చదరంగంతో మెరిశాడు..!

హాయ్‌ నేస్తాలూ! సాధారణంగా ఆటలు ఆడటం అంటే.. మనం చాలా ఆసక్తి చూపిస్తాం. ఏ ఆట అయినా సరే, ఆడేస్తాం అని చెబుతాం. కానీ.. చదరంగం అంటే మాత్రం కాస్త ఆలోచిస్తాం.

Published : 28 May 2024 00:02 IST

హాయ్‌ నేస్తాలూ! సాధారణంగా ఆటలు ఆడటం అంటే.. మనం చాలా ఆసక్తి చూపిస్తాం. ఏ ఆట అయినా సరే, ఆడేస్తాం అని చెబుతాం. కానీ.. చదరంగం అంటే మాత్రం కాస్త ఆలోచిస్తాం. ఎందుకంటే.. అన్ని ఆటల కంటే, అది కాస్త భిన్నంగా ఉంటుంది కాబట్టి! కానీ ఆ ఆటలోనే.. తన ఎత్తుగడలతో ప్రత్యర్థులను అలవోకగా ఓడించి.. ప్రతిభను చాటుకుంటున్నాడు ఓ చిన్నారి. మరి తనెవరో? ఆ వివరాలేంటో తెలుసుకుందామా..! 

వైయస్‌ఆర్‌ జిల్లా పోరుమామిళ్లకు చెందిన ఉండ్ర మహిధర్‌కు పదమూడేళ్లు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. వాళ్ల నాన్న నరసింహులు ఎంఈవో కార్యాలయ ఉద్యోగి. అమ్మ అనిత ఉపాధ్యాయురాలు. మహిధర్‌ చిన్నప్పటి నుంచే క్రీడల మీద ఎక్కువ ఆసక్తి చూపేవాడట. పాఠశాలలో నిర్వహించే వివిధ క్రీడా పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచేవాడట. చిన్నారి ఆసక్తి గమనించిన తల్లిదండ్రులు.. కరోనా సమయంలో, ఆన్‌లైన్‌లో చదరంగంలో శిక్షణ ఇప్పించారు. కొన్ని నెలల్లోనే అందులోని మెలకువలు నేర్చేసుకున్నాడు.

పతకాల పంట..!

మన మహిధర్‌ అతి తక్కువ కాలంలోనే.. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన పోటీల్లో పాల్గొని.. పతకాల మీద పతకాలు సాధించాడు. 2020 అక్టోబరులో నిర్వహించిన ‘బ్రిలియంట్‌ ట్రోఫీ ఆన్‌లైన్‌ చెస్‌ కాంపిటేషన్‌’లో అండర్‌-11 విభాగంలో పాల్గొని.. పన్నెండు రౌండ్లకు 10.5 పాయింట్లు సాధించి.. మూడో స్థానంలో నిలిచాడు. 2022 సెప్టెంబరులో కడపలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని ప్రథమ బహుమతి పొందాడు. అలా రాష్ట్రస్థాయి పోటీలకు కూడా ఎంపికయ్యాడు. 2023లో మార్చి 12, 13వ తేదీల్లో నెల్లూరులో నిర్వహించిన చదరంగం పోటీల్లో జాతీయ స్థాయిలో 1,181 రేటింగ్‌ సాధించాడు. అదే ఏడాది ఆగస్టులో అనంతపురంలో, సెప్టెంబరులో భీమవరంలో జరిగిన అండర్‌-13 పోటీల్లో ఏడుకుగాను ఐదు పాయింట్లు సాధించి బంగారు పతకాలు గెలుపొందాడు. డిసెంబరులో హైదరాబాద్‌లో జరిగిన పోటీల్లో ఐదు రౌండ్లకు 4.5పాయింట్లతో బంగారు పతకంతో మెరిశాడు. అలా ఇప్పటివరకు 20కి పైగా ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌ పోటీల్లో పాల్గొని పతకాలు అందుకున్నాడు. 2024 సంవత్సరం మే 11, 12వ తేదీల్లో 216వ ‘బ్రిలియంట్‌ ట్రోఫీ ఆన్‌లైన్‌ చెస్‌ టోర్నమెంట్‌’ అండర్‌-13లో పాల్గొని పన్నెండుకు పది పాయింట్లు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచాడు. ఈ చిన్నారి ఆటలోనే కాకుండా చదువులోనూ ఎప్పుడూ ముందే ఉంటాడట. ఇంతటి ప్రతిభ కనబరుస్తున్న మహిధర్‌.. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని మనమూ ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దామా! 

- వేల్పూరి వీరగంగాధర శర్మ, ఈనాడు డిజిటల్, కడప 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని