బ్రూస్‌లీలా అవ్వాలని..!

సంగారెడ్డి జిల్లాకు చెందిన ఎనిమిదేళ్ల ఆర్‌.శశాంక్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ప్రస్తుతం మూడో తరగతి చదువుతున్నాడు. తన నాన్న పురాన్‌ సింగ్‌ ప్రభుత్వ ఉద్యోగి.

Published : 04 Jun 2024 00:07 IST

హాయ్‌ నేస్తాలూ..! మనకు చదువుతో పాటుగా.. ఇతర అంశాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఉండటం సహజమే! అయినా అందులో కొన్ని చాలా కష్టంగా ఉంటాయి. అలాంటి కోవకు చెందినదే.. కరాటే కూడా!  కానీ ఓ చిన్నారి మాత్రం అందులో రికార్డు సృష్టించాడు. మరి తనెవరో, ఆ వివరాలేంటో తెలుసుకుందామా! అయితే వెంటనే ఈ కథనం చదివేయండి.

సంగారెడ్డి జిల్లాకు చెందిన ఎనిమిదేళ్ల ఆర్‌.శశాంక్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ప్రస్తుతం మూడో తరగతి చదువుతున్నాడు. తన నాన్న పురాన్‌ సింగ్‌ ప్రభుత్వ ఉద్యోగి. అమ్మ శశికళ గృహిణి. తనకు చిన్నప్పటి నుంచే.. కరాటే అంటే చాలా ఆసక్తి ఉండేదట. అది గమనించిన తల్లిదండ్రులు శశాంక్‌కు నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడే కరాటే శిక్షణలో చేర్పించారట. శిక్షణలో చేరాక అతి తక్కువ కాలంలోనే.. కరాటేకు సంబంధించిన మెలకువలన్నీ నేర్చుకున్నాడట. 

ఇలా ఆసక్తి..!

మనకు ఏదైనా అంశం మీద ఇష్టం, ఆసక్తి కలిగిందంటే.. ఎవరైనా వ్యక్తులనో, సంఘటననో చూసి స్ఫూర్తి పొంది ఉంటాం. అలాగే.. మన శశాంక్‌ కూడా సినిమాల్లో చూసి.. బ్రూస్‌లీ గురించి తెలుసుకొని, ఎలాగైనా కరాటే నేర్చుకొని తనలా అవ్వాలనుకున్నాడట. ఒకవైపు స్కూల్‌కి వెళ్తూనే.. తన గురువు దగ్గర శిక్షణ కొనసాగిస్తున్నాడట. 2024 సంవత్సరం జనవరిలో బ్లాక్‌బెల్ట్‌ కూడా సాధించాడు. తన ప్రతిభతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాడు. ఇటీవల మే నెలలో మలేషియాలో జరిగిన అంతర్జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్‌లో 27 దేశాల అభ్యర్థులతో పోటీ పడి.. బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 

చదువులోనూ ముందే..!

ఏవైనా రెండు అంశాల మీద సమానంగా దృష్టి సారించడం అంత సులువైన విషయం కాదు! కానీ శశాంక్‌ మాత్రం చదువులోనూ ముందే ఉంటాడట. ఇప్పటి వరకు తను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మూడు బంగారు, రెండు వెండి, ఒక కాంస్య పతకాన్ని అందుకున్నాడు. ‘నేను ఎక్కడ పోటీల్లో పాల్గొనడానికి వెళ్లినా.. ఎన్ని పనులున్నా పక్కన పెట్టి, మా నాన్న తోడుగా వస్తారు. నేను ఇన్ని పతకాలు సాధించానంటే దానికి ఆయన కూడా కారణమే. భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మన దేశానికి పేరు తీసుకురావడమే నా లక్ష్యం’ అని చెబుతున్నాడు శశాంక్‌. మరి మనమూ తనకు ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దామా!

మంత్రి భాస్కర్, ఈటీవీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని