తల్లి కష్టం చూడలేక.. బావి తవ్వేశాడు!

హలో ఫ్రెండ్స్‌.. మొన్ననే మనం మాతృదినోత్సవం జరుపుకొన్నాం. మనకు చిన్న దెబ్బ తగిలితేనే అమ్మ తల్లడిల్లిపోతుంది కదూ! అలాగే, ఓ నేస్తం కూడా వాళ్ల అమ్మ కష్టాన్ని చూడలేక పెద్ద పనికి సిద్ధమయ్యాడు.

Updated : 16 May 2023 00:58 IST

హలో ఫ్రెండ్స్‌.. మొన్ననే మనం మాతృదినోత్సవం జరుపుకొన్నాం. మనకు చిన్న దెబ్బ తగిలితేనే అమ్మ తల్లడిల్లిపోతుంది కదూ! అలాగే, ఓ నేస్తం కూడా వాళ్ల అమ్మ కష్టాన్ని చూడలేక పెద్ద పనికి సిద్ధమయ్యాడు. అందులో విజయవంతం కూడా అయ్యి, అందరితో శెభాష్‌ అనిపించుకున్నాడు. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందామా.!

మహారాష్ట్రలోని పాల్ఘర్‌ సమీపంలో ధావంగె పాద అనే గిరిజన గ్రామం ఒకటుంది. ఇది సముద్ర తీరానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. కానీ, అక్కడి ప్రజలు నీటి కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. అందరిలాగే తన తల్లి కూడా నీటి కోసం రోజూ అర కిలోమీటరు వెళ్లి వచ్చేందుకు పడుతున్న కష్టాన్ని చూసి 14 ఏళ్ల కొడుకు ప్రణవ్‌ సాల్కర్‌ తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా అమ్మ ఇబ్బందులు తొలగించాలని అనుకున్నాడు. ఎంతో శ్రమపడి తన ఇంటికి సమీపంలో ఏకంగా ఓ బావినే తవ్వేశాడు.  

అయిదు రోజుల్లోనే..

తొమ్మిదో తరగతి చదివే ప్రణవ్‌ వాళ్ల అమ్మ వ్యవసాయ కూలీ. ఆమె రోజూ పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చాక.. బిందె పట్టుకొని నీటి కోసం అర కిలోమీటరు దూరం వెళ్లి వస్తుండేది. ఆ ఊరిలో బోర్లు ఉన్నా.. వాటిలోంచి వచ్చే నీటిలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుండటంతో ఎవరూ వాటిని తాగడం లేదు. ప్రభుత్వ నల్లాలు ఉన్నా.. వారంలో మూడు రోజులు మాత్రమే వాటి ద్వారా నీరు విడుదల చేస్తారు. అవి ఎటూ సరిపోకపోవడంతో.. ఆ గ్రామస్థులు చుట్టుపక్కల ఊళ్లకు వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అయితే.. ఉదయం నుంచి సాయంత్రం వరకూ మండుటెండలో పనిచేసి, మళ్లీ ఇంటికొచ్చాక కూడా తల్లి పడుతున్న అవస్థను చూడలేక.. ఇటీవల బావి తవ్వకం ప్రారంభించాడు ప్రణయ్‌. అలా కొంత తవ్విన తర్వాత.. ఓ రాయి పడింది. తండ్రి సహాయంతో దాన్ని తొలగించి, మళ్లీ తవ్వసాగాడు. అలా అయిదో రోజు 15 మీటర్ల లోతులో జలధార పడింది. 20 మీటర్ల లోతు వరకూ పడే నీటిలో ఉప్పు శాతం అంతగా ఉండదని నిపుణులు చెప్పడంతో.. ఈ బావి నీటినే వాళ్ల ఇంటి అవసరాలకు వినియోగిస్తున్నారు.

ఊరికి ఉపకారి..

తల్లి పట్ల బాలుడి ప్రేమను చూసి పొంగిపోయిన స్థానిక అధికారులు అతడికి రూ.11 వేల నగదు పురస్కారం అందించారు. అంతేకాదు.. ప్రభుత్వం తరఫు నుంచి ఓ ఇంటిని కూడా మంజూరు చేశారు. మన ప్రణయ్‌ పనికి జిల్లా యంత్రాంగంలోనూ కదలిక వచ్చిందట. వచ్చే ఏడాదికల్లా ఆ గ్రామంలోని ప్రతి ఇంటికీ నల్లా ద్వారా సరిపడా నీరందిస్తామని హామీ కూడా ఇచ్చారు.  తన తల్లి కష్టంతోపాటు ఊరి వాళ్లకూ నీటి ఇబ్బందులు తప్పించేలా చేసిన ప్రణయ్‌ను అందరూ మెచ్చుకుంటున్నారట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని