ఎత్తుకుపోకుండా భలే ఎత్తు!

నేస్తాలూ.. మీరు గ్రంథాలయాలకు వెళుతూ ఉంటారు కదూ! మంచి.. మంచి... కథల పుస్తకాలు. కామిక్‌ బుక్స్‌ చదువుతూ ఉంటారనుకుంటా! మనం మంచివాళ్లం కాబట్టి దొంగిలించం. కానీ.. కొందరు లైబ్రరీల్లో పుస్తకాలను

Published : 06 Apr 2021 01:04 IST

నేస్తాలూ.. మీరు గ్రంథాలయాలకు వెళుతూ ఉంటారు కదూ! మంచి.. మంచి... కథల పుస్తకాలు. కామిక్‌ బుక్స్‌ చదువుతూ ఉంటారనుకుంటా! మనం మంచివాళ్లం కాబట్టి దొంగిలించం. కానీ.. కొందరు లైబ్రరీల్లో పుస్తకాలను ఎత్తుకుపోతుంటారు. అవి మామూలివి అయితే కాస్త ఫర్వాలేదు.. కానీ అరుదైన గ్రంథాలైతేనే కష్టం. అలా చాలా విలువైన పుస్తకాలున్న ఓ గ్రంథాలయం వాళ్లు దొంగల ఆటకట్టించడానికి ఓ వింత ఏర్పాటు చేసుకున్నారు. ఏంటా.. ఏర్పాటు..? ఎక్కడా లైబ్రరీ? అని తెలుసుకోవాలని ఉందా! అయితే ఎందుకాలస్యం చదివేయండి మరి..

ర్లాండ్‌ రాజధాని డబ్లిన్‌. ‘మార్ష్‌ లైబ్రరీ’ ఇక్కడ పేరొందిన గ్రంథాలయాల్లో ఒకటి. దీన్ని 1707లో ఆర్చ్‌ బిషప్‌ నార్సిసస్‌ మార్ష్‌ స్థాపించాడు. ఆయన చాలా అరుదైన పుస్తకాలను సేకరించి ఆ గ్రంథాలయంలో పెట్టాడు. 15వ శతాబ్దానికి చెందిన అపురూప గ్రంథ ప్రతులు కూడా ఉన్నాయి. మొత్తంగా 25 వేలకు పైగా పుస్తకాలను అక్కడకు వెళ్లి చదవొచ్చు!
ఎంత నిఘా పెట్టినా..
మొదట్లో వాటిని చదవాలని వచ్చే కొందరు పాఠకులు తీసిన చోటే పెట్టకుండా.. చక్కా పట్టుకుపోయేవారు. అలా చేయవద్దని ఎన్ని సార్లు చెప్పినా.. ఎంత నిఘా పెట్టినా.. ఏదో విధంగా అత్యంత అరుదైన, విలువైన పుస్తకాలు మాయమవుతూనే ఉండేవి. పోనీ మళ్లీ సేకరించి పెడదామంటే అవి అస్సలు దొరికేవే కావు.

 

పదేళ్లలో వెయ్యికిపైగా..
అలా పదేళ్లలో వెయ్యికి పైగా పుస్తకాలు కనిపించకుండా పోయాయట! అలాగే వదిలేస్తే లాభం లేదని ఆ లైబ్రరీ యాజమాన్యం వినూత్నంగా పుస్తకాల దొంగల్ని కట్టడి చేసింది. గ్రంథాలయం లోపల మూడు బోనుల్లాంటి గదుల్ని కట్టించింది. అరుదైన పుస్తకాలన్నింటినీ ఆ బోనుల లోపలున్న అరల్లో అమర్చింది. వాటిని చదవాలనుకున్న పాఠకుడు ఆ బోనులోకి వెళ్లగానే తలుపులు మూస్తారు! పుస్తకం చదవడం పూర్తయాక దాన్ని తిరిగి అరలో అమర్చగానే మళ్లీ తలుపులు తెరుస్తారు.
పాఠకులు నొచ్చుకున్నా...
అప్పట్నుంచి ఇప్పటి వరకు ఒక్కటంటే.. ఒక్క పుస్తకమూ పోలేదంట. మరో విషయం ఏంటంటే.. ఇలా బోన్లు ఏర్పాట్లు చేసినందుకు చాలామంది పాఠకులు నొచ్చుకున్నారంట. కానీ.. అవి అపురూపంగా కాపాడాల్సిన పుస్తకాలు. ఇలాంటి జాగ్రత్తలు తప్పవు మరి.. అని గ్రంథాలయ యాజమాన్యం వారు తేల్చి చెప్పేశారు. మొత్తానికి ఈ వింత గ్రంథాలయం విశేషాలు భలే ఉన్నాయి కదూ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని