Published : 10 Oct 2022 00:27 IST

పిట్టకొంచెం.. రికార్డు ఘనం!

బుడిబుడి అడుగుల బుడత ప్రతిభలో మాత్రం చిరుత.. తన బుజ్జి బుజ్జి మాటలతో.. చిన్ని చిన్ని పలుకులతో... అలరించడమే కాదు... అలవోకగా.. రికార్డులూ సృష్టిస్తోంది... ఇంతకీ ఎవరా చిన్నారి?ఏంటా ఘనత..? తెలుసుకుందామా..!

మూడున్నరేళ్లకే 350 పేర్లు చెప్పేసింది. అది కూడా కేవలం ఆరు నిమిషాల్లో...! చిలుక పలుకులతో ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు దక్కించుకుంది తూర్పుగోదావరి జిల్లాకు చెందిన హవీల. చిన్నపిల్లలు సాధారణంగా మూడేళ్లు వచ్చేసరికి ముద్దుముద్దుగా మాట్లాడుతుంటారు. వచ్చీరాని పదాలు పలుకుతుంటారు. అలాంటి వయసులో రాజమహేంద్రవరం నారాయణపురానికి చెందిన జి.కృష్ణకమల్‌, డాక్టర్‌ అపర్ణ సోనీల కుమార్తె హవీల క్రిస్టీనా ప్రిన్సెస్‌ మాత్రం రికార్డులు నమోదు చేస్తోంది.

పుట్టుకతోనే..

కొంతమంది పుట్టుకతోనే రికార్డులు సృష్టిస్తారు. ఆ కోవకు చెందిన చిన్నారే హవీల. కాకినాడలో జన్మించిన ఈ చిన్నారి పుట్టినప్పుడు 4.51 కేజీల బరువుతో అప్పట్లో రికార్డు సృష్టించింది. ప్రస్తుతం మూడున్నరేళ్ల హవీల 60 రకాల జంతువుల పేర్లు, 50 రకాల పండ్లు, 40 రకాల పక్షులు, 35 రకాల కూరగాయలు, 40 శారీరక భాగాలు, 40 వివిధ వృత్తుల పేర్లు, చదరంగంలో పదాలు, ట్రాఫిక్‌ సిగ్నళ్లు, 20 మంది జాతీయ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు చకచకా చెప్పేస్తోంది. ఇదంతా కేవలం ఆరు నిమిషాల్లోనే చెప్పటం గమనార్హం. దీంతో ఈమె ప్రతిభను గుర్తించిన ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ నిర్వాహకులు గత జులైలో వచ్చి వీడియో చిత్రీకరించారు. ఇప్పటి వరకు ఇటువంటి రికార్డు ఎవరి పేరు మీదా లేకపోవటంతో ఆగస్టులో ధ్రువీకరించి సర్టిఫికెట్‌తోపాటు పతకాన్ని అందించారు.

జ్ఞాపకశక్తిని గుర్తించి...

హవీల మూడేళ్ల వయసులో తన రెండేళ్ల వయసు నాటి ఘటనలు... ఎక్కడికి వెళ్లాం. ఏం చూశాం. అప్పుడు ఏం జరిగింది... వంటి విషయాలను తల్లిదండ్రులకు చెప్పటంతో వాళ్లకు ఆశ్చర్యం కలిగింది. దీంతో తనలో జ్ఞాపకశక్తి స్థాయి చాలా ఎక్కువగా ఉందని గమనించి ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం ఒక గంటపాటు తల్లిదండ్రులిద్దరూ కలిసి పలు రకాల పండ్లు, నాయకులు, జంతువుల పేర్లను చెప్పేవారు. ఇలా కేవలం 15 రోజుల్లోనే 350 పేర్లు సులువుగా నేర్చుకుంది. తల్లిదండ్రులు వీటన్నింటినీ సరదాగా వీడియో తీసి హవీలా పేరిట యూట్యూబ్‌ ఛానెల్‌ను కూడా ప్రారంభించి అందులో అప్‌లోడ్‌ చేశారు. మొత్తానికి ఈ చిన్నారి భలే గ్రేట్‌ కదూ!

- చొల్లంగి వెంకట సుబ్రహ్మణ్యం, న్యూస్‌టుడే,శ్యామలసెంటర్‌ (రాజమహేంద్రవరం)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు