మూడేళ్ల బుడత.. రికార్డు ఘనత!

హాయ్‌ నేస్తాలూ.. ‘మూడేళ్ల వయసు పిల్లలు ఏం చేస్తుంటారు?’ - అల్లరి చేస్తూ.. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడేస్తుంటారు.. కొందరేమో అప్పుడప్పుడే బడికెళ్లడం ప్రారంభిస్తుంటారు.

Published : 08 Mar 2023 00:35 IST

హాయ్‌ నేస్తాలూ.. ‘మూడేళ్ల వయసు పిల్లలు ఏం చేస్తుంటారు?’ - అల్లరి చేస్తూ.. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడేస్తుంటారు.. కొందరేమో అప్పుడప్పుడే బడికెళ్లడం ప్రారంభిస్తుంటారు.. అంతే కదా.. కానీ, ఓ బాబు మాత్రం ఏకంగా రికార్డే సృష్టించాడు. ఇంతకీ అతడెవరో, తన ప్రతిభ ఏంటో తెలుసుకుందామా..!

తమిళనాడు రాష్ట్రంలోని విల్లుపురం పట్టణానికి చెందిన దర్శన్‌కు ప్రస్తుతం మూడు సంవత్సరాలు. అయితే, ఎల్‌కేజీ చదువుతున్న ఈ బాబుకు జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ. ఎంతలా అంటే.. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన జెండాలను అతి తక్కువ సమయంలో గుర్తుపట్టేంతలా.. అంతేకాదు.. ఇటీవల ‘ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోనూ చోటు దక్కించుకున్నాడు.

చిన్నతనం నుంచే ప్రతిభ..

అందరూ అద్భుత జ్ఞాపకశక్తితో జన్మించరు కదా.. కానీ, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. దాన్ని గుర్తించి.. పదును పెడితేనే ఎవరైనా అద్భుతాలు సృష్టించగలరు. అలాగే, తమ కుమారుడు దర్శన్‌ తెలివితేటలను తల్లిదండ్రులు చిన్నతనంలోనే గుర్తించారు. అప్పటి నుంచే చదువుతోపాటు జ్ఞాపకశక్తిని పెంపొందించే వివిధ అంశాలను నేర్పించసాగారు. అలా ఒక్కో దేశ జెండాను చూపిస్తూ.. సంబంధిత వివరాలను చెప్పేవారు. మళ్లీ రెండు వారాల తర్వాత అదే జెండాను చూపించి.. అంతకుముందు చెప్పిన వివరాలను అడిగి తననుంచి రాబట్టేవారు.

గతంలోనూ అవార్డులు..

ఇటీవల ఈ నేస్తం దాదాపు 197 దేశాలకు సంబంధించిన జెండాలను కేవలం 4.40 నిమిషాల్లో గుర్తించి ఔరా అనిపించాడు. దిల్లీకి చెందిన ‘ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ సంస్థ ప్రతినిధులు.. తక్కువ సమయంలోనే ఎక్కువ దేశాల జెండాలను గుర్తించిన అతి పిన్న వయస్కుడిగా అధికారిక ధ్రువపత్రం అందించారు. అంతకుముందు ఈ రికార్డు నాలుగేళ్ల బాలుడి పేరిట ఉండేదట.

ఇతర రంగాల్లోనూ..

‘పిల్లలకు చదువుతోపాటు ఇతర రంగాల్లోనూ శిక్షణ ఇప్పించాలి. అప్పుడే వారిలో దాగి ఉన్న ప్రతిభ ప్రపంచానికి తెలుస్తోంది’ అని దర్శన్‌ వాళ్ల అమ్మ చెబుతున్నారు. ‘ఇంత చిన్న వయసులోనే మా బాబు రికార్డు సాధించడం గర్వకారణంగా ఉంది’ అని వాళ్ల నాన్న సంబరపడిపోతున్నారు. కలాం పేరిట అందిస్తున్న పురస్కారాన్నీ అందుకున్నాడు. కలెక్టర్‌ కూడా బాబును ప్రశంసించారట. నేస్తాలూ.. ఇంత చిన్న వయసులోనే ప్రపంచ రికార్డు సాధించడం అంటే మామూలు విషయం కాదు కదా.. మరి మనమూ ఈ బుడతడికి అభినందనలు చెప్పేద్దాం.!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని