Published : 26 Nov 2022 00:17 IST

బడి పిల్లలు.. భలే ఆలోచనలు!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనం రోజూ బడికి వెళ్తుంటేనో, వస్తుంటేనో రకరకాల మనుషులు కనిపిస్తుంటారు. వారంతా ఏదో ఒక పని చేసుకుంటుంటారు. వారిని ప్రతి రోజూ చూస్తున్నా.. మనం పెద్దగా పట్టించుకోం. కానీ, ఇద్దరు నేస్తాలు మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించారు. అందరితోనూ శెభాష్‌ అనిపించుకుంటున్నారు.
ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

‘హనీ హిల్‌’.. వెరీ వెల్‌..  

కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకు చెందిన రణ్‌వీర్‌ సింగ్‌ ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. అడవిలోకి వెళ్లి తేనెను సేకరించి, రోడ్ల పక్కన విక్రయించే పేదల కోసం తాను రూపొందించిన ‘హనీ హిల్‌’ ప్రాజెక్టుకు దాదాపు రూ.9 లక్షల పెట్టుబడి సాయం మంజూరైంది.  

ఒకరోజు కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తున్న రణ్‌వీర్‌కు రోడ్డు పక్కన కొందరు తేనె అమ్ముతూ కనిపించారు. కాస్త విడ్డూరంగా అనిపించడంతో వాహనాన్ని ఆపి, వారి దగ్గరకు వెళ్లాడు. ధర ఎంతో అడిగి ఆశ్చర్యపోయాడు. మార్కెట్‌లో సుమారు రూ.1000 పలికే కేజీ తేనెను రూ.200కే విక్రయిస్తున్నట్లు తెలుసుకున్నాడు. అలా డబ్బు నష్టపోతుండటంతో వారికోసం ఏదైనా చేయాలని అనుకున్నాడీ నేస్తం. ఆ సమయంలోనే అందులో ఓ వ్యాపార కోణాన్నీ గుర్తించాడు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సాయంతో ఓ బిజినెస్‌ మోడల్‌ను రూపొందించాడు. తొలి దశగా తేనె సేకరణ మీదే ఆధారపడి జీవించే కొందరిని ఒక బృందంగా ఏర్పాటు చేశాడు. తేనె సేకరించడంలో కొత్త పద్ధతులను వారికి పరిచయం చేశాడు. శుభ్రతతోపాటు మార్కెట్‌ ధరలపైనా అవగాహన కల్పించాడు. స్కూల్‌లో తన సహచర విద్యార్థులు పదిహేను మందితో ఒక జట్టును తయారు చేశాడు. రైతులు సేకరించిన తేనెను గాజు సీసాల్లో జాగ్రత్తగా ప్యాక్‌ చేయడం వీరి పని. వాటిని ‘హనీ హిల్‌’ అనే బ్రాండ్‌తో మార్కెటింగ్‌ చేయడం మొదలుపెట్టారు. ప్రారంభంలో స్కూల్‌ కార్యక్రమాల సందర్భంగా ఇతర విద్యార్థులకు, హాజరయ్యే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు విక్రయించేవారు. 200 గ్రాముల సీసాను రూ.200కి అమ్ముతూ మంచి లాభాలు పొందేవారు. ఆ డబ్బులో మూడో వంతు రైతులకే ఇచ్చేసి, మిగతాది బ్రాండ్‌ నిర్వహణకు వెచ్చిస్తున్నారు. ఈ బిజినెస్‌ మోడల్‌ బాగా నచ్చడంతో ఓ ప్రముఖ సంస్థ ఫండింగ్‌కు ముందుకొచ్చింది. పదో తరగతి అయిపోయాక.. జూనియర్‌ విద్యార్థులు తమ బ్రాండ్‌ని కొనసాగిస్తారని రణవీర్‌ ధీమాగా చెబుతున్నాడు.


ప్రథమ చికిత్సే రక్ష..

బెంగళూరుకు చెందిన విరుష్కా పాండే ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతోంది. ఇటీవల అమెరికాలోని ఓ యూనివర్సిటీలో ‘ఆరోగ్య కార్యకర్తలకు సీపీఆర్‌ నేర్పే విధానం’ పేరిట తాను చేపట్టిన ప్రాజెక్టు గురించి వివరించింది. ‘వన్‌ మిలియన్‌ వన్‌ బిలియన్‌’ కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన ఈ సెమినార్‌లో విరుష్క ప్రాజెక్టుకు రెండో బహుమతి లభించింది.

ప్రతి రోజూ ఎంతో మంది గుండె సమస్యలతో చనిపోతుండటం విరుష్కను ఆలోచనలో పడేసింది. బాధితులకు ఆ సమయంలో సీపీఆర్‌ (రెండు చేతులతో ఛాతీపైన గట్టిగా నొక్కడం) చేస్తే బతికే అవకాశం ఉందని తెలుసుకుంది. కానీ, దాని గురించి పల్లెల్లో సేవలు అందించే ఆరోగ్య కార్యకర్తలకు అంతగా తెలియదని అర్థమైంది. దాంతో హెల్త్‌ వర్కర్లకు సీపీఆర్‌ఈ చేసే విధానం, దాని ప్రాధాన్యం వివరించడాన్ని ఒక ప్రాజెక్టుగా ఎంపిక చేసుకుంది. ఇప్పటివరకూ అనేక వైద్య సదస్సులు నిర్వహించింది. చాలామందికి ప్రత్యక్షంగా సీపీఆర్‌ పైన అవగాహన కల్పించింది. ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టే ఈ ప్రాజెక్టును.. భవిష్యత్తులోనూ కొనసాగిస్తానని చెబుతోంది విరుష్క.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు