Published : 05 Nov 2022 00:19 IST

బెలూన్లు పోయాయి.. బహుమతులు వచ్చాయి!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ‘పుట్టినరోజు ఎప్పుడొస్తుందా? ఎప్పుడు కేక్‌ కట్‌ చేద్దామా?’ అని మనం ఎదురుచూస్తుంటాం కదూ! ఆరోజు స్నేహితులను, బంధువులను పిలిచి చాక్లెట్లు, బిస్కెట్లు పంచి.. ఘనంగా సెలబ్రేట్‌ చేసుకుంటాం. బర్త్‌డే రోజు బడి ఉంటే.. ఇక మన ఆనందానికి అవధులు ఉండవు. ఓ నేస్తానికి కూడా పుట్టినరోజు సందర్భంగా అలాంటి అనుభవమే ఎదురైంది. ఆ వివరాలే ఇవీ..

మెరికాకు చెందిన కసోన్‌ జాన్సన్‌కు ఎనిమిది సంవత్సరాలు. ప్రస్తుతం రెండో తరగతి చదువుతున్న ఈ బాలుడి పుట్టినరోజు సందర్భంగా టీచర్లు, స్నేహితులంతా కలిసి స్కూల్‌లో ఇటీవల వేడుకలు నిర్వహించారు. సాయంత్రం తరగతులు ముగిశాక.. బెలూన్లు, చాక్లెట్లు తీసుకొని ఇంటికి బయలుదేరాడు కసోన్‌. దారిలో పెద్ద గాలి వీయడంతో ఆ బెలూన్లు కాస్తా ఎగిరిపోయాయి. అవి అలా 804 కిలోమీటర్ల ప్రయాణించి, హూలర్‌ అనే వ్యక్తి ఇంటి ఆవరణలోని గార్డెన్‌ ఫెన్సింగ్‌కు చిక్కుకున్నాయి. అదే సమయంలో గార్డెన్‌ను శుభ్రం చేస్తున్న ఆ అంకుల్‌ వాటిని చూశాడు.

రిటర్న్‌ గిఫ్ట్‌..

ఆ బెలూన్లను జాగ్రత్తగా బయటకు తీసిన హూలర్‌.. వాటిలో ఒకదానికి అతికించి ఉన్న కవర్‌ను తెరిచి చూశాడు. అందులో మన కసోన్‌ పుట్టినరోజు అని తెలిపే సమాచారంతోపాటు స్కూల్‌ పేరు, ఇతర వివరాలు కూడా ఉన్నాయి. ఆ అంకుల్‌కి విషయం అర్థం కావడంతో.. బాలుడికి ఏదైనా సర్‌ప్రైజ్‌ ఇవ్వాలనుకున్నాడు. కవర్‌లోని వివరాల ఆధారంగా స్కూల్‌ ప్రతినిధులతో మాట్లాడి, కసోన్‌ చిరునామా తెలుసుకున్నాడు. ఆయన చెక్కతో వివిధ వస్తువులు చేసే వ్యక్తి కావడంతో.. మరుసటి రోజే కొన్ని చెక్క బొమ్మలతోపాటు వంద డాలర్లను బాలుడికి పుట్టినరోజు బహుమతిగా పంపించాడు. అంటే.. మన కరెన్సీలో దాదాపు రూ.8300 అన్నమాట. ఆ ప్యాక్‌లో బహుమతులతోపాటు ఓ లెటర్‌ కూడా ఉంచాడాయన. బాలుడితోపాటు అతడి తల్లిదండ్రులు ఆ లెటర్‌ను చదవి.. ఉబ్బితబ్బిబ్బయ్యారట. ఈ విషయం మొత్తాన్ని ఆ స్కూల్‌ ప్రతినిధులే.. సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించడంతో, అది వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా ఆలస్యంగానైనా బాలుడికి పుట్టినరోజు విషెస్‌ తెలుపుతూనే.. హూలర్‌ అంకుల్‌ మంచి మనసును అభినందిస్తున్నారు. కసోన్‌కు ఈ బర్త్‌డే జీవితాంతం గుర్తుండిపోతుందనీ కామెంట్లు పెడుతున్నారు. బెలూన్లు ఎగిరిపోవడమేంటి.. వందల కిలోమీటర్లు ప్రయాణించడమేంటి.. అవి హూలర్‌ చూడటమేంటి.. ఆయన రిటర్న్‌ గిఫ్ట్‌ పంపడమేంటి.. ఇదంతా చూస్తుంటే, ఈ పుట్టినరోజు మాత్రం కసోన్‌కు మరపురానిదిగా నిలిచిపోతుందని అనిపిస్తుంది కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు