సవ్యసాచి.. గిన్నిస్‌ రికార్డు..!

హాయ్‌ నేస్తాలూ..! రూబిక్స్‌ క్యూబ్, జగ్లింగ్‌ అనే పదాలను మనం కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే.. ఇప్పటి వరకు వాటి గురించి చాలాసార్లు చెప్పుకున్నాం.. అంతే కదా! ‘మరి.. మళ్లీ ఇప్పుడెందుకు చెబుతున్నారు’ అనుకుంటున్నారు కదూ.. ఆటలు పాతవే అయినా.. ఈసారి కాస్త ప్రత్యేకం.

Updated : 31 May 2024 03:40 IST

హాయ్‌ నేస్తాలూ..! రూబిక్స్‌ క్యూబ్, జగ్లింగ్‌ అనే పదాలను మనం కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే.. ఇప్పటి వరకు వాటి గురించి చాలాసార్లు చెప్పుకున్నాం.. అంతే కదా! ‘మరి.. మళ్లీ ఇప్పుడెందుకు చెబుతున్నారు’ అనుకుంటున్నారు కదూ.. ఆటలు పాతవే అయినా.. ఈసారి కాస్త ప్రత్యేకం. ఈ కథనం చదివేయండి. ఆ విశేషాలేంటో తెలిసిపోతాయి..!

సింగపుర్‌కి చెందిన జిరుయి మాసన్‌ జోకి ప్రస్తుతం పది సంవత్సరాలు. అయిదో తరగతి చదువుతున్నాడు. రూబిక్స్‌ క్యూబ్‌ని సెకన్ల సమయంలో సాల్వ్‌ చేసి.. రికార్డు సాధించిన వారి గురించి చాలాసార్లు చదివే ఉంటాం. అలాగే.. బంతులు జగ్లింగ్‌ చేసే వారి గురించి కూడా వినే ఉంటాం. ఈ రెండు విద్యలు వచ్చిన వారిని కూడా చూసుంటాం. కానీ.. రెండూ ఒకేసారి చేస్తే ఎలా ఉంటుంది. అది అసాధ్యం అనుకుంటున్నారు కదూ! కానీ సాధ్యమేనని నిరూపించాడు జిరుయి. ఒక చేతితో రూబిక్స్‌ క్యూబ్‌ సాల్వ్‌ చేస్తూ.. మరో చేతితో బంతులు జగ్లింగ్‌ చేసేస్తున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా! కానీ ఇది నిజమే నేస్తాలూ! 10.43 సెకన్లలో.. బంతులు జగ్లింగ్‌ చేస్తూ.. 2×2×2 క్యూబ్‌ని సాల్వ్‌ చేశాడు. తన ప్రతిభను గుర్తించిన ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’ వారు అందులో స్థానం కూడా కల్పించారు.

చిన్నప్పటి నుంచే..!

ఈ బుడతడు చిన్నప్పటి నుంచే ఆటల మీద ఎక్కువ ఆసక్తి చూపేవాడట. ఒంటి చేత్తో క్యూబ్స్‌ సాల్వ్‌ చేయడం, బంతులు జగ్లింగ్‌ చేయడం నేర్చుకోవడానికి చాలా సమయం కేటాయించేవాడట. ‘ఈ రెండు ఆటలు నేర్చుకునే దశను.. నేను చాలా ఎంజాయ్‌ చేశాను. ఇందులో మరిన్ని రికార్డులు సాధించడమే నా లక్ష్యం’ అని చెబుతున్నాడు జిరుయి. మరి మనమూ తనకు ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దామా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని