ఆలోచన భళా.. టోపీ అదిరిపోలా..!

హలో ఫ్రెండ్స్‌.. బడికి వెళ్లేటప్పుడో, వచ్చేటప్పుడో.. మరో పని మీదనో మనం తరచూ రోడ్డు దాటుతుంటాం కదా! వేగంగా దూసుకొచ్చే వాహనాలను తప్పించుకుంటూ చాలా జాగ్రత్తగా అడుగులో అడుగు వేస్తుంటాం.

Updated : 25 May 2023 06:48 IST

హలో ఫ్రెండ్స్‌.. బడికి వెళ్లేటప్పుడో, వచ్చేటప్పుడో.. మరో పని మీదనో మనం తరచూ రోడ్డు దాటుతుంటాం కదా! వేగంగా దూసుకొచ్చే వాహనాలను తప్పించుకుంటూ చాలా జాగ్రత్తగా అడుగులో అడుగు వేస్తుంటాం. మరి మనకే రోడ్డు దాటడం అంత కష్టంగా ఉంటే, ఇక అంధుల పరిస్థితిని ఊహించలేం. అందుకే, ఓ నేస్తం చూపు లేని వారి కోసమే ఓ స్మార్ట్‌క్యాప్‌ను తయారు చేశాడు. ఆ వివరాలేంటో చదివేయండి మరి..

శ్చిమ బెంగాల్‌లోని చందన్‌నగర్‌కు చెందిన ఆదిత్యరాయ్‌ తొమ్మిదో తరగతి పూర్తి చేశాడు. తను రోజూ పాఠశాలకు వెళ్లివచ్చే క్రమంలో రోడ్డు దాటేందుకు అంధులు పడే కష్టాలను గమనించేవాడు. ఎలాగైనా వారి సమస్యకు పరిష్కారం కనిపెట్టాలని, నిశ్చయించుకున్నాడు. అలా చూపులేని వారి కోసమే ఓ స్మార్ట్‌టోపీని తయారు చేసి, అందరితోనూ శెభాష్‌ అనిపించుకుంటున్నాడు.

చిన్నతనం నుంచే ఆసక్తి

ఆదిత్యకు ఎలక్ట్రానిక్‌ వస్తువులంటే ఇష్టం. పాడైపోయిన బొమ్మలను భాగాలుగా విడదీసి, లోపలి సామగ్రిని పరిశీలనగా చూసేవాడు. అలా కొంతకాలానికి ఎలక్ట్రానిక్‌ వస్తువుల పేర్లు, పనితీరుపైన పట్టు సాధించాడు. సొంతంగా వస్తువులూ తయారు చేయడం ప్రారంభించాడు.

రూ.రెండు వేలల్లోనే..

బాల్యంలో ఎలక్ట్రానిక్‌ వస్తువులు తయారు చేసిన అనుభవంతోనే చూపు లేని వారికోసం స్మార్ట్‌క్యాప్‌ రూపొందించాలని అనుకున్నాడు. స్థానికంగా దొరికే పరికరాలతోనే తన ఆలోచనకు ప్రాణం పోశాడు. ఈ టోపీని అంధులు తమ తలపైన ధరిస్తే, అందులో ఉండే సెన్సార్‌ ఎదురుగా ఏదైనా వాహనం వస్తే శబ్దం ద్వారా హెచ్చరిస్తుంది. ఆ టోపీలో బ్లూటూత్‌ హెడ్‌ఫోన్‌, జీపీఎస్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ కూడా ఉందట. ఈ వ్యవస్థ మొత్తం సౌరశక్తితో పనిచేస్తుంది. అంతేకాదు.. ఈ టోపీతో మొబైల్‌ ఛార్జింగ్‌ కూడా పెట్టుకోవచ్చట. దీని తయారీకి రూ.2 వేలు మాత్రమే ఖర్చయినట్లు ఆదిత్య చెబుతున్నాడు.

మరింత అభివృద్ధి చేసేలా..

ఈ స్మార్ట్‌క్యాప్‌కు పేటెంట్‌ తీసుకోవడంతోపాటు తన ప్రాజెక్టును మరింత అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు ఆదిత్య. ఏదైనా సంస్థ సహకారం కోసం ఎదురుచూస్తున్నాడట. తమ కుమారుడు పాకెట్‌ మనీతోనూ ఎలక్ట్రానిక్‌ వస్తువులే కొనుగోలు చేసేవాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. గతంలో తాను తయారు చేసిన వస్తువులన్నింటినీ స్కూళ్లో ప్రదర్శనగానూ ఉంచారట. వాటిని చూసి.. ఉపాధ్యాయులతోపాటు తోటి విద్యార్థులూ ఆదిత్యను ప్రశంసించారట. వాటితోపాటు కొన్ని బహుమతులనూ గెలుచుకున్నాడు. నేస్తాలూ.. ఎంతైనా మన ఆదిత్య చాలా గ్రేట్‌ కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని