జయహో.. శ్రీ సాహితి!

అంతవరకు వినిపించిన బస్సు హారన్‌... ప్రయాణికుల హాహాకారాలతో చిన్నబోయింది! బస్సు పరుగు ఒక్కసారిగా ఆగింది. పంటకాలువలో బోల్తాకొట్టింది. అందులోనే ప్రయాణిస్తున్న ఓ చిన్నారి తన ధైర్యాన్ని ప్రదర్శించింది.

Updated : 23 Jan 2023 06:17 IST

అంతవరకు వినిపించిన బస్సు హారన్‌... ప్రయాణికుల హాహాకారాలతో చిన్నబోయింది! బస్సు పరుగు ఒక్కసారిగా ఆగింది. పంటకాలువలో బోల్తాకొట్టింది. అందులోనే ప్రయాణిస్తున్న ఓ చిన్నారి తన ధైర్యాన్ని ప్రదర్శించింది. సమయస్ఫూర్తితో వ్యవహరించింది. తన ప్రాణాలను తాను కాపాడుకుని, ఎంతోమందినీ రక్షించింది. సాహసబాలిక పురస్కారానికి ఎంపికైంది. ఆ ధైర్యశాలి పేరే శ్రీ సాహితీ వినూత్న. ఆ సాహస బాలిక గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా మరి.

శ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన పోతప్రగడ బాలసాయి శ్రీ సాహితీ వినూత్న.. సాహస బాలిక-2020 పురస్కారాన్ని అందుకోనుంది. ఈ చిన్నారి తండ్రి రమేష్‌ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తల్లి లలిత ప్రసూన.. గృహిణి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఛైల్డ్‌ వెల్ఫేర్‌(ఐసీసీడబ్ల్యూ) సంస్థ సాహస బాలలకు ఏటా ప్రకటించే పురస్కారం 2020కి గాను శ్రీ సాహితీ వినూత్న ఎంపికైంది. మూడేళ్లుగా ఈ పురస్కారాలను ఇవ్వలేదు. ఈ నెల 25వ తేదీలోపు శ్రీ సాహితి ఈ పురస్కారం అందుకోనుంది. అనంతరం దిల్లీలో ఈ నెల 26న జరిగే వేడుకల్లో పాల్గొననుంది. గత మూడేళ్లలో దేశవ్యాప్తంగా ఇలా 56 మంది ఎంపికయ్యారు.

బహుమతి అందుకుని వస్తుండగా...

భీమవరం డీఎన్నార్‌ కాన్వెంట్‌లో చదువుతుండగా జిల్లాస్థాయిలో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో బహుమతి అందుకునేందుకు 2020 జనవరి 25న ఏలూరుకు వెళ్లింది. కలెక్టర్‌ చేతుల మీదుగా బహుమతి అందుకుని తిరిగొచ్చే సమయంలో శ్రీ సాహితి ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు రహదారి పక్కనున్న పంటకాలువలో బోల్తాపడింది. ఆ సమయంలో తనతోపాటు వ్యాయామ ఉపాధ్యాయురాలు ఇందిర, స్నేహితులు, ప్రయాణికులు ఉన్నారు.

అద్దాలు పగలకొట్టి.. ఆదుకుని...

ఒక్కసారిగా బస్సు బోల్తాపడటంతో అందరూ హాహాకారాలు చేశారు. శ్రీ సాహితి ఆందోళన చెందకుండా, సమయస్ఫూర్తితో వ్యవహరించింది. బస్సు అద్దాలను పగలకొట్టి బస్సు నుంచి బయటపడింది. కిటికీ అద్దాలను ఊచతో తొలగించి బస్సులో ఉన్న మిగతావారిని కూడా బయటకు తీసింది. తనను తాను రక్షించుకుని, ఇతరులనూ రక్షించిన శ్రీ సాహితి ధైర్యసాహసాలకు తగిన గుర్తింపు రావాలని అప్పటి జిల్లా విద్యాశాఖాధికారిణి సీవీ రేణుక, ఎన్‌సీసీ ఏవో అన్సార్‌ మహ్మద్‌ సూచనలతో సాహసబాలల పురస్కారానికి దరఖాస్తు పంపించారు.

ఎన్‌సీసీ వల్లే...

పాఠశాలస్థాయిలోనే ఎన్‌సీసీలో చేరడంతో ధైర్యంగా వ్యవహరించగలిగానని, అందుకే ప్రమాద సమయంలో తనతోపాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడగలిగానని అంటోంది శ్రీ సాహితి. అంతేకాదు నేస్తాలూ! ఈ చిన్నారి బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎన్‌సీసీ క్యాడెట్‌గా 2019 రిపబ్లిక్‌ డే ప్రీ పెరేడ్‌లో  పాల్గొంది. కరాటేలో బ్లాక్‌బెల్ట్‌ సాధించింది. షటిల్‌ టోర్నమెంట్‌లో జిల్లాస్థాయిలో విజేతగా నిలిచింది. శాస్త్రీయ సంగీతంలోనూ పలువురి ప్రశంసలు అందుకుంది. ఎంతైనా శ్రీసాహితీ వినూత్న చాలా గ్రేట్‌ కదూ!

కేఎన్‌వీ కృష్ణ, భీమవరం పట్టణం, న్యూస్‌టుడే


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని