Published : 29 Oct 2022 01:13 IST

మూడేళ్ల బుడత.. జ్ఞాపకశక్తిలో ఘనత!

హాయ్‌ నేస్తాలూ.. మూడేళ్ల వయసు పిల్లలు ఏం చేస్తారు? - బాగా అల్లరి చేస్తూ.. పెద్దవాళ్లకు పట్టరాని కోపం తెప్పిస్తుంటారు. ఇంటి చుట్టూ పరుగులు పెడుతూ.. అప్పుడప్పుడే అక్షరాలు నేర్చుకుంటుంటారు. కానీ, ఓ నేస్తం మాత్రం చిరుప్రాయంలోనే జ్ఞాపకశక్తితో ఔరా అనిపిస్తున్నాడు. అంతేకాదు.. రికార్డులూ సాధించేస్తున్నాడు. ఇంతకీ ఆ నేస్తం ఎవరో, తన ప్రతిభ ఏంటో తెలుసుకుందామా..

దిల్లీకి చెందిన దేవాన్ష్‌ వయసు మూడేళ్లు. ఆడుతూపాడుతూ సరదాగా గడిపే ఈ వయసులోనే ప్రపంచ దేశాల పేర్లు, వాటి జెండాలను గుర్తుపట్టడమే కాకుండా.. ప్రముఖ శాస్త్రవేత్తలు, వారి ఆవిష్కరణ గురించి కూడా గుక్కతిప్పుకోకుండా గడగడా చెప్పేస్తున్నాడు. పిట్ట కొంచెం.. కూత ఘనం అన్నట్లు తన అద్బుత ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

అక్క ప్రాక్టీస్‌ చూసి..

ఒకరోజు దేవాన్ష్‌ వాళ్ల అక్క.. ఏదో స్కూల్‌ ప్రోగ్రాం కోసం స్పీచ్‌ రాసుకొని ప్రిపేర్‌ అవుతోంది. పక్కనే కూర్చొని, అక్క ప్రాక్టీస్‌ చేస్తున్న విధానాన్ని నాలుగు రోజులు జాగ్రత్తగా గమనించసాగాడు దేవాన్ష్‌. మరుసటి రోజు రాత్రి నిద్రపోకుండా.. అద్దం ముందు నిల్చొని, అక్క స్పీచ్‌ను ఈ నేస్తం అక్షరం తేడా లేకుండా చెప్పడాన్ని తల్లిదండ్రులు దూరం నుంచే పరిశీలించారు. అందులోని కఠిన పదాలనూ అలవోకగా పలికాడట. అప్పుడే తమ కుమారుడిలోని ప్రతిభను వారు గుర్తించారు.

చూస్తే చాలు..

అప్పటి నుంచి దేవాన్ష్‌కు తల్లిదండ్రులు వివిధ అంశాల గురించి ఓపిగ్గా వివరించడం ప్రారంభించారు. అలా కొద్దిరోజుల్లోనే 195 దేశాల పేర్లు చెబుతూ... వాటి జెండాలను గుర్తుపట్టే స్థాయికి ఎదిగాడీ చిన్నోడు. వాటితోపాటు 50 మంది శాస్త్రవేత్తలు, వారి ఆవిష్కరణలనూ ఇట్టే చెప్పేస్తున్నాడు. మన దేశంలోని అన్ని రాష్ట్రాలూ, వాటి రాజధానులను అలవోకగా చెప్పగలడు. అంతేకాదు ఫ్రెండ్స్‌.. 20 రకాల పండ్లు, పూల పేర్లతోపాటు, వాటి శాస్త్రీయ నామాలనూ చెబుతున్నాడు. కొన్ని ఆకారాలూ, వివిధ రంగులూ, జీవులు, చారిత్రక ప్రదేశాలు, గ్రహాలు, సంగీత వాయిద్యాల పేర్లు కూడా ఈ నేస్తానికి తెలుసు.

అవార్డు కూడా..

ఈ బుడతడి ప్రతిభ వాళ్లింటి వరకే పరిమితం కాలేదు. ఇటీవల ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ ప్రతినిధులు కూడా దేవాన్ష్‌ ప్రతిభను ప్రత్యక్షంగా పరీక్షించారట. చిన్నోడి జ్ఞాపకశక్తికి మెచ్చి.. అతడి పేరిట రికార్డు కూడా నమోదు చేశారు. త్వరలోనే అందుకు సంబంధించిన ధ్రువపత్రం కూడా అందించనున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. మూడేళ్లకే ఇన్ని ఘనతలు సాధించిన ఈ నేస్తం.. భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సృష్టించాలని మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు