పదమూడేళ్లు... పన్నెండు సార్లు కన్నీళ్లు!

ఈ బుడత.. ఈతలో విజేత... ‘ఆ.. ఇందులో ఏముంది వింత! ఎంతో మంది ఈత కొడుతుంటారు... విజేతలుగా నిలుస్తుంటారు’ అంటారేమో.. కానీ ఈ చిన్నారి దివ్యాంగుడు. అయినప్పటికీ తన వైకల్యాన్ని జయించాడు. ఈతలో ఆరితేరాడు.

Updated : 20 Nov 2022 02:57 IST

ఈ బుడత.. ఈతలో విజేత... ‘ఆ.. ఇందులో ఏముంది వింత! ఎంతో మంది ఈత కొడుతుంటారు... విజేతలుగా నిలుస్తుంటారు’ అంటారేమో.. కానీ ఈ చిన్నారి దివ్యాంగుడు. అయినప్పటికీ తన వైకల్యాన్ని జయించాడు. ఈతలో ఆరితేరాడు. పతకాల మీద పతకాలు సాధిస్తున్నాడు. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆ వివరాలేంటో తెలుసుకుందామా మరి!

ర్ణాటక రాష్ట్రం బెలగావికి చెందిన అంకిత్‌ చిదంబర్‌ పిలన్‌కర్‌ వయసు 13 సంవత్సరాలు. పుట్టినప్పటి నుంచే వైకల్యంతో బాధపడుతున్నాడు. ఇప్పటివరకు 12 ఆపరేషన్లు జరిగాయి. మొట్టమొదటి సర్జరీ అంకిత్‌కు కేవలం మూడు నెలల వయసున్నప్పుడే జరిగింది. తనకు ఆరేళ్ల వయసు వచ్చేసరికే 12 సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. కాళ్లు, చేతులు, మోకాళ్లు, చెవులకూ శస్త్రచికిత్సలు జరిగాయి. అయినప్పటికీ అంకిత్‌ పరిస్థితి ఏమాత్రమూ మెరుగుకాలేదు. అసలు నడిచే పరిస్థితి కూడా లేకుండాపోయింది.

రాత మార్చిన ఈత...

అంకిత్‌ వాళ్ల నాన్న ఓ చిన్న ఫ్యాక్టరీలో పనిచేస్తారు. అమ్మ గృహిణి. కుమారుడి కోరిక మేరకు వాళ్లు ఈత నేర్పించే ప్రయత్నం చేశారు. ఆ ఈతే అంకిత్‌ తలరాతను మార్చింది. ఈత వల్ల క్రమక్రమంగా అతడి ఆరోగ్యం మెరుగుపడింది. శరీరం కూడా దృఢంగా మారింది. ప్రస్తుతం ఈ చిన్నారి ఇతరుల సాయంతో కొద్దికొద్దిగా నడవగలుగుతున్నాడు. ఈతలో మాత్రం బుల్లెట్‌లా దూసుకుపోతున్నాడు.

పతకాల విజేత!

ఈతను కేవలం వ్యాపకంగా కాకుండా... చాలా సీరియస్‌గా తీసుకున్నాడు అంకిత్‌. అందుకే పలు పోటీల్లో పాల్గొంటున్నాడు. పతకాలతో దూసుకుపోతున్నాడు. ఇలా ఇప్పటి వరకు ఏకంగా ఆరు బంగారు పతకాలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవలే అసోంలో జరిగిన 22వ పారా నేషనల్‌ స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని, 100 మీటర్లు, 50 మీటర్ల ఫ్రీస్టైల్‌, 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ సబ్‌ జూనియర్‌ విభాగంలో బంగారు పతకాలు కైవసం చేసుకున్నాడు. ‘బెస్ట్‌ స్విమ్మర్‌’ అవార్డునూ సొంతం చేసుకున్నాడు.

సాధనతో సాధించాడు...

అంకిత్‌ ఈ ఉన్నత శిఖరాలను ఒక్కరోజులో చేరుకోలేదు. ఇందుకోసం చాలా కష్టపడ్డాడు. ఏడేళ్లుగా ప్రతి రోజూ దాదాపు గంటన్నర ఈత ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. ఈ క్రమశిక్షణ, అంకితభావమే అంకిత్‌ వైకల్యాన్ని జయించి, విజేతగా నిలిచేలా చేసింది. అదే సమయంలో చదువు మీదా శ్రద్ధ చూపుతున్నాడు. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్న అంకిత్‌ మంచిమార్కులే తెచ్చుకుంటున్నాడు. ఇలా ఈతనూ, చదువునూ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెబుదామా మరి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని