ఓ పిట్టా.. పాట అట్టా మర్చిపోతే ఎట్టా?!

పక్షులు అనగానే మనకు కిలకిలరావాలు గుర్తుకు వస్తాయి. నిజానికి వాటి కుహూకుహూలే వాటికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెడతాయి. కానీ ఓ జాతి పక్షులు వాటి భాషలో పాడే పాటనే మర్చిపోతున్నాయట. అవి ఎందుకు ఇలా చేస్తున్నాయి.

Published : 21 Mar 2021 00:55 IST

పక్షులు అనగానే మనకు కిలకిలరావాలు గుర్తుకు వస్తాయి. నిజానికి వాటి కుహూకుహూలే వాటికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెడతాయి. కానీ ఓ జాతి పక్షులు వాటి భాషలో పాడే పాటనే మర్చిపోతున్నాయట. అవి ఎందుకు ఇలా చేస్తున్నాయి. దానికి గల కారణమేంటో తెలుసుకుందామా! అయితే ఆలస్యం ఎందుకు.. చకచకా చదివేయండి ఈ కథనం.

రీజెంట్‌ హనీఈటర్‌.. ఈ పక్షి ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లోనే కనిపిస్తుంది. అయితే వీటి జాతి ఇప్పుడు అంతరించిపోతున్న జీవుల జాబితాలోకి చేరిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఈ జాతి పక్షులు కేవలం 300 మాత్రమే ఉన్నాయట. ఈ పిట్టల సంఖ్య తక్కువగా ఉండటంతో గుంపులుగా తిరగలేకపోతున్నాయి. పిల్లలు పెద్దవాటితో కలిసి ఒకచోటి నుంచి మరోచోటికి వెళ్లలేకపోతున్నాయి. దాంతో చిన్న పిట్టలు తమ జాతి పాడే పాటను మరిచిపోతున్నాయని శాస్త్రవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రికార్డు చేసి వినిపిస్తూ.. నేర్పిస్తూ..
మనుషులు ఒకరి నుంచి ఒకరు మాట్లాడుకోవడం, ప్రవర్తించడం నేర్చుకుంటారు కదా! అలాగే పక్షులు కూడా పాటలు, శబ్దాలను నేర్చుకుంటాయట. కొందరు పర్యావరణ ప్రేమికులు, పరిశోధకులు రీజెంట్‌ హనీఈటర్‌ పక్షులు కొన్నింటిని పంజరాల్లో బంధించారు. తమ జాతి జీవులు చేసే శబ్దాలు, పాటలను రికార్డు చేసి వాటికి వినిపిస్తూ.. నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. అలా శిక్షణ ఇచ్చిన పక్షులను తర్వాత అడవిలో విడిచిపెడుతూ.. వాటి సంఖ్యను పెంచే ప్రాజెక్టును సైతం చేపట్టారు. అంతరించిపోతున్న ఈ అరుదైన పక్షులు ఎక్కడెక్కడున్నాయో కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు బృందాలుగా అన్వేషణ కూడా మొదలుపెట్టారు.
ఇతర జాతుల స్నేహంతో..
బుజ్జి పక్షులకు ఎగరడం వచ్చిన తర్వాత ఆహారం కోసం వెతుక్కుంటూ.. వెతుక్కుంటూ.. గూడు వదిలి వెళ్లిపోతాయని మనకు తెలుసు. అలాగే బుల్లి రీజెంట్‌ హనీఈటర్లు కూడా అడవిలో తిరుగుతుంటాయి. ఈ జాతి పక్షుల సంఖ్య చాలా తక్కువ కావడంతో.. అవి వేరే జాతి పక్షులతో కలిసిపోతున్నాయి. వాటి ధ్వనినే అనుకరిస్తున్నాయి. అలా అవి తమ సహజత్వాన్ని కోల్పోతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. నేస్తాలూ.. ఇవీ రీజెంట్‌ హనీఈటర్‌ సంగతులు. మనమూ వాటి సంఖ్య పెరగాలని.. వాటికి వచ్చిన కష్టం తీరాలని మనసారా కోరుకుందాం.. సరేనా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని