ఎద్దుల బండి.. పుస్తకాలు తెస్తుందండి!

హలో నేస్తాలూ.. ప్రస్తుతం పాఠశాలలను తెరిచినా, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఆన్‌లైన్‌ క్లాసులు కూడా నిర్వహిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్లు ఉండీ సిగ్నళ్లు సరిగ్గా అందే ప్రాంతాల్లోని వారికైతే ఎటువంటి ఇబ్బందీ ఉండదు. మరి, అవేమీ

Updated : 09 Feb 2022 05:28 IST

హలో నేస్తాలూ.. ప్రస్తుతం పాఠశాలలను తెరిచినా, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఆన్‌లైన్‌ క్లాసులు కూడా నిర్వహిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్లు ఉండీ సిగ్నళ్లు సరిగ్గా అందే ప్రాంతాల్లోని వారికైతే ఎటువంటి ఇబ్బందీ ఉండదు. మరి, అవేమీ అందుబాటులో లేని మారుమూల పల్లెల్లోని విద్యార్థుల పరిస్థితి ఏంటి? అందుకే, ఓ టీచరమ్మ సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. అదేంటో తెలుసుకుందాం..

ధ్యప్రదేశ్‌ రాష్ట్రం బేతుల్‌ జిల్లాలో భైన్స్‌దేహి అనే గిరిజన గ్రామం ఒకటి ఉంది. కొండల మధ్య, దట్టమైన అడవిని ఆనుకొని ఉంటుందీ ఊరు. అక్కడి పాఠశాలలో 87 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే, కరోనా కేసుల సంఖ్య అధికంగా ఉండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విద్యార్థులకు ఆన్‌లైన్‌లోనే తరగతులు చెబుతున్నారు. కానీ, భైన్స్‌దేహి గ్రామంలోని పిల్లలంతా పేదవారే. వారి తల్లిదండ్రులకు స్మార్ట్‌ఫోన్లు కొనిచ్చే స్తోమత లేదు... అక్కడ సెల్‌ఫోన్‌ సిగ్నళ్లూ రావు. దాంతో విద్యార్థులంతా పాఠాలకు దూరమవుతున్నారు.

గణగణ గంట మోగించి..
విద్యార్థులు తరగతులు వినలేకపోతుండటంతో అక్కడి బడిలో పనిచేసే ఉపాధ్యాయురాలు కమల ఓ వినూత్న ఆలోచన చేశారు. అదేంటంటే... బడిలోని పుస్తకాలన్నింటినీ ఒక ఎద్దుల బండిలో ఉంచి నేరుగా విద్యార్థుల ఇళ్లకే వెళ్లి అందజేయడం ప్రారంభించారు. అంటే, ఎద్దుల బండిని లైబ్రరీగా మార్చేశారన్నమాట. ఆ బండి పిల్లల ఇళ్ల వద్దకు వెళ్లగానే దాంతోపాటు ఉండే  విద్యార్థి కంచం, గరిటె పట్టుకొని గంట కొడతాడు. ఇంటి లోపల నుంచి విద్యార్థి బయటకు రాగానే... టీచరమ్మ మాట్లాడి అవసరమైన పుస్తకాలు ఇస్తుంటుంది. మరుసటి రోజు పాత పుస్తకాలను తిరిగి తీసుకొని... మళ్లీ కొత్తవి ఇస్తారు. ఈ ఆలోచన ఉన్నతాధికారులతోపాటు ఆ ఊరి ప్రజలకూ నచ్చడంతో ఆ పంతులమ్మను అందరూ అభినందిస్తున్నారు. మనసుంటే మార్గముంటుందనేందుకు దీన్ని ఉదాహరణగా చూపుతున్నారు. కేవలం పుస్తకాలు ఇవ్వడమే కాదు వీధి బడులూ నిర్వహిస్తున్నారు ఈ టీచర్‌. ఆమె నిజంగా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని