ఎడారి దేశంలో నీలి రంగు రహదారి

‘నీలి రంగులో రహదారి ఏంటబ్బా?’ అని ఆలోచిస్తున్నారా! ఎడారి దేశం ఖతార్‌లో ఇప్పుడు ప్రయోగాత్మకంగా బ్లూ రోడ్లు వేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారు? అందులోనూ నీలిరంగునే ఎందుకు ఎంచుకున్నారు?

Published : 09 Apr 2021 00:29 IST

‘నీలి రంగులో రహదారి ఏంటబ్బా?’ అని ఆలోచిస్తున్నారా! ఎడారి దేశం ఖతార్‌లో ఇప్పుడు ప్రయోగాత్మకంగా బ్లూ రోడ్లు వేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారు? అందులోనూ నీలిరంగునే ఎందుకు ఎంచుకున్నారు? అనే అనుమానం వస్తోంది కదూ! ఓ చిన్న కారణమే వారితో ఈ పని చేయిస్తోంది. అదేంటో తెలుసుకుందామా..!

తార్‌లో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఏకంగా 50 డిగ్రీల సెల్సియస్‌ వరకూ నమోదవుతుంటాయి. ఇక రోడ్ల పరిస్థితైతే చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పులు లేకుండా రోడ్డు మీద కాళ్లు పెడితే నిమిషాల్లోనే బొబ్బలు వస్తాయి. మీకు తెలుసు కదా.. అసలే నల్లరంగు అధికంగా వేడిని గ్రహిస్తుందని. అందుకే ముఖ్యంగా వేసవిలో నల్లని రోడ్ల వల్ల వాహనాలు ఎక్కువగా దెబ్బతింటున్నాయి. వాటిలో ఉండే ప్లాస్టిక్‌ భాగాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. టైర్లు తొందరగా అరుగుతున్నాయి. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగానే ఓ ప్రత్యేక పదార్థంతో తయారైన నీలిరంగు రోడ్లను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు.

ముందు దోహాలో..
ఖతార్‌ రాజధాని దోహాలో పైలట్‌ ప్రాజెక్టుగా నీలి రంగు ఉపరితలం ఉన్న రోడ్ల పనితీరును పరిశీలిస్తున్నారు. నల్లని రోడ్లతో పోల్చుకుంటే ఈ నీలి రంగు రహదారులు సూర్యకాంతిని తక్కువగా పీల్చుకుంటున్నాయి. చాలా వరకు కాంతిని పరావర్తనం చెందించడమే దీనికి కారణం. ఫలితంగా ఈ రోడ్లు ఎక్కువగా వేడెక్కడం లేదు. నీలి రంగు వల్ల రోడ్డు ఉష్ణోగ్రత 10 నుంచి 20 డిగ్రీల వరకు తగ్గుతోంది. ఈ ప్రభావం చుట్టుపక్కల పరిసరాల మీద కూడా ఉంటోంది. మరిన్ని పరీక్షల తర్వాత ఫలితాలను బట్టి ఈ నీలి రోడ్లను ఖతార్‌ మొత్తం విస్తరిస్తారట. మన దగ్గర కూడా వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటాయి కదా! చూద్దాం.. ఈ నీలి రహదారులు మన దగ్గరికీ వస్తాయేమో!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు