కష్టపడ్డాడు.. విజేతగా నిలిచాడు!

హలో ఫ్రెండ్స్‌.. మనం ఒక్కోసారి తెలిసిన పదం స్పెల్లింగే మర్చిపోతుంటాం. కొన్నిసార్లు అసలా పదమే గుర్తుకురాదు. అలాంటిది ఓ నేస్తం స్పెల్లింగ్‌ బీ పోటీల్లో సత్తా చాటాడు. రెండుసార్లు విఫలమైనా పట్టు వదలని విక్రమార్కుడిలా కష్టపడ్డాడు.

Updated : 03 Jun 2023 04:29 IST

హలో ఫ్రెండ్స్‌.. మనం ఒక్కోసారి తెలిసిన పదం స్పెల్లింగే మర్చిపోతుంటాం. కొన్నిసార్లు అసలా పదమే గుర్తుకురాదు. అలాంటిది ఓ నేస్తం స్పెల్లింగ్‌ బీ పోటీల్లో సత్తా చాటాడు. రెండుసార్లు విఫలమైనా పట్టు వదలని విక్రమార్కుడిలా కష్టపడ్డాడు. ఎట్టకేలకు జాతీయ పోటీల్లో విజయం సాధించాడు. ఇంతకీ ఆ నేస్తం ఎవరో, ఆ వివరాలేంటో చదివేయండి మరి..

మెరికాకు చెందిన దేవ్‌ షాకు 14 సంవత్సరాలు. ఇతడు భారత సంతతికి చెందిన వాడు. అక్కడ ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ’ పోటీల్లో ఈసారి దేవ్‌ విజేతగా నిలిచాడు. దాదాపు రూ.41 లక్షలకుపైగా ప్రైజ్‌మనీ గెలుచుకున్నాడు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న అతను, గతంలో రెండుసార్లు పోటీల్లో పాల్గొన్నా.. వివిధ కారణాల వల్ల ఫైనల్‌కి చేరుకోలేకపోయాడు.

అంత సులభమేం కాదు..

ఏటా ప్రపంచ వ్యాప్తంగా భారీ సంఖ్యలో విద్యార్థులు ఈ స్పెల్లింగ్‌ బీ పోటీల్లో పాల్గొంటారు. వాళ్లందరినీ దాటుకుంటూ.. విజేతగా నిలవాలంటే ఎంతో ప్రతిభ అవసరం. దానికి నిరంతర సాధన ఉండాలి. ఈ పోటీల్లో ఎలాగైనా గెలిచేందుకు దేవ్‌ నాలుగేళ్లుగా కష్టపడుతున్నాడట. 2019లో జరిగిన పోటీల్లో క్వార్టర్‌ ఫైనల్స్‌ వరకే వెళ్లగలిగాడు. తర్వాత కరోనా కారణంగా 2020లో పోటీలు నిర్వహించలేదు. 2021లోనూ మూడో రౌండ్‌కే టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

కోటి మందికి పైగా..

దేవ్‌కు 14 ఏళ్లు రావడం.. ఇదే చివరి అవకాశం కావడంతో అతడిలో పట్టుదల మరింత పెరిగింది. ఒక సంవత్సరం పూర్తిగా సాధన చేసి.. పోటీల్లో పాల్గొనాలనే ఉద్దేశంతో గతేడాది హాజరుకాలేదు. కోచ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. అనుకున్నట్లుగానే ఈసారి తన కష్టానికి విజయం రూపంలో ప్రతిఫలం అందుకున్నాడు. ఛాంపియన్‌గా నిలిచాడు. తాజా పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోటి మందికి పైగా పాల్గొన్నారు. వారిలో కేవలం 11 మంది మాత్రమే ఫైనల్‌కు చేరుకున్నారు. దేవ్‌ గెలిచినట్లు న్యాయనిర్ణేతలు ప్రకటించగానే.. అతడి తల్లిదండ్రులు చెప్పలేని భావోద్వేగానికి గురయ్యారట. ఖాళీ సమయాల్లో ఈ నేస్తం పుస్తకాలు చదవడంతోపాటు టెన్నిస్‌ ఆడుతుంటాడట. పత్రికలు, మ్యాగజైన్స్‌లో వచ్చే రకరకాల పజిల్స్‌ కూడా పూర్తి చేస్తూ.. మెదడును ఎప్పుడూ చురుగ్గా ఉంచుకొనే ప్రయత్నం చేస్తాడట. గతేడాది పోటీల్లోనూ భారత మూలాలున్న బాలిక హరిణి విజేతగా నిలిచింది. అంతేకాదు.. ఈ పోటీల్లో భారత సంతతికి చెందిన విద్యార్థులే ఎక్కువగా సత్తా చాటుతున్నారు. నేస్తాలూ.. ఏది ఏమైనా ఈసారి ఛాంపియన్‌గా నిలిచిన దేవ్‌కు మనం కూడా కంగ్రాట్స్‌ చెప్పేద్దాం.. సరేనా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని