చినుకు రాలింది... నేల నవ్వింది!

హాయ్‌ ఫ్రెండ్స్‌... చిన్నారులమైన మనందరికీ వర్షం అంటే భలే హర్షం కదూ! ప్రస్తుతం ఎండాకాలంలో ఎండలు మండిపోతున్నాయి కానీ... వానాకాలం వచ్చిందంటే చాలు మొత్తం వాతావరణమే ఆహ్లాదకరంగా మారిపోతుంది.

Updated : 26 May 2023 03:48 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌... చిన్నారులమైన మనందరికీ వర్షం అంటే భలే హర్షం కదూ! ప్రస్తుతం ఎండాకాలంలో ఎండలు మండిపోతున్నాయి కానీ... వానాకాలం వచ్చిందంటే చాలు మొత్తం వాతావరణమే ఆహ్లాదకరంగా మారిపోతుంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే... మీరెప్పుడైనా వర్షం పడేటప్పుడు, ముఖ్యంగా తొలకరి జల్లులు కురిసేటప్పుడు ఒకరకమైన మట్టివాసన రావడం గమనించారా?! అలా ఎందుకు వస్తుందో అని ఆలోచించారా? కారణం ఏంటో మీకు తెలుసా? తెలిస్తే గ్రేట్‌. తెలియకున్నా ఫర్వాలేదు... ఎంచక్కా ఇప్పుడు తెలుసుకుందాం... సరేనా ఫ్రెండ్స్‌.

మనం ప్రస్తుతం కాసేపు భూమి మీద నుంచి సముద్రంలోకి వెళదాం!! సముద్రం అనగానే మనకు తిమింగలాలు, డాల్ఫిన్లు, షార్కులు, జెల్లీ ఫిష్‌లు, ఆక్టోపస్‌లు ఇలా బోలెడు జీవులు గుర్తుకు వస్తాయి కదూ! ఇందులో షార్క్‌కు అద్భుతమైన గ్రాహక శక్తి ఉంటుంది. అంతపెద్ద సముద్రంలోనూ ఎక్కడైనా చిన్న రక్తంబొట్టు పడినా సరే... చాలా దూరం నుంచే షార్క్‌లు దాన్ని గుర్తిస్తాయి. ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే మన మనుషులు మట్టివాసనను పసిగట్టడంలో షార్క్‌ కన్నా మెరుగని పరిశోధకులు తేల్చారు.

జల పరిమళం!

తొలకరి జల్లులు పడినప్పుడు మట్టివాసన రావడం వెనక కెమిస్ట్రీ దాగి ఉంది. బ్యాక్టీరియా, ఆల్గే, శిలీంధ్రాలే ఈ వాసనకు అసలు కారణం. ముఖ్యంగా ఎండిననేలపై వాన చినుకులు పడ్డప్పుడు మట్టిలోని ‘స్ట్రెప్టో మైసెస్‌’ అనే ప్రత్యేక బ్యాక్టీరియా ‘జియోస్మిన్‌’ అనే రసాయన పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఇదే సువాసనకు కారణమవుతుంది. మన దేశంలో అత్తరు పరిశ్రమకు పేరుగాంచిన ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఇప్పటికీ మట్టివాసనను వెదజల్లే అత్తర్లను తయారు చేస్తున్నారు. మే, జూన్‌ మాసంలో మన దేశంలో తొలకరి వర్షాలు పడ్డప్పుడు మట్టి నుంచి ‘జియోస్మిన్‌’ను సేకరించి కన్నౌజ్‌లో అత్తర్ల తయారీలో వాడుతున్నారు. అన్నట్లు ఈ మట్టి వాసనకు పరిశోధకులు ‘పెట్రికో’ అనే పేరుకూడా పెట్టారు ఫ్రెండ్స్‌. మరో విషయం ఏంటంటే... స్వచ్ఛమైన మట్టిలో ‘స్ట్రెప్టోమైసెస్‌’ అనే బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. యాంటీబయోటిక్‌ మందుల తయారీలోనూ ఈ బ్యాక్టీరియాను ఉపయోగిస్తున్నారు.

మొక్కల నుంచి కూడా...

తొలకరి జల్లులు పడ్డప్పుడు కేవలం నేల నుంచే కాకుండా మొక్కల నుంచి కూడా సువాసన వస్తుంది. దీనికి మొక్కల్లో ఉండే ప్రత్యేక పదార్థమే కారణం. మొక్కల ఆకుల్లోంచి  ఇవి ఉత్పత్తి అవుతాయి. వర్షం పడినపుడు ఇవి వాతావరణంలోకి విడుదలవుతాయి. అందుకే మొక్కలున్నచోట వర్షం పడ్డప్పుడు ఆహ్లాదకరమైన వాసన వస్తుంది. ఎండిన కట్టెల మీద వర్షపు చినుకులు పడ్డప్పుడు కూడా ‘జియోస్మిన్‌’లాంటి సువాసను ఇచ్చే రసాయనాలు విడుదలవుతాయి.

ప్రాంతాలను బట్టి..

వాన వాసనను పరిసరాలు కూడా ప్రభావితం చేస్తాయి. కాలుష్యపూరితమైన నగరాల్లో తొలకరి జల్లుల్లో అంత సువాసన ఉండదు. కాలుష్య ఉద్గారాలు మిళితం అవడమే అందుకు కారణం. కాలుష్యానికి దూరంగా ఉన్న మైదాన ప్రాంతంలో తొలకరి చినుకులకు చక్కటి మట్టివాసన వస్తుంది. అడవుల్లో అయితే వృక్షాలు, మొక్కలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, అక్కడ వచ్చే వాసన మరింత బాగుంటుంది. అంటే... ‘పెట్రికో’ను.. అదే నేస్తాలూ... మట్టివాసనను పరిసరాలు కూడా ప్రభావితం చేస్తాయన్నమాట.

ఉరుములు.. మెరుపులు..

వాన వల్ల భూమి నుంచే కాదు... ఆకాశం నుంచి కూడా పరిమళాలు వస్తాయి. ఇది కాస్త వింతగా ఉన్నా ఇది నిజమని పరిశోధకులు తేల్చారు. దీనికి కారణం ఓజోన్‌. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం పడుతున్నప్పుడు వచ్చే వాసన ఇంకాస్త భిన్నంగా ఉంటుంది. ఇది ఓజోన్‌ వాసన. వాతావరణం దుమ్ము, ధూళి, కలుషితాలతో నిండి ఉంటుంది. వర్షాలు పడ్డప్పుడు ఆ గాలి స్వచ్ఛంగా మారుతుంది. అందుకే మనం అప్పుడు ఓజోన్‌ వాసనను గుర్తించగలమని అమెరికాలోని మిసిసిపీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ మారిబెత్‌ తేల్చారు. నేస్తాలూ..! మొత్తానికి ఇవీ వాన వాసన విశేషాలు. బాగున్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని