ఎంత మంచి అన్నయ్యో!

హాయ్‌ నేస్తాలూ.. మనకు యూనిఫాం, పుస్తకాలు, సరైన ఆహారం.. ఇలా అన్నీ ఉన్నా, బడికి వెళ్లాలంటే మాత్రం మారాం చేస్తాం. కానీ, ఓ చోట మాత్రం సరైన వసతులు లేక, అవగాహన కల్పించేవారు కొరవడి పిల్లలంతా చదువుకు దూరమవుతున్నారు.

Published : 27 Oct 2022 00:10 IST

హాయ్‌ నేస్తాలూ.. మనకు యూనిఫాం, పుస్తకాలు, సరైన ఆహారం.. ఇలా అన్నీ ఉన్నా, బడికి వెళ్లాలంటే మాత్రం మారాం చేస్తాం. కానీ, ఓ చోట మాత్రం సరైన వసతులు లేక, అవగాహన కల్పించేవారు కొరవడి పిల్లలంతా చదువుకు దూరమవుతున్నారు. అటువంటి వారి కోసమే ఓ అన్నయ్య ముందుకొచ్చాడు. ఆ పిల్లలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతున్నాడు. ఆ వివరాలే ఇవీ..

డిశా రాష్ట్రంలోని చాలా గ్రామాలు అడవులు, కొండలకు ఆనుకొనే ఉంటాయి. వాటిల్లో కొన్ని మరీ వెనకబడి, కనీస అవసరాలూ కొరవడుతుంటాయి. సంబల్‌పూర్‌ జిల్లాలో కొన్ని మారుమూల గ్రామాల్లోని పిల్లలు ఇటీవలే బడిబాట పడుతున్నారు. దీనివెనక ఓ అన్నయ్య కృషి దాగి ఉంది.

తల్లిదండ్రులతో పాటు పనికి..

అభినాష్‌ మిశ్రా అనే ఓ అన్నయ్య అటవీ శాఖలో ఉద్యోగి. తొలిసారిగా సంబల్‌పూర్‌ జిల్లాలో ఆయనకు పోస్టింగ్‌ వచ్చింది. విధుల్లో భాగంగా అటవీ ప్రాంతాల్లో పర్యటించే సమయంలో, చుట్టుపక్కల ఉండే గిరిజన గ్రామాలకూ వెళ్తుండేవాడు. ఆ సమయంలో అక్కడి పిల్లలు చదువుకోకుండా పెద్దలతోపాటు పనికి వెళ్లడాన్ని గమనించాడు. ప్రభుత్వ పాఠశాలలు ఆయా గ్రామాలకు కాస్త దూరంలో ఉండటమే అందుకు కారణమని తెలుసుకున్నాడు. ఆ పిల్లల కోసం ఏదైనా చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు.

సొంత ఖర్చులతో..

తన ఆలోచనను డిగ్రీ పూర్తి చేసిన ఓ యువతికి చెప్పడంతో.. ఆమె సహకారంతో ఓ ట్యూషన్‌ సెంటర్‌ను ప్రారంభించాడు. తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌లో ఆమెతోనే తరగతులు చెప్పిస్తున్నాడు. అలాగని, ఊరికే అనుకోకండి ఫ్రెండ్స్‌.. ఆమెకు ప్రతినెలా రూ.2 వేలు పారితోషికం కూడా చెల్లిస్తున్నాడీ అన్నయ్య. అలా ఈ ట్యూషన్‌లో చేరిన 21 మంది పిల్లలు.. సమీప పాఠశాలల్లో చేరారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో, మిగతా గ్రామాల్లోనూ ట్యూషన్‌ కేంద్రాలను నెలకొల్పాలనుకున్నాడు. ఆయా ప్రాంతాల్లో కాస్త చదువుకున్న యువతీయువకుల వివరాలను సేకరించి, వారితో మాట్లాడాడు. అలా మొత్తం ఇప్పటివరకూ 219 మంది పిల్లలను పాఠశాలల్లో చేర్పించాడు. దీనంతటికీ అయ్యే ఖర్చును ఈ అన్నయ్యతో పాటు పోలీసు శాఖలో పనిచేస్తున్న ఆయన భార్య, ఇతర బంధువులే సమకూరుస్తున్నారట. గిరిజన పిల్లలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతున్న ఈ అన్నయ్యను ఇటీవల ఒడిశా గవర్నర్‌ సత్కరించారు. ఈ ప్రోత్సాహంతో జిల్లాలోని ఇతర గిరిజన గ్రామాల్లోనూ ట్యూషన్‌ కేంద్రాలను ప్రారంభించాలని చూస్తున్నాడు. చూశారు కదా.. ఈ పిల్లలు చదువు కోసం ఎంత కష్టపడుతున్నారో.. అందుకే, అన్ని వసతులున్న మనం కూడా మారాం చేయకుండా బుద్ధిగా బడికెళ్దాం.. సరేనా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని