చిన్న వయసు.. పెద్దల ప్రశంసలు

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనకు టీచర్‌ నుంచో, కుటుంబ సభ్యుల నుంచో ప్రశంసలు వస్తేనే ఎగిరి గంతేస్తాం. ఏ విషయంలోనైనా స్నేహితులు పొగిడితే.. తెగ సంబరపడిపోతాం. ఇంతకంటే ఇంకేం కావాలని అనుకుంటాం. అలాంటిది.. సచిన్‌ తెందూల్కర్‌, బిల్‌ గేట్స్‌లాంటి ప్రముఖులే స్వయంగా అభినందిస్తే.. ఇక ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం.

Published : 04 Oct 2022 00:42 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనకు టీచర్‌ నుంచో, కుటుంబ సభ్యుల నుంచో ప్రశంసలు వస్తేనే ఎగిరి గంతేస్తాం. ఏ విషయంలోనైనా స్నేహితులు పొగిడితే.. తెగ సంబరపడిపోతాం. ఇంతకంటే ఇంకేం కావాలని అనుకుంటాం. అలాంటిది.. సచిన్‌ తెందూల్కర్‌, బిల్‌ గేట్స్‌లాంటి ప్రముఖులే స్వయంగా అభినందిస్తే.. ఇక ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. ఇప్పుడు అలాంటి సంతోషమే ఓ నేస్తానికి దక్కింది. అతడెవరో, అతడు సాధించిన విజయాలేంటో తెలుసుకుందాం మరి..

హారాష్ట్ర రాజధాని ముంబయి నగరానికి చెందిన అన్షుల్‌ భట్‌కు ప్రస్తుతం 13 సంవత్సరాలు. గత ఆగస్టులో ఇటలీలో జరిగిన ట్రాన్స్‌నేషనల్‌ బ్రిడ్జ్‌ ఛాంపియన్‌షిప్‌(కార్డ్స్‌తో ఆడే ఆట)లో మూడు బంగారు పతకాలు సాధించి చరిత్ర సృష్టించాడు. అంతేకాదు.. కప్‌ సాధించిన అతి పిన్న వయస్కుడిగానూ నిలిచాడు.

ప్రతిభను గుర్తించిన తండ్రి

అన్షుల్‌ వాళ్ల నాన్న ఓ వ్యాపారి. ఈ నేస్తానికి నాలుగేళ్ల వయసున్నప్పుడు ఒకరోజు నాయనమ్మ, తాతయ్యతో కలిసి కార్డ్స్‌ గేమ్‌ ఆడుతున్నాడట. ఆ సమయంలో అన్షుల్‌లోని ప్రతిభను తండ్రి గమనించారు. కొడుకులోని నైపుణ్యాలకు పదును పెడితే అద్భుతాలు సృష్టించగలడని అప్పుడే నమ్మారాయన. వెంటనే ఓ కోచ్‌ సహాయంతో కార్డ్స్‌ గేమ్‌లో శిక్షణ ఇప్పించారు. అలా కొద్దిరోజుల్లోనే ఆటలో పట్టు సాధించాడీ బాలుడు. ఆరేళ్ల వయసులో తొలిసారిగా పోటీలో పాల్గొన్నాడట. అలా క్రమంగా జిల్లా, రాష్ట్రం నుంచి ఏకంగా అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు.

సచిన్‌ నుంచి ఫోన్‌

ట్రాన్స్‌నేషనల్‌ బ్రిడ్జ్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు ఇటీవల ఇటలీకి వెళ్లిన అన్షుల్‌కు ఓ ఊహించని సంఘటన ఎదురైంది. అదేంటంటే.. క్రికెట్‌ గాడ్‌గా పిలుచుకునే సచిన్‌ తెందూల్కర్‌ తనకు ఫోన్‌ చేయడం. హోటల్‌లో ఉన్న బాలుడికి కొత్త నంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ఎవరబ్బా అని మాట్లాడితే.. అప్పుడు తెలిసింది అవతలి వ్యక్తి సచిన్‌ అని. ఒత్తిడిని అధిగమించి, లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో తనకు వివరించాడట. సచిన్‌ మాటలు తనకెంతో స్ఫూర్తినిచ్చాయని, తెలియని కొత్త ఉత్సాహంతో పోటీల్లో అద్భుత ప్రతిభ చూపినట్లు చెబుతున్నాడు అన్షుల్‌. ఆ పోటీల్లో ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌తోపాటు డబుల్స్‌, బృంద విభాగంలోనూ బంగారు పతకాలను కైవసం చేసుకున్నాడు. ట్రోఫీ గెలిచిన అతి పిన్న వయస్కుడిగానూ చరిత్ర సృష్టించాడు.


బిల్‌గేట్స్‌ ట్వీట్‌..

తాజాగా మన అన్షుల్‌ని అభినందిస్తూ.. మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ ధనికుల్లో ఒకరైన బిల్‌ గేట్స్‌ ఓ ట్వీట్‌ చేశారు. కాలక్షేపం కోసం తాను ఎక్కువగా ఆడే ఆట ఇదేననీ, ఇందులో కొత్త ఛాంపియన్‌ గురించి తెలుసుకున్నందుకు సంతోషంగా ఉందని ఆయన వెల్లడించారు. అంతేకాదండోయ్‌.. అభినందనలు చెప్పడం కాస్త ఆలస్యమైందనీ, భవిష్యత్తులో మరిన్ని విజయాలూ సాధించాలని ఆకాంక్షించారాయన. ప్రముఖుల ప్రశంసలు అందుకోవడమంటే మాటలు కాదు కదా.. అందుకే, మనమూ ఈ నేస్తానికి కంగ్రాట్స్‌ చెప్పేద్దాం ఫ్రెండ్స్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని