కంచెలు చెరిపిన కుంచె!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ‘మీకు బొమ్మలు గీయడం అంటే ఇష్టం ఉందా?’ - మనల్ని ఎవరైనా ఈ ప్రశ్న అడిగితే ‘ఓ.. ఉంది’ అని హుషారుగా సమాధానం చెబుతాం. ఉన్నది ఉన్నట్లు, చూసింది చూసినట్లు గీయడమే చాలామందికి అలవాటు.

Published : 21 Sep 2022 00:07 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ‘మీకు బొమ్మలు గీయడం అంటే ఇష్టం ఉందా?’ - మనల్ని ఎవరైనా ఈ ప్రశ్న అడిగితే ‘ఓ.. ఉంది’ అని హుషారుగా సమాధానం చెబుతాం. ఉన్నది ఉన్నట్లు, చూసింది చూసినట్లు గీయడమే చాలామందికి అలవాటు. కానీ, ఓ నేస్తం మాత్రం అందుకు భిన్నంగా వెళ్తున్నాడు. చాలామంది చెప్పే ‘అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌’ అనే మాటను పాటిస్తూ.. చేతల్లోనూ చూపిస్తున్నాడు. ఆ వివరాలే ఇవీ..

కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌కు చెందిన అమన్‌ షాజియా అజయ్‌కు ఎనిమిది సంవత్సరాలు. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న ఈ బాబుకు చిత్రలేఖనం అంటే చాలా ఆసక్తి. అందరూ గీసే వాటిలా కాకుండా తన బొమ్మలు కొత్తగా ఉండాలని అనుకుంటాడు. అలా అనుకున్నాడు కాబట్టే.. తన పెయింటిగ్స్‌కు గొప్ప గొప్ప అవకాశాలు దక్కుతున్నాయి.

ఏడాదిన్నర నుంచే..

ఏడాదిన్నర వయసు నుంచే బొమ్మలు గీయడం ప్రారంభించాడట అమన్‌. క్రమంగా ఆ అలవాటే ఇష్టంగా మారింది. అలా అయిదేళ్లకే తాను గీసిన చిత్రాలతో ఓ ఎగ్జిబిషన్‌ను కూడా ఏర్పాటు చేశాడు. ‘సాధారణంగా బుద్ధుడి బొమ్మ ఎలా ఉంటుంది?’ - ప్రశాంతమైన ముఖంతో చూడగానే ఓ మంచి భావన కలిగించేలా ఉంటుంది. ఎవరినైనా బుద్ధుడి బొమ్మ గీయమన్నా.. అలాగే గీస్తుంటారు. కానీ, ఈ నేస్తం మాత్రం పొట్టచెక్కలయ్యేలా నవ్వుతున్నట్లు బుద్ధుడి చిత్రాన్ని గీశాడు. అది చూసిన వారందరూ ‘అలా ఎందుకు గీశావు?’ అని అడిగితే.. ‘ఎప్పుడు ఒకేలా ఆలోచిస్తే ఎలా.. అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌ అన్నట్లుగానూ ప్రయత్నించాలి. నేను అదే చేస్తున్నా’ అని సమాధానమిస్తున్నాడీ నేస్తం.

అరుదైన అవకాశం

మనలాంటి పిల్లలు గీసిన పెయింటింగ్‌లను మహా అయితే ఏం చేస్తాం.. ఓ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేస్తాం. కానీ, మన అమన్‌ గీసిన చిత్రాలను మాత్రం అక్కడి ప్రభుత్వ బడ్జెట్‌ హ్యాండ్‌బుక్‌లకు ముందూ, వెనక అట్టలపైన ముద్రించారట. వర్షం పడుతుండగా, ఓ బాలుడు కిటికీలోంచి బయటకు చూస్తున్న చిత్రాన్ని సర్కారు పంపిణీ చేసే స్కూల్‌ డైరీల మీద అచ్చు వేశారట. ఇలా ఈ నేస్తం ఘనతలు చాలానే ఉన్నాయట. మరో విశేషం ఏంటంటే.. 2018లో కేరళను వరదలు ముంచెత్తిన విషయం మీకు తెలిసే ఉంటుంది. ఆ సమయంలో ఈ బాలుడు గీసిన కొన్ని చిత్రాలను ఆన్‌లైన్‌లో వేలం వేశారట. అలా సమకూరిన రూ.34,500ను బాబు తల్లిదండ్రులు ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారట. రాష్ట్రంలోని ప్రముఖ ఆర్ట్‌ గ్యాలరీల్లో, కార్యక్రమాల్లో ఈ నేస్తం గీసిన చిత్రాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అంతేకాదు.. కొందరు కవులూ, రచయితలు అడిగి మరీ.. అమన్‌తో బొమ్మలు గీయించుకుంటున్నారట. ఇంత ప్రతిభ ఉన్న ఈ నేస్తం నిజంగా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు