Published : 01 Nov 2022 00:17 IST

హరిత ‘బడి’!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనం స్కూల్‌ నుంచి ఇంటికెళ్లేటప్పుడు ఉదయం పట్టుకెళ్లిన పుస్తకాల బ్యాగ్‌తోపాటు లంచ్‌ బాక్స్‌ను తిరిగి తీసుకెళ్తాం. కానీ, ఓ బడి విద్యార్థులు మాత్రం వాటితోపాటు విత్తనాలు, మొక్కలు కూడా తీసుకెళ్తుంటారు. ఇది నిజంగా నిజం.. టీచర్లే వాటిని పిల్లలకు ఇచ్చి.. ఇంటి దగ్గర నాటాలని సూచిస్తున్నారట. ఇంతకీ ఆ స్కూల్‌ ఎక్కడో, ఆ విత్తనాల కథేంటో తెలుసుకుందామా..

కేరళ రాష్ట్రం కోజికోడ్‌ పరిధిలోని కన్నోత్‌ ప్రభుత్వ పాఠశాలలో ‘సీడ్‌ లైబ్రరీ’ని నిర్వహిస్తున్నారు. బడి ఆవరణలోనే కొన్ని డబ్బాల్లో వివిధ రకాల విత్తనాలతో ఉపాధ్యాయులే దీన్ని ఏర్పాటు చేశారు. పిల్లల్లో పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయం విలువ, రైతుల కష్టం తెలియాలనే ఉద్దేశంతోనే ఈ సీడ్‌ లైబ్రరీని ప్రారంభించారు.

బహుమతులు కూడా..

కన్నోత్‌ పాఠశాల వరండాలో నడుచుకుంటూ వెళ్తుంటే.. ఒకచోట గోడకు తగిలించిన అల్మారాలో వందలకొద్దీ గాజు డబ్బాలు కనిపిస్తాయి. వాటిలో రకరకాల విత్తనాలు మొలకెత్తుతూ ఉంటాయి. మొక్కలు పెంచాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులు, ఆ ‘సీడ్‌ లైబ్రరీ’ని పర్యవేక్షించే టీచర్‌ వద్దకు వెళ్తే సరి. ఏ రకం మొక్కలు కావాలో మనం ఆ టీచర్‌కు చెబితే.. వాటిని పెంచే విధానం, ఎరువుల వాడకం తదితర వివరాలన్నీ చెబుతారట. సాయంత్రం మనం బడి నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు అడిగిన విత్తనాలు లేదా మొక్కలను తీసుకెళ్లొచ్చు. ఇలా ఇప్పటివరకూ దాదాపు 900 ప్యాకెట్ల విత్తనాలను పంపిణీ చేశారట. వాటిని తీసుకెళ్లిన విద్యార్థులు ఇంటి ఆవరణల్లో నాటుతారు. మొక్కలను బాగా పెంచిన వారికి బహుమతులు కూడా ఉంటాయి. ‘సీడ్‌ లైబ్రరీ’లో పదుల సంఖ్యలో పప్పు ధాన్యాలతోపాటు మిరప, కూరగాయల విత్తనాలు ఉన్నాయట.

ఇంటి పంట ఆవశ్యకత..

ఇలా విద్యార్థుల ఇళ్ల ఆవరణలోనే మొక్కల పెంపకంతో వారికి వ్యవసాయం విలువతోపాటు రైతుల కష్టం కూడా తెలుస్తుందని టీచర్లు చెబుతున్నారు. అంతేకాదు నేస్తాలూ.. సాగు విధానం తెలియడంతోపాటు ఆరోగ్యకర ఆహారం లభిస్తుంది. స్కూల్‌ ఆవరణలోనూ కొంత స్థలంలో మొక్కల పెంపకం చేపడుతున్నారట. ఆ బడికి అనుబంధంగా ‘చిల్డ్రన్స్‌ ఫారెస్ట్‌’ పేరిట దాదాపు 150 చెట్లతో ఓ చిట్టడిని తయారు చేశారు. మొదటి నుంచి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చే ఈ స్కూల్‌.. ఇటీవలే సిల్వర్‌ జూబ్లీ పూర్తి చేసుకుందట. అంతేకాదు.. ఈ సంవత్సరం కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘వనమిత్ర’ అవార్డు కూడా దక్కించుకుంది. కేవలం పాఠాలే కాకుండా పర్యావరణ పరిరక్షణ అంశాలూ బోధిస్తున్న ఈ స్కూల్‌ నిజంగా గ్రేట్‌ కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు