Published : 14 Nov 2022 00:12 IST

బుజ్జి బుజ్జి పిల్లలం.. చిన్ని చిన్ని పాపలం!

హాయ్‌ పిల్లలూ! ఈ రోజు మన పండగ. అదే నేస్తాలూ బాలల దినోత్సవం. నిజానికి ప్రపంచవ్యాప్తంగా నవంబరు 20వ తేదీన చిల్డ్రన్స్‌ డే జరుపుకొంటారు. కానీ మన దేశంలో మాత్రం నవంబరు 14న నిర్వహిస్తారు. ఎందుకో తెలుసా...? అయితే ఈ కథనం చదవండి.. మీకే తెలుస్తుంది.

వంబరు 14న బాలల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా పండుగలా జరుపుకొంటారు. మన భారతదేశ తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పుట్టిన రోజును మన దేశంలో చిల్డ్రన్స్‌ డేలా నిర్వహించుకుంటారు. నిజానికి మనం 1964 వరకు కూడా నవంబరు 20 నే బాలల దినోత్సవం జరుపుకొనేవాళ్లం. ఈ రోజునే చిల్డ్రన్‌ డే నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలన్నీ తీర్మానించాయి. 1964లో నెహ్రూ మరణించిన తర్వాత ఆయన పుట్టిన రోజును ‘బాలల దినోత్సవం’గా జరపాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి నుంచి నవంబర్‌ 14న అంటే... మిగతా ప్రపంచంతో పోల్చుకుంటే మనం ఆరురోజులు ముందుగానే ‘చిల్డన్స్ర్‌ డే’గా జరుపుకొంటున్నాం.

పిల్లలంటే చాలా ఇష్టం...

నెహ్రూ 1889 నవంబర్‌ 14న జన్మించారు. ఈయనకు పిల్లలన్నా, గులాబీలన్నా చాలా ఇష్టం. నెహ్రూ ఎక్కడికెళ్లినా.. పిల్లలు కనిపిస్తే చాలు నవ్వుతూ వాళ్లను పలకరించేవారు. వారికి కానుకలు ఇచ్చి ఆనందపడేలా చేసేవారు. పిల్లలకు కూడా పండిట్‌ నెహ్రూ అంటే చాలా ప్రేమ. ఆయన్ను ముద్దుగా ‘చాచా నెహ్రూ’, ‘చాచాజీ’ అని పిలుచుకుంటారు. అందుకే 1964లో నెహ్రూ మరణించిన తర్వాత ఆయన పుట్టిన రోజును ‘బాలల దినోత్సవం’గా నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. నాటి నుంచి నవంబర్‌ 14ను ‘చిల్డన్స్ర్‌ డే’గా జరుపుకొంటున్నాం. 

బడుల్లో ఉత్సవాలు...!

ఈ రోజున పాఠశాలల్లో పండగ వాతావరణం ఉంటుంది. పిల్లలకు ఇష్టమైన చాక్లెట్లు, మిఠాయిలు పంచిపెడతారు. వ్యాస రచన, ఉపన్యాసం, క్విజ్‌ తదితర పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తారు. అనంతరం సాంసృతిక కార్యక్రమాలతో పిల్లల్లో ఉత్సాహం నింపుతారు. పిల్లలు చాచా నెహ్రూ వేషధారణలో కూడా కనువిందు చేస్తారు.

చాచా చెప్పారు...

భయం.. మనలో ఎన్నటికీ ఉండకూడదని, మనం ధైర్యంగా ముందడుగు వేసి, విజయం సాధించాలని చాచా నెహ్రూ తరచుగా పిల్లలతో చెబుతుండేవారు. ‘ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్‌.. ఇలా భాష ఏదైనా సరే.. అక్షరమాల నుంచే క్షుణ్నంగా నేర్చుకోవాలి. ఏ విషయమైనా అంతే. మూలం నుంచే పూర్తిగా అర్థం చేసుకోవాలి. అప్పుడే దానిపై మనకు పట్టు వచ్చేస్తుంది’ అని నెహ్రూ తన కూతురు ఇందిరకు చెప్పేవారు. ‘మనం కొన్ని సార్లు అబద్ధాలాడతాం. అలా ఎప్పుడూ చేయకూడదు. మనం నిత్యం నిజాయతీగా ఉండాలి. మనం ఏ తప్పూ చేయనప్పుడు మాత్రమే అలా ఉండగలం. ఏది తప్పు ఏది ఒప్పు, ఏది చెయ్యవచ్చు, ఏది చెయ్యకూడదు అనేది మనంతట మనమే నిర్ణయించుకోగలగాలి’ అని కూడా నెహ్రూ చెబుతుండేవారు.

అంతా ఒక్కటే...

‘మనుషులంతా సమానమే. అందులో నలుపు, తెలుపు అంటూ తేడా ఏం ఉండదు. జాతిని బట్టి మనుషులకు విలువ ఇవ్వకూడదు. దేశాల చరిత్ర, గొప్ప వాళ్ల జీవిత చరిత్రలు చదవాలి. వారి గురించి చదివినప్పుడు, ఆలోచించినప్పుడే మనలోని గొప్ప వ్యక్తి బయటపడతాడు. అప్పుడే మనం అందరికీ ఆదర్శంగా ఉండగలుగుతాం. మనకంటూ ఓ చరిత్రను సృష్టించుకోగలుగుతాం’ ఇలా అనేక అంశాలను ప్రస్తావిస్తూ చిన్నారి ఇందిరలో నెహ్రూ ఆ రోజుల్లో అమితమైన ధైర్యాన్ని నింపారు. ఇలా బోలెడు విజ్ఞాన విషయాల్ని ఆయన ఉత్తరాల్లో పంచుకున్నారు. వీటిని మనమూ పాటిస్తే.. ఉన్నతంగా ఎదగవచ్చు. ఏమంటారు నేస్తాలూ...! మరోసారి మీ అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు