Updated : 22 Jan 2023 00:35 IST

చదరంగంలో చిరుత!

చదరంగంలో చిరు చిరుత! ఒక్కో ఎత్తు వేస్తే... విజయం తన సొత్తు! ప్రత్యర్థేమో చిత్తు చిత్తు! అందివచ్చిన అవకాశాలతో.. ఆకాశమే హద్దుగా ముందుకు సాగుతున్నాడు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు. ఇంతకీ ఎవరా చదరంగ వీరుడు. సాధించిన ఘనతలేంటో తెలుసుకుందామా.. మరింకెందుకాలస్యం ఈ కథనం చదివేయండి!

మంచిర్యాల జిల్లా ఐబీ.తాండూరు మండలం రేపల్లెవాడ గ్రామానికి చెందిన లక్ష్మి, సమ్మయ్య దంపతుల కుమారుడు ఆకాశ్‌ కుమార్‌. ప్రస్తుతం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. నాన్న ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆకాశ్‌ ఇటీవల శ్రీలంకలో జరిగిన 16వ ఏషియన్‌ స్కూల్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సొంతం చేసుకున్నాడు.

నాలుగో తరగతి నుంచే...

ఆకాశ్‌ నాలుగో తరగతి చదువుతున్న సమయంలో తండ్రి సమ్మయ్య చదరంగాన్ని కుమారుడికి పరిచయం చేశారు. ఆటలో మెలకువలను నేర్పారు. ఆకాశ్‌ సైతం చెస్‌పై మక్కువ పెంచుకున్నాడు. ఎంతో ఇష్టంగా ఆటను నేర్చుకున్నాడు. ఆ తరువాత 5వ తరగతి కోసం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చేరాడు. ఆకాశ్‌ అయిదో తరగతి చదువుతున్న సమయంలోనే, తెలంగాణ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల నుంచి 2019లో అకాడమీలను స్థాపించింది. వివిధ క్రీడలకు సంబంధించి మొత్తం 24 అకాడమీలను ఏర్పాటు చేశారు. ఆకాశ్‌ ఎంపిక కావడంతో, హైదరాబాద్‌ షేక్‌పేటలోని అకాడమీలో చేరాడు. ఇక్కడ విద్యతో పాటు చదరంగంలో తర్ఫీదు ఇస్తున్నారు.

సత్తా చాటుతూ...

ఇలా శిక్షణ తీసుకుంటూ, రాష్ట్రస్థాయి చదరంగం పోటీలతోపాటు జాతీయస్థాయిలోనూ ఆకాశ్‌కుమార్‌ తన సత్తా చాటాడు. అంతటితో ఆగిపోకుండా అంతర్జాతీయ ఛాంపియన్‌ షిప్‌లోనూ తన ప్రతిభను కనబర్చాడు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన 16వ ఏషియన్‌ పాఠశాలల చెస్‌ ఛాంపియన్‌ షిప్‌ అండర్‌-17 విభాగంలో పాల్గొని రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. త్వరలో తమిళనాడులో జరగబోయే జాతీయ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో ఆకాశ్‌ పాల్గొనబోతున్నాడు. ఇందులో టాప్‌-4లో నిలిస్తే.. ఏప్రిల్‌లో గ్రీస్‌లో జరగనున్న పోటీల్లో పాల్గొనేందుకు అర్హత దక్కుతుంది. దాని కోసం నిరంతర సాధన చేస్తున్నాడు.

చాలా నైపుణ్యం ఉంది...

ఆకాశ్‌ నైపుణ్యం కలిగిన ఆటగాడని శిక్షకుడు శివకుమార్‌ అంటున్నారు. అకాడమీలో చేరినప్పటి నుంచి ఆకాశ్‌కు ఈయనే శిక్షణ ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆటపై ఏకాగ్రత పెంచుకునే మెలకువలు నేర్పిస్తున్నారు. సలహాలు, సూచనలు అందిస్తున్నారు. గురుకుల పాఠశాలల విద్యార్థుల కోసం రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన అకాడమీల ద్వారానే ఆకాశ్‌ వంటి ఎందరో మట్టిలోని మాణిక్యాలు బయటకు వస్తున్నారంటున్నారు.


ప్రభుత్వ సహకారంతోనే..

తాను రాష్ట్ర ప్రభుత్వ సహాయ, సహకారాల వల్లే చదరంగంలో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నానని ఆకాశ్‌ చెబుతున్నాడు. చెస్‌లో శిక్షణ తీసుకోవాలంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం అకాడమీలు ఏర్పాటు చేసి ఉచితంగా తర్ఫీదు ఇస్తోంది. నాణ్యమైన విద్యను సైతం అందిస్తోందని ఆకాశ్‌ ఆనందంగా చెబుతున్నాడు. భవిష్యత్తులో గ్రాండ్‌ మాస్టర్‌ కావడమే తన లక్ష్యమంటున్నాడు ఈ చదరంగ చిరుత. మరి ఆకాశ్‌ అనుకున్నది సాధించాలని మనమూ మనసారా కోరుకుంటూ.. ఆల్‌ ది బెస్ట్‌ చెబుదామా!


జ్యోతికిరణ్‌, ఈటీవీ, హైదరాబాద్‌ బ్యూరో


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని