Updated : 23 Dec 2022 03:22 IST

వ్యర్థాలతో అవతార్‌ బొమ్మలు!

హాయ్‌ నేస్తాలూ.. ఇప్పుడు ఎక్కడ చూసినా ‘అవతార్‌-2’ సినిమా గురించే రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు కదూ! అవతార్‌ మొదటి భాగంతో పండోరా లోకంలోకి తీసుకెళ్లిన దర్శకుడు.. దానికి కొనసాగింపుగా వచ్చిన తాజా సినిమాలో నీటి లోపల ఓ మాయా ప్రపంచాన్నే సృష్టించాడు. ఇందులోని పాత్రలను ఓ ఇద్దరు విద్యార్థులు వ్యర్థాలతోనే తయారు చేసి ఔరా అనిపించారు. ఆ విశేషాలే ఇవీ..

పుదుచ్చెరిలోని మారుమూల గ్రామం వాణిదస్నార్‌కి చెందిన సంతోష్‌, నవనీత్‌ కృష్ణ అనే ఇద్దరు విద్యార్థులు అవతార్‌ సినిమాలో ప్రధాన పాత్రలను పోలిన బొమ్మలను రూపొందించారు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే.. కొబ్బరి చిప్పలు, మందార, తాటి ఆకుల వంటి సహజసిద్ధంగా దొరికే వ్యర్థాలతోనే తయారు చేయడమే. ఆ చిత్ర దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ మీద ఉన్న అభిమానంతోనే తాము ఈ బొమ్మలను రూపొందించినట్లు వారు చెబుతున్నారు.

బహుమతులుగా..

వాణిదస్నార్‌ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు గత కొన్నేళ్లుగా సమీపంలోని కొబ్బరి, పామాయిల్‌, అరటి తోటల నుంచి ఎండిన ఆకులను, పువ్వులను సేకరిస్తూ.. వాటితో కళాకృతులను తయారు చేస్తున్నారు. వ్యర్థాలు, పర్యావరణహిత ఉత్పత్తులతో వివిధ రకాల బొమ్మలు తయారు చేసే ఆసక్తి ఉన్న ఈ బడి విద్యార్థులంతా కలిసి ఓ బృందంగా ఏర్పడ్డారు. ఈ బృందం ఆధ్వర్యంలో రూపొందించే బొమ్మలకు స్థానికంగా మంచి డిమాండ్‌ ఉంది. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ గ్రాఫిక్స్‌తో చేసే బొమ్మలను.. ఈ పిల్లలు గ్రామం చుట్టుపక్కల దొరికే సామగ్రితో తయారు చేయడం వెనక.. తమ పెయింటింగ్‌ టీచర్‌ ఉమాపతి ప్రోత్సాహం ఎంతో ఉందని చెబుతున్నారు. అంతేకాదు.. మొక్కజొన్న పొట్టు, బెండ్లు, వెదురు, చెక్క ముక్కలూ వీరికి ముడిసరకేనట.

మరింత మందికి ప్రేరణగా..

ఈ స్కూల్‌ విద్యార్థులు కళాకృతులను తయారు చేయడమే కాకుండా ఆ విధానాన్ని వివరిస్తూ.. గ్రామస్థులకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేకంగా కొందరు మహిళలు దీన్ని వృత్తిగానూ ఎంచుకున్నారట. సెలవు రోజుల్లో శిక్షణ పొందుతూ.. మెలకువలు నేర్చుకుంటున్నారు. వీరు ఎంతో అందంగా మలిచే బొమ్మలను బహుమతులుగా మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు. అంతకుముందు ఈ బడి విద్యార్థులు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై బొమ్మను కూడా తయారు చేశారు. నేస్తాలూ.. ఈ స్కూల్‌ పిల్లల టాలెంట్‌ భలే ఉంది కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని