వయసు చిన్న.. ఆశయం మిన్న!

హాయ్‌ పిల్లలూ.. ఖాళీ సమయాల్లో మనం ఏం చేస్తుంటాం? - సెల్‌ఫోన్‌లోనో, టీవీ చూడటంలోనో మునిగిపోతాం. అంతేకదా.. కొందరైతే బయటకెళ్లి ఆడుకుంటుంటారు. ఇంకొందరు బొమ్మలు గీయడమో, డ్యాన్స్‌ నేర్చుకోవడమో చేస్తుంటారు. గీసిన ఒకటో రెండో బొమ్మలను ఇంట్లో వారికి, స్నేహితులకు చూపించి సంబరపడిపోతాం.

Published : 22 Nov 2022 00:15 IST

హాయ్‌ పిల్లలూ.. ఖాళీ సమయాల్లో మనం ఏం చేస్తుంటాం? - సెల్‌ఫోన్‌లోనో, టీవీ చూడటంలోనో మునిగిపోతాం. అంతేకదా.. కొందరైతే బయటకెళ్లి ఆడుకుంటుంటారు. ఇంకొందరు బొమ్మలు గీయడమో, డ్యాన్స్‌ నేర్చుకోవడమో చేస్తుంటారు. గీసిన ఒకటో రెండో బొమ్మలను ఇంట్లో వారికి, స్నేహితులకు చూపించి సంబరపడిపోతాం. కానీ, ఓ నేస్తం మాత్రం తన డ్రాయింగ్స్‌తో పేద పిల్లలకు అండగా నిలుస్తోంది. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందామా..

ర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరుకు చెందిన శ్రుతికి తొమ్మిది సంవత్సరాలు. ఈ వయసులోనే చిత్రలేఖనంలో అద్భుత ప్రతిభ చూపుతోంది. అంతేకాదు.. తాను గీసిన చిత్రాలను వేలం వేస్తూ.. అనాథ శరణాలయాల్లోని పిల్లలకు అండగా నిలుస్తోంది. ప్రతి ఒక్కరితో శెభాష్‌ అనిపించుకుంటోంది.

అయిదేళ్ల నుంచే..

శ్రుతికి అయిదేళ్ల వయసున్నప్పటి నుంచే బొమ్మలు గీయడం మొదలుపెట్టింది. ఆ ఆసక్తే క్రమక్రమంగా ఇష్టంగా మారింది. ఒకసారి పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులతో కలిసి తన ఇంటికి సమీపంలో ఉన్న ఓ అనాథ ఆశ్రమానికి వెళ్లింది. అక్కడి పిల్లలను చూడగానే శ్రుతి ఆశ్చర్యపోయింది. వారికి ఆడుకునేందుకు తనలా బొమ్మలు లేవని, వేసుకున్న దుస్తులూ మురికిగా ఉండటం చూసి బాధపడింది. అమ్మానాన్నలను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంది. ఆ సమయంలోనే ఏ దిక్కూ లేని అటువంటి చిన్నారుల కోసం ఏదైనా చేయాలని అనుకుంది. ఇంటికొచ్చాక తన ఆలోచనను తల్లికి చెప్పడంతో.. బొమ్మలు గీయడంలో మరింత నైపుణ్యం సాధించి, వాటి ద్వారా వచ్చిన డబ్బులను ఆ పేద పిల్లలకు సాయంగా ఇవ్వాలని సూచించింది.

ఆన్‌లైన్‌లో వేలం వేసి..

కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఉన్న ఖాళీ సమయాన్ని తన ప్రతిభను మెరుగుపర్చుకునేందుకే ఉపయోగించుకుంది శ్రుతి. స్వతహాగా ఆర్టిస్ట్‌ అయిన తల్లి సహాయంతో ఆక్రిలిక్‌, మందాల, క్విల్లింగ్‌ తదితర నైపుణ్యాలను నేర్చుకుంది. అలా మరింత ఆకట్టుకునేలా బొమ్మలు గీయసాగింది. గతేడాది దాదాపు 30 చిత్రాలను ఆన్‌లైన్‌లో వేలం వేసి రూ.30 వేల వరకూ సంపాదించింది. ఆ మొత్తాన్ని ఇంటి దగ్గరున్న ఆశ్రమంలోని చిన్నారులకు అందించింది. తన దగ్గరున్న బొమ్మలనూ ఇచ్చేసింది.

క్యాన్సర్‌ బాధితులకు..

ఇటీవల తను గీసిన దాదాపు 100 పెయింటింగ్‌లను రోటరీ క్లబ్‌ సాయంతో వివిధ ప్రదర్శనల్లో అమ్మకానికి పెట్టిందీ చిన్నారి. వాటి ద్వారా దాదాపు లక్ష రూపాయలను పోగుచేసింది. మొన్న నవంబర్‌ 14న బాలల దినోత్సవం సందర్భంగా ఆ మొత్తాన్ని క్యాన్సర్‌ సోకిన చిన్నారుల కోసం విరాళంగా అందజేసింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఖాళీ సమయాల్లోనే బొమ్మలు గీస్తూ.. చదువుల్లోనూ రాణిస్తోంది. భవిష్యత్తులోనూ మరిన్ని బొమ్మలు గీసి.. వాటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని క్యాన్సర్‌ బాధితుల కోసం అందిస్తానని శ్రుతి చెబుతోంది. చిన్న వయసులోనే ఇంత మంచి మనసున్న ఈ నేస్తం నిజంగా గ్రేట్‌ కదూ! ఈ చిన్నారి స్ఫూర్తితో మన చుట్టుపక్కల నివసించే పేద పిల్లలకూ చేతనైన సాయం చేద్దాం ఫ్రెండ్స్‌.. సరేనా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని