీయ స్థాయిలో...

ఈ పట్టణానికి చెందిన ప్రేమ ఆసియన్‌ ఛాంపియన్‌ షిప్‌, వరల్డ్‌ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌ గెలుచుకుంది. అలాగే షహిదా కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలను కైవసం చేసుకుంది. వీళ్లు ఎంతోమందిలో స్ఫూర్తి రగిలించడంతోపాటు ఆడపిల్లలకు కుస్తీ పోటీలు ఎందుకు అని తటపటాయించిన వారి అపోహలను పటాపంచలు చేశారు. మిగిలిన బాలికలనూ కుస్తీ వైపు వచ్చేలా చేశారు.

పెద్దలు వద్దన్నారు..

‘అసలు ఆడపిల్లలకు ఈ కుస్తీ పోటీలు అవసరమా...?’ అని ముందు చాలా మంది తల్లిదండ్రులు వెనకడుగు వేశారు. ‘ఆడపిల్లలు ఇంట్లో ఉండాలి. ఇలాంటి ప్రాణాంతక ఆటలు వాళ్లకు అవసరం లేదు’ అని తేల్చేశారు. కానీ శరణప్ప బేలేరీ అనే కోచ్‌ అతి కష్టం మీద వాళ్ల అభిప్రాయాలు మార్చగలిగారు. మొదట కేవలం ఎనిమిది మంది బాలికల్నే వారి తల్లిదండ్రులు కుస్తీ నేర్చుకోవడానికి ప్రోత్సహించారు. ఎన్నో ఆర్థిక అడ్డంకులను అధిగమించిమరీ బేలేరీ వాళ్లకు శిక్షణ ఇచ్చారు.

నిరుత్సాహపరిచినా...

ఎనిమిది మంది బాలికలు శిక్షణకు అయితే వచ్చారు కానీ.. చుట్టుపక్కల వారు మాత్రం తమ మాటలతో నిరుత్సాహపరిచారు. ‘ఆ.. ఆడ పిల్లలకు కుస్తీ ఏం వస్తుందిలే. ఒకవేళ వచ్చినా.. పతకాలు వస్తాయా ఏంటి?’ అని ఆటపట్టించారు. కానీ ఎప్పుడైతే ప్రేమ అంతర్జాతీయ స్థాయిలో పతకాలు నెగ్గిందో అప్పుడు వెక్కిరింతలు తగ్గాయి. మిగతా ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు కుస్తీ నేర్పించడానికి ముందుకొచ్చారు.

చుట్టుపక్కల గ్రామాల నుంచీ...

కేవలం గదగ్‌ నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా కుస్తీలో శిక్షణ కోసం వస్తున్నారు. ఉదయం 6:30 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4:30 నుంచి 7:30 వరకు రెండుపూటలా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రెజ్లర్ల సంఖ్య బాగా పెరగడంతో బృందాలుగా ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా వీళ్లు సాధన చేస్తున్నారు. మరి వాళ్లకు మనం ఆల్‌ ది బెస్ట్‌ చెబుదామా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని