బొమ్మ చూస్తే చాలు.. టక్కున చెప్పేస్తాడు!

హలో ఫ్రెండ్స్‌.. మనకు డైనోసర్లు అనగానే అంతరించిపోయిన ఓ భారీ జంతువు గుర్తుకొస్తుంది. కానీ, వాటిల్లోనూ బోలెడు రకాలుంటాయని చాలామందికి తెలియదు.

Updated : 05 Jun 2023 06:40 IST

హలో ఫ్రెండ్స్‌.. మనకు డైనోసర్లు అనగానే అంతరించిపోయిన ఓ భారీ జంతువు గుర్తుకొస్తుంది. కానీ, వాటిల్లోనూ బోలెడు రకాలుంటాయని చాలామందికి తెలియదు. కానీ, ఓ నేస్తం మాత్రం డైనోసర్లలోని రకాల గురించి తెలుసుకొని.. ప్రపంచ రికార్డే సాధించాడు. ఆ వివరాలే ఇవీ..

భారత సంతతికి చెందిన శ్రీయాన్‌కు అయిదు సంవత్సరాలు. తండ్రి ఉద్యోగరీత్యా వీళ్ల కుటుంబం దుబయ్‌లో స్థిరపడింది. కేవలం 60 సెకన్ల వ్యవధిలో డైనోసర్లలో 40 రకాలను గుర్తించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇటీవలే నిమిషంలో ఎక్కువ రకాల డైనోసర్లను గుర్తించిన వాడిగా ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో పేరు నమోదైంది.

ప్రతిభను గుర్తించి..

శ్రీయాన్‌కు చిన్నతనం నుంచే జంతువులంటే విపరీతమైన ఇష్టం. మూగజీవాలతో ఆడుకోవడం, వాటి గురించి తెలుసుకోవడం చేసేవాడు. కొత్త విషయాలు నేర్చుకునేందుకు చాలా ఆసక్తి చూపేవాడట. అలా తనలోని ప్రతిభను తల్లిదండ్రులు గుర్తించారు. ఏదైనా రికార్డు సాధించేలా కుమారుడిని తీర్చిదిద్దాలని వారు అనుకున్నారు. దాంతో నాలుగేళ్ల వయసులో డైనోసర్లు, వాటిలోని రకాలు, వాటి ఆహార అలవాట్లు తదితర అంశాలపైన శిక్షణ ఇప్పించారు. అలా నాలుగు నుంచి ఆరు నెలలపాటు బాగా కష్టపడ్డాడు.

బ్లాక్‌ అండ్‌ వైట్‌లోనూ..

కొద్ది నెలల క్రితం గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధుల సమక్షంలో నిమిషం వ్యవధిలోనే 40 రకాల డైనోసర్లను గుర్తించాడు శ్రీయాన్‌. ఇటీవల వారి నుంచి అధికారిక ధ్రువపత్రం కూడా అందుకున్నాడు. అంతకుముందు కూడా మూడు జాతీయ అవార్డులు వచ్చాయట. కానీ, వాటిల్లో రంగుల్లో ఉండే డైనోసర్‌ ఫొటోలను చూసి.. వాటి వివరాలు గుర్తించాడు. కానీ, గిన్నిస్‌ బుక్‌ వాళ్లు మాత్రం తమ నిబంధనల ప్రకారం బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉన్న బొమ్మలనే వాడాలని సూచించారట. అయినా, శ్రీయాన్‌ ఏమాత్రం తడబాటు లేకుండా 60 సెకన్లలో 40 రకాలను గుర్తించాడు. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధించాలని తన ప్రతిభను మెరుగు పరుచుకుంటున్నాడు. పిల్లలూ.. ఈ నేస్తానికి మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు