భలే.. భలే.. రబ్బరు బాలిక!

హాయ్‌ నేస్తాలూ.. మీకు ఈ రబ్బరు బాలిక గురించి తెలుసా! ఈ చిన్నారి తన ఒంటిని విల్లులా వంచుతుంది. యోగాలో పలు పతకాలు సాధించింది. ప్రధాని మోదీ నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. మరి ఈ రబ్బరు బాలిక గురించి తెలుసుకుందామా. ఇంకెందుకాలస్యం ఈ కథనం చదివేయండి.

Published : 23 Oct 2022 00:11 IST

హాయ్‌ నేస్తాలూ.. మీకు ఈ రబ్బరు బాలిక గురించి తెలుసా! ఈ చిన్నారి తన ఒంటిని విల్లులా వంచుతుంది. యోగాలో పలు పతకాలు సాధించింది. ప్రధాని మోదీ నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. మరి ఈ రబ్బరు బాలిక గురించి తెలుసుకుందామా. ఇంకెందుకాలస్యం ఈ కథనం చదివేయండి.

సూరత్‌కు చెందిన అన్వి విజయ్‌ వయసు 13 సంవత్సరాలు. ఈ చిన్నారిని ‘రబ్బర్‌ గర్ల్‌ ఆఫ్‌ సూరత్‌’ అని ముద్దుగా పిలుస్తారు. ఈమె శరీరం రబ్బరులా వంగుతుంది. అందుకే అన్వికి ఆ ముద్దుపేరు వచ్చింది. మీకో విషయం తెలుసా.. మన అన్వికి చాలా పెద్ద ఆరోగ్య సమస్య ఉంది. గుండెలో ఏదో లోపం ఉంది. దీనికి సంబంధించి శస్త్రచికిత్స కూడా జరిగింది. అయినా నిరుత్సాహ పడకుండా తనకిష్టమైన యోగాలో అద్భుతాలు సాధిస్తోంది. దీంతోపాటు ఆమెకు పుట్టుకతోనే మరికొన్ని ఆరోగ్య సమస్యలూ ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పటి వరకు దాదాపు 40 యోగా పోటీల్లో పాల్గొని ఏకంగా 51 పతకాల వరకు తన ఖాతాలో వేసుకుంది.

నిద్రాసనం!

‘ఏంటీ నిద్రాసనం..? దీని గురించి మాకు తెలియదే.. ఇదేం ఆసనం. కొత్తగా కనిపెట్టారా?’ అనుకోకండి. అన్వి తనకు పది సంవత్సరాల వయసున్నప్పుడు తన పాదాన్ని ఏకంగా తన తల మీద పెట్టుకుని నిద్రపోయిందట. దీన్ని చూసిన ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. తమ కూతురికి యోగాలో శిక్షణ ఇప్పించడం ప్రారంభించారు. కేవలం మూడేళ్లలోనే తను ప్రావీణ్యం సాధించింది.

ప్రధాని ప్రశంసలు

ఇంత చిన్న వయసులోనే అంత ఘనత సాధించిన చిన్నారి అన్వి 2022 సంవత్సరానికి గాను ‘ప్రధాన్‌ మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌’ అవార్డుకు ఎంపికైంది. ప్రధాని మోదీ నుంచి ప్రశంసలూ అందుకుంది. ప్రధానితో కలిసి ఒకే వేదిక మీద యోగా, సూర్యనమస్కారాలు చేయాలని మన అన్వి ఉవ్విళ్లూరుతోంది. మరి తన ఆశయం నెరవేరాలని మనమూ మనసారా కోరుకుందామా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని