విజేతల మాట.. భవితకు బాట!

పన్నెండేళ్లకే ఓ స్టార్టప్‌కు సీఈఓ.. బాల విజేతలతో ఇంటర్వ్యూలు చేస్తుంది.. అలా వారి స్ఫూర్తిని మిగతా పిల్లలకూ అందిస్తోంది.. బోలెడు ప్రశంసలూ అందుకుంటోంది.. ఇంతకీ తనెవరో, పూర్తి వివరాలేంటో.. ఆ నేస్తం మాటల్లోనే తెలుసుకుందాం..

Published : 11 Nov 2022 00:03 IST

పన్నెండేళ్లకే ఓ స్టార్టప్‌కు సీఈఓ.. బాల విజేతలతో ఇంటర్వ్యూలు చేస్తుంది.. అలా వారి స్ఫూర్తిని మిగతా పిల్లలకూ అందిస్తోంది.. బోలెడు ప్రశంసలూ అందుకుంటోంది.. ఇంతకీ తనెవరో, పూర్తి వివరాలేంటో.. ఆ నేస్తం మాటల్లోనే తెలుసుకుందాం..

నా పేరు హాసిని లక్ష్మీనారాయణన్‌. మాది చెన్నై. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. ఆ ప్రతిభ కొందరికి స్వతహాగా తెలిస్తే, మరికొందరికి ఇతరుల స్ఫూర్తి మాటలు తెలిసేలా చేస్తాయి. చిన్నారుల్లో దాగి ఉన్న శక్తిని ప్రపంచానికి చాటాలనే ఉద్దేశంతో ‘ది ఫస్ట్‌ స్టెప్‌’ అనే స్టార్టప్‌తోపాటు యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించా. ఆ వేదికగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాల విజేతల స్ఫూర్తిగాథలను పరిచయం చేస్తున్నా.

ఆ ఆలోచన ఎలా వచ్చిందంటే..  

రెండేళ్ల క్రితం నాన్నతో కలిసి ఓ సభకు వెళ్లా. అక్కడ ప్రముఖుల ప్రసంగాలకు సభికుల స్పందన చూసి ఆశ్చర్యపోయా. ‘మాటలకు అంత బలముందా?’ అనిపించింది. నేనూ పిల్లల కోసం ఇలా మారతానని నాన్నతో చెప్పా. ఆయన సలహాతో ‘ది ఫస్ట్‌ స్టెప్‌’ పేరిట యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించా. అదే పేరుతో ఓ స్టార్టప్‌ కూడా స్థాపించా. వివిధ రంగాల్లో విజేతలుగా నిలిచిన పిల్లలతో మాట్లాడి, ఆ వివరాలను వాటిల్లో అప్‌లోడ్‌ చేయాలని నిర్ణయించుకున్నా. అందుకోసం బాగా మాట్లాడటం ప్రాక్టీస్‌ చేశా. మొదట్లో బాల విజేతలను ఎంచుకోవడం కాస్త కష్టమైంది. పెద్దవాళ్ల సలహాతో.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రతిభ కనబరుస్తున్న పిల్లలను సోషల్‌ మీడియా ద్వారా సంప్రదించడం ప్రారంభించా. లక్ష్యసాధనకు పడిన కష్టాన్ని వారితోనే చెప్పిస్తూ.. ఇంటర్వ్యూలు చేశా. వాటిని యూట్యూబ్‌ ఛానెల్‌లో పోస్ట్‌ చేయడం మొదలుపెట్టా. ఇప్పటివరకూ వివిధ దేశాలకు చెందిన దాదాపు 120మందికి పైగా బాల విజేతలతో మాట్లాడా. వారి ప్రతిభ ప్రపంచానికి తెలిసిన తీరుతోపాటు కుటుంబ సభ్యులు, టీచర్ల ప్రోత్సాహం.. మిగతా పిల్లల్ని ఎంతో ఆలోచింపజేస్తున్నాయి. తమిళనాడులో ఓ మారుమూల గ్రామానికి చెందిన జయలక్ష్మి గాథ నన్నెంతో ప్రభావితం చేసింది. తనకు తండ్రి లేడు. తల్లి మానసిక రోగి. ఈ స్థితిలో పార్ట్‌టైం పనిచేస్తూ.. అతికష్టంగా చదువుకుంటోంది. నాసా శాస్త్రవేత్త కావాలనేది తన లక్ష్యం.

మరో పుస్తకం రాయబోతున్నా..

ప్రతిభావంతుల ఇంటర్వ్యూలను యూట్యూబ్‌లో పెట్టడంతోనే నా ప్రయత్నం ఆగిపోలేదు. వాటిని కొన్ని పత్రికలు, మ్యాగజైన్లకు అందిస్తూ.. జర్నలిస్టుగానూ మారాను. బాలల మాటలే మిగతా పిల్లల్లో స్ఫూర్తి నింపుతాయని నేను భావిస్తుంటా. అందుకే, ప్రతినెలా 4 నుంచి 6 ఇంటర్వ్యూలు చేస్తుంటా. నేను చేసిన ఇంటర్వ్యూల్లో చాలామందిని ప్రభావితం చేసిన 25 మంది గురించి ‘ది ఫస్ట్‌ స్టెప్‌’ పేరుతో ఓ పుస్తకం కూడా రాశాను. గత ఫిబ్రవరి 26న చెన్నైలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దాన్ని ఆవిష్కరించారు. ‘చిన్న వయసులో బాగా కష్టపడుతున్నావు.. శెభాష్‌’ అని మెచ్చుకున్నారాయన. పలు పుస్తక ప్రదర్శనల్లోనూ దాన్ని ఉంచాం. ఇప్పుడది అమెజాన్‌లోనూ అందుబాటులో ఉంది. త్వరలోనే మరో పుస్తకం రాయబోతున్నా. నా లక్ష్యం, పనితీరు నచ్చి.. నేను ఇంటర్వ్యూ చేసినవారిలోనే 15మంది పిల్లలు, ప్రస్తుతం నాతో కలిసి పని చేస్తున్నారు.

ప్రశంసలు, అవార్డులు..

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌, డీజీపీ శైలేంద్రబాబు, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌.. ఇలా చాలామంది ప్రముఖుల నుంచి ప్రశసంలు అందుకున్నాను. 40కి పైగా అవార్డులొచ్చాయి.

తమిళనాడు ప్రభుత్వం ఐసీడీఎస్‌ విభాగానికి నన్ను ‘యూత్‌ న్యూట్రిషన్‌ అంబాసిడర్‌’గా నియమించింది. సీఐఐ నుంచి ఔట్‌స్టాండింగ్‌ అచీవర్‌, థింక్‌ స్టార్టప్‌ అండ్‌ స్కిల్‌ ఇండియా నుంచి షి ఎట్‌ వర్క్‌, యూత్‌ ఐడియాథాన్‌, టీన్‌ప్రెన్యూర్‌ అవార్డులు దక్కాయి. ఇంకా.. వివిధ సంస్థల నుంచి యంగ్‌ అచీవర్‌, యంగెస్ట్‌ రీసెర్చ్‌, బెస్ట్‌ ఐడియా బై గర్ల్‌, యంగెస్ట్‌ యూట్యూబర్‌ తదితర పురస్కారాలూ అందుకున్నా. హైదరాబాద్‌లో జరిగిన టెడ్‌టాక్స్‌లోనూ ప్రసంగించా. చిన్నారుల కోసం ప్రభుత్వాలు నిర్వహించే కార్యక్రమాల్లో నాతో ప్రసంగాలు ఇప్పిస్తున్నారు. ఇలా 50కి పైగా కార్యక్రమాల్లో మాట్లాడా. సరదాగా ఎంచుకున్న పనే.. ఇప్పుడు ఓ ఉద్యమంలా మారింది. ఇంతకీ నా చదువు గురించి చెప్పనేలేదు కదూ.. ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నా. అమ్మానాన్నల సహకారంతో చదువుకు ఆటంకం కలగకుండానే.. ఇవన్నీ చేస్తున్నా. ఇంక ఉంటా ఫ్రెండ్స్‌.. బై బై!

- హిదాయతుల్లాహ్‌.బి, ఈనాడు, చెన్నై


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని