చిట్టి చేతులు.. గట్టి చేతలు!

హాయ్‌ నేస్తాలూ..! మనకు ఫోన్‌లో గేమ్స్‌ ఆడటం చాలా బాగా వచ్చు కదా! ఎంత సమయమైనా ఆడుతూనే ఉంటాం. గేమ్స్‌ బోర్‌ కొడితే.. వీడియోలు, ఫొటోలు తీస్తూ సంబరపడిపోతాం. అయినా ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? అనుకుంటున్నారు కదూ!

Published : 02 Jun 2024 00:11 IST

హాయ్‌ నేస్తాలూ..! మనకు ఫోన్‌లో గేమ్స్‌ ఆడటం చాలా బాగా వచ్చు కదా! ఎంత సమయమైనా ఆడుతూనే ఉంటాం. గేమ్స్‌ బోర్‌ కొడితే.. వీడియోలు, ఫొటోలు తీస్తూ సంబరపడిపోతాం. అయినా ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? అనుకుంటున్నారు కదూ! ఓ చిన్నారి ఏకంగా డ్రోన్‌తో వీడియోలు తీస్తూ రికార్డు సాధించింది. మరి తనెవరో?ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

మెరికాకు చెందిన లుయిసా రాయెర్‌కు ఎనిమిది సంవత్సరాలు. ప్రస్తుతం రెండో తరగతి చదువుతోంది. ఆ వయసు పిల్లలంటే.. ఎంచక్కా స్కూల్‌కి వెళ్లొచ్చి, స్నేహితులతో ఆడుకుంటూ సమయం గడిపేస్తారు. కానీ ఈ చిన్నారి మాత్రం డ్రోన్‌ కెమెరాతో వీడియోలు తీస్తూ.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తన ప్రతిభతో.. 2023 సంవత్సరంలో ‘ఏజెడ్‌ డ్రోన్‌ ఫెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో ‘బెస్ట్‌ న్యూ డ్రోన్‌ పైలెట్‌ అవార్డు’ను సొంతం చేసుకుంది.  

తనే చిన్నది..!

మన లుయిసా మొదటగా చిత్రీకరించిన సినిమా పేరు.. ‘డేంజరస్‌ ప్లాంట్స్‌’. దానికి వివిధ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో అవార్డులు కూడా దక్కాయి. ఆ సినిమాను డ్రోన్‌ ద్వారా అద్భుతంగా తీసి.. ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో కూడా స్థానం సంపాదించింది. మరో విషయం ఏంటంటే.. ప్రపంచంలోనే డ్రోన్‌ వీడియోగ్రాఫర్లలో అతిచిన్న వయస్కురాలిగా నిలిచింది.

జాగ్రత్తలు అవసరం..!

‘నేను డ్రోన్‌ బహుమతిగా కావాలని అడిగి మరీ కొనిపించుకున్నాను. నాకు దానితో వీడియోలు తీయడం అంటే ఇష్టం. అయితే దాన్ని ఆపరేట్‌ చేయడం అంత సులభం ఏం కాదు. రకరకాల చోట్ల వీడియోలు తీయాల్సి వస్తుంది. అప్పుడు విద్యుత్‌ తీగలు, చెట్లు, వాహనాలను చూసుకుంటూ ఆపరేట్‌ చేయాలి. దానికి సాధన చాలా అవసరం. నాకు ఎక్కువగా విహారయాత్రలకు వెళ్లడం అంటే చాలా ఇష్టం. అలాగే.. మ్యాథ్స్, సైన్స్‌ సబ్జెక్టుల మీద ఎక్కువ ఆసక్తి చూపుతాను. మొదట్లో సరదాగా ప్రారంభించినా.. వీడియోలు తీయడం ఇప్పుడు నాకు హాబీగా మారింది. ప్రారంభ దశలో.. ఏ పనైనా కష్టంగానే ఉంటుంది. అలాగని, మధ్యలోనే వదిలేస్తే లక్ష్యాన్ని చేరుకోలేం. ఎంత ఇబ్బంది ఉన్నా ప్రయత్నిస్తూనే ఉండండి. కచ్చితంగా మంచి ఫలితాన్ని సాధిస్తారు’ అని చెబుతోంది లుయిసా. ఎంతైనా ఈ చిన్నారి గ్రేట్‌ కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని