చికుబుకు చికుబుకు ‘కబుకి’!

మనకు జపాన్‌ పేరు చెప్పగానే చికుబుకు.. చికుబుకు రైలు.. అదే నేస్తాలూ.. బుల్లెట్‌ ట్రైన్‌ గుర్తుకు వస్తుంది కదూ! కానీ ఇకపై ‘కబుకి’ కూడా! ఇంతకీ కబుకి అంటే ఏంటో తెలుసా! దీనిదో ప్రత్యేకత.

Updated : 12 Mar 2024 15:32 IST

మనకు జపాన్‌ పేరు చెప్పగానే చికుబుకు.. చికుబుకు రైలు.. అదే నేస్తాలూ.. బుల్లెట్‌ ట్రైన్‌ గుర్తుకు వస్తుంది కదూ! కానీ ఇకపై ‘కబుకి’ కూడా! ఇంతకీ కబుకి అంటే ఏంటో తెలుసా! దీనిదో ప్రత్యేకత. దీనికో ప్రత్యేక కథ! ఇది బహు పురాతన జపాన్‌ సంప్రదాయ నృత్యం. అయితే అందరూ అవాక్కయ్యేలా ఇందులో ఆరితేరాడు ఓ బుడత. వయసు పట్టుమని పదేళ్లే అయినా, పాలుగారే పసి బుగ్గలతోనే హావభావాలు అలవోకగా పలికిస్తున్నాడు. చిగురాకుల్లాంటి చేతులతోనే కత్తి తిప్పుతున్నాడు. లేలేత పాదాలతో చిందేస్తున్నాడు. మొత్తంగా తన ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నాడు.

పదేళ్ల మహోలో టెరాజ్‌మాకు జపాన్‌ సంప్రదాయ నృత్యం కబుకి అంటే చాలా ఇష్టం. కానీ ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ. చిన్నపిల్లలకు ఎంతో నచ్చే ఈ కబుకి.. పైకి కనిపించినంత తేలిక మాత్రం కాదు. ఈ కళాకారులకు జ్ఞాపకశక్తి చాలా అవసరం. కబుకి అనేది పేరుకే నృత్యం కానీ, ఇందులో మాటలు కూడా ఉంటాయి. అంటే ఒకరకంగా ఇది నృత్యరూపక నాటకం. ప్రదర్శన సమయంలో కళాకారులు నృత్య భంగిమలు కానీ, మాటలు కానీ అస్సలు మరిచిపోకూడదు. ఇంకా కత్తి చేతపట్టి తలపడే సన్నివేశాల్లో, ఏమేం చేయాలో అన్నీ కచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ కబుకి ద్వారా జపాన్‌ ఇతిహాసాలు, పురాణ కథలు ప్రేక్షకులకు తెలియపరుస్తారు. అందుకే దీనికి ఇంత ప్రాధాన్యం.

రెండేళ్ల వయసు నుంచే...

మహోలోకు రెండేళ్ల వయసున్నప్పుడు టోక్యోలోని కబుకి థియేటర్‌కు వాళ్ల అమ్మ షినోబు టెరాజిమా తీసుకెళ్లారు. ఉదయం నుంచి రాత్రి వరకు మహోలో అక్కడే ఉంటానని మారాం చేశాడు. నిత్యం ప్రదర్శనలకు వెళ్లేవాడు. అలా కబుకి అంటే ఇష్టం వయసుతోపాటే పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం అతి చిన్న వయసులోనే కబుకి కళాకారుడిగా మారిన, ఫ్రెంచ్‌, జపనీస్‌ మూలాలున్న ఏకైక అబ్బాయిగా గుర్తింపు పొందాడు. ఇలా తక్కువ సమయంలోనే ‘కబుకి బాయ్‌’గా ఫేమస్‌ అయ్యాడు.

వారసత్వంగా...

మహోలో అమ్మ ప్రఖ్యాత కబుకి కళాకారుడైన ఒనోన్‌ కికుగొరోకి కూతురు. నాన్న ఓ ఫ్రెంచ్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌. ఇంకేం... అటు అమ్మవైపు నుంచి, ఇటు నాన్న వైపు నుంచీ మన మహోలో కళలను వారసత్వంగా పొందాడన్నమాట. అన్నట్లు ఇటీవలే ఈ బుడత అధికారికంగా కబుకిలో అరగేట్రం చేశాడు. తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించుకుని వార్తల్లో నిలిచాడు. ఈ బుడతడికి ఓ కోరిక ఉంది... తను ఫ్రాన్స్‌లో కూడా కబుకి ప్రదర్శన ఇవ్వాలని. మరి మహోలో ఆశయం త్వరలోనే నెరవేరాలని మనమూ మనసారా కోరుకుందామా!


అంతా ప్రత్యేకం...

ఈ కబుకి కళ చాలా ప్రత్యేకమైంది. నృత్య భంగిమలు, మాటలతో పాటు ఇందులో కళాకారుల మేకప్‌, దుస్తులు ఆకట్టుకునేలా ఉంటాయి. ఇది 17వ శతాబ్దానికి చెందిన ప్రాచీన కళ. ఇదో ప్రవాహంలాగా సాగుతుంది. లయబద్ధంగా మోగే వాయిద్యాలు ఈ కళకు అదనపు ఆకర్షణ. చూస్తున్నంతసేపూ ప్రేక్షకుల్లో ఉల్లాసం, ఉత్సాహం నింపడం దీని ప్రత్యేకత. మొదట్లో కేవలం ఆడవారు మాత్రమే ఈ కబుకి ప్రదర్శన ఇచ్చేవారు. రాను రాను మగవారు కూడా కబుకి కళాకారులుగా పేరు తెచ్చుకున్నారు. కబుకి ఆర్టిస్టులకు సొంతపేరుతోపాటు స్టేజి పేరు కూడా ఉంటుంది.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని