పప్పీకి బహుమతిగా ఇల్లు!

హలో ఫ్రెండ్స్‌.. ఎవరినైనా తిట్టాలంటే.. ‘కుక్క బతుకు’ అనే పదం వాడుతుంటారు. ‘కుక్క చావు’, ‘సింహాసనం మీద కుక్కను కూర్చోబెట్టినట్టు’ లాంటి పదాలూ వింటుంటాం.

Updated : 06 Jun 2023 05:14 IST

హలో ఫ్రెండ్స్‌.. ఎవరినైనా తిట్టాలంటే.. ‘కుక్క బతుకు’ అనే పదం వాడుతుంటారు. ‘కుక్క చావు’, ‘సింహాసనం మీద కుక్కను కూర్చోబెట్టినట్టు’ లాంటి పదాలూ వింటుంటాం. కానీ, ఈ కుక్క గురించి విన్నారంటే.. ‘ఆహా.. బతుకంటే కుక్కదే..’ అనుకుంటాం.. మరి, ఆ విశేషాలేంటో తెలుసుకుందామా..!

మెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన బ్రెంట్‌ రెవిరా అనే అన్నయ్య ఓ యూట్యూబర్‌. అయితే, తన పప్పీ ‘చార్లీ’ పుట్టినరోజు సందర్భంగా రూ.16లక్షలతో ఏకంగా దానికో ఇల్లే కట్టించి ఇచ్చాడట. దానికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయడంతో ఇటీవల వైరల్‌గా మారింది.

అన్ని సౌకర్యాలు..

పప్పీ కోసమే కదా అని.. ఆ ఇంటిని అదేదో సాదాసీదాగా కట్టించలేదు నేస్తాలూ.. అందులో ఓ టీవీ, సోఫాసెట్‌, బీన్‌బ్యాగులు, కాఫీ టేబుల్‌, బెడ్‌తోపాటు ఇంటి వెనక వరండా కూడా ఉందట. అంతేకాదు.. దానికి ఇష్టమైన ఆహార పదార్థాలు కూడా అక్కడే ఉండేలా ఓ ఫ్రిజ్‌ కూడా ఏర్పాటు చేశాడు. అలాగే ఆ టీవీలో చార్లీకి నచ్చిన అంశాలే ఎప్పటికీ ప్లే అయ్యేలా సెట్‌ చేశాడట ఆ అన్నయ్య. ఎంచక్కా సోఫాలో కూర్చొని, టీవీ చూసుకుంటూ ఆ పప్పీ గడిపేయొచ్చన్నమాట.

పప్పీ ఆశ్చర్యం..

ఆ ఇల్లు మొత్తం పూర్తి చేసి చార్లీని అందులోకి తీసుకెళ్లగానే, అది ఎంతో సంతోషించిందట. పుట్టినరోజు బహుమతిగా ఇంటితోపాటు ఓ చిన్న పప్పీని కూడా అందించాడట ఆ అన్నయ్య. దాన్ని చూడగానే చార్లీ ఎగిరి గంతేసినంత పని చేసిందట. ఇంకో విశేషం ఏంటే.. ఆ ఇంటి బయట బంగారు పూత పూసిన అక్షరాలతో ‘చార్లీస్‌ డాగ్‌ హౌస్‌’ అని కూడా రాయించాడట. ఈ వీడియో చూసిన నెటిజన్లంతా రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరేమో కుక్క వైభోగాన్ని పొగుడుతుంటే.. ఇంకొందరేమో ఆ అన్నయ్యను అభినందిస్తున్నారు. నేస్తాలూ.. మొత్తానికి ఈ పప్పీ ఇల్లు భలే ఉంది కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని