Published : 01 Oct 2022 00:12 IST

హన.. ప్రతిభ ఔరా..!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. చాలామందికి ఐఫోన్‌, ఐపాడ్స్‌ తదితర ఆపిల్‌ ఉత్పత్తులంటే బోలెడు ఇష్టం. అవి ఎంత బాగుంటాయో.. వాటి ధర కూడా అదేస్థాయిలో ఉంటుంది. మరి, అటువంటి ఖరీదైన ఉత్పత్తులు తయారు చేసే ఆపిల్‌ సంస్థ సీఈఓ నుంచే ప్రశంసలు అందితే ఎలా ఉంటుంది?.. అమ్మో.. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం కదూ! ఇప్పుడు అటువంటి ఆనందమే ఓ చిన్నారికి దక్కింది. ఇంతకీ ఆ వివరాలేంటో తెలుసుకుందామా..

భారత సంతతికి చెందిన హన వాళ్ల కుటుంబం చాలా ఏళ్ల క్రితమే దుబాయ్‌లో స్థిరపడింది. అక్కడే పుట్టి పెరిగిన హనకు ప్రస్తుతం తొమ్మిది సంవత్సరాలు. గతేడాది తాను సొంతంగా ఓ స్టోరీ టెల్లింగ్‌ ఆప్‌ని రూపొందించింది. ఆ వివరాలను ఆపిల్‌ కంపెనీ సీఈఓ టిమ్‌ కుక్‌కు ఈమెయిల్‌ చేసింది. అయితే, ఇటీవల ఆ మెయిల్‌కు టిమ్‌ కుక్‌ నుంచి ప్రశంసాపూర్వక స్పందన రావడంతో ఆ చిన్నారి ఆనందానికి హద్దుల్లేవు.

అయిదేళ్లకే కోడింగ్‌..
చిన్నప్పటి నుంచి హనకు టెక్నాలజీ, కోడింగ్‌ అంటే ఆసక్తి ఉండేది. అలా అయిదేళ్ల వయసులోనే కోడింగ్‌ నేర్చుకోవడం ప్రారంభించింది. తల్లిదండ్రులు కూడా సహకరించడంతో అక్క లీనా ఫాతిమాతో కలిసి స్థానికంగా జరిగే అనేక పోటీలకు కూడా హాజరై.. తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది.

తన పేరు మీదే..
తాను నేర్చుకున్న కోడింగ్‌తో గతేడాది ఓ స్టోరీ టెల్లింగ్‌ ఆప్‌ని సొంతంగా అభివృద్ధి చేసింది హన. పిల్లలకు రకరకాల కథలు చెప్పే ఆ ఆప్‌కి ‘హనాస్‌’ అని పేరు కూడా పెట్టింది. ఇందులో పిల్లల కోసం కొన్ని ప్రీలోడెడ్‌ కథలు ఉంటాయన్నమాట. వాటితోపాటు తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పాలనుకుంటున్న బెడ్‌టైమ్‌, క్లాసిక్‌, నీతి తదితర కథలను ఇందులో ముందే రికార్డు చేసి పెట్టొచ్చు. చిన్నారులకు నచ్చినప్పుడు ఎంచక్కా వాటిని వినొచ్చన్నమాట. దీనివల్ల పిల్లలు తమ తల్లిదండ్రుల వాయిస్‌తోనే కథలు వినడంతోపాటు వారికి దగ్గరగా ఉన్నామనే భావనను పొందుతారట.

ఎవరి సహాయం లేకుండా..
ఆప్‌ను పూర్తిస్థాయిలో రూపొందించిన తర్వాత.. దాన్ని పరిశీలించమని కోరుతూ.. తన తండ్రి సాయంతో ఆపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌కు మెయిల్‌ చేసిందట హన. ఆయన చిన్నారి ప్రతిభను మెచ్చుకుంటూ తిరిగి మరో మెయిల్‌ పంపారట. అంతేకాదు.. భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలు చేయాలని అభినందనలూ తెలిపారట. అయితే, ఈ ఆప్‌ కోసం ఎటువంటి థర్డ్‌పార్టీ కోడ్‌లు ఉపయోగించలేదనీ, ఇతర లైబ్రరీల నుంచి కూడా ఎలాంటి సమాచారాన్ని తీసుకోలేదని చెబుతుందీ బాలిక. ఇంకో విశేషం ఏంటంటే.. ఈ ఆప్‌ డిజైన్‌ కోసం హన సొంతంగా 10 వేల లైన్ల కోడింగ్‌ డెవలప్‌ చేసిందట. వచ్చే ఏడాది జరగనున్న ఆపిల్‌ వరల్డ్‌వైడ్‌ డెవలపర్స్‌ సమావేశంలో పాల్గొనబోతున్నట్లు, ఈ తరవాత ఈ ఆప్‌ను ఆపిల్‌ స్టోర్‌లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు హన చెబుతోంది. ఇంత చిన్న వయసులోనే అద్భుత ప్రతిభ చూపుతున్న ఈ నేస్తం చాలా గ్రేట్‌ కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని