పాత‘బడి’.. కొత్తగా రెడీ!

హాయ్‌ ఫ్రెండ్స్‌! పాడుబడిన గోడలు.. రంధ్రాలు పడిన పైకప్పు.. ఒకటీ రెండూ మరుగుదొడ్లు.. అవీ నీటి సౌకర్యం, నిర్వహణ లేనివీ.. పగిలిపోయిన గచ్చు.. బండలు లేచిపోయిన వరండా - పాఠశాల ఇలా ఉంటే అసలు మనకు వెళ్లబుద్ధి అవుతుందా?...

Published : 23 Feb 2022 00:26 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌! పాడుబడిన గోడలు.. రంధ్రాలు పడిన పైకప్పు.. ఒకటీ రెండూ మరుగుదొడ్లు.. అవీ నీటి సౌకర్యం, నిర్వహణ లేనివీ.. పగిలిపోయిన గచ్చు.. బండలు లేచిపోయిన వరండా - పాఠశాల ఇలా ఉంటే అసలు మనకు వెళ్లబుద్ధి అవుతుందా?

‘కాదు’ కదా! మొన్నటివరకూ ఓ బడిది ఇంతకంటే అధ్వాన పరిస్థితి. ఇప్పుడు మాత్రం దాని రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇంతకీ ఆ బడి ఎక్కడో, దాన్నెవరు బాగుచేశారో చదివేయండి మరి!

దుకోట్‌.. కర్ణాటక రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామం. చుట్టూ దట్టమైన అడవి మధ్యలో ఎక్కడో దూరంగా విసిరేసినట్లు ఉంటుందీ ఊరు. ఇక్కడి నుంచి మైసూరుకు 12 కిలోమీటర్ల దూరమే అయినా, ఎలాంటి వసతులూ లేవు. దాదాపు 80 మంది విద్యార్థులు చదువుతున్న ఇక్కడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడు కూలుతుందోనని భయపడుతూనే విద్యార్థులు పాఠాలు వినేవారు. ఒకటీ రెండూ కాదు గత 45 ఏళ్లుగా ఆ స్కూల్‌ది ఇదే పరిస్థితి.

స్వచ్ఛంద సంస్థ సాయంతో..

అటువంటి బడిని బాగుచేసేందుకు బెంగళూరుకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. అందులోని సభ్యులే తలాకొంత వేసుకొని మరీ వానొస్తే తరగతి గదుల్లోకి వాన నీళ్లు రాకుండా గోడలకు వాటర్‌ ప్రూఫ్‌ రంగులు వేశారు. ఆ తరవాత లోపలి, బయటి గోడలతోపాటు వరండాలోనూ పిల్లలను ఆకట్టుకునేలా రకరకాల బొమ్మలతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. అంతేకాదు.. మరుగుదొడ్లలో టైల్స్‌ వేసి.. నల్లాలు బిగించి.. సింక్‌ కూడా పెట్టిస్తున్నారు. మూత్రశాలలను బాగుచేసేందుకు అయ్యే ఖర్చును.. సమీపంలోని పట్టణంలో ఉండే విశ్రాంత ఉద్యోగ దంపతులు అందించారట. స్వచ్ఛంద సంస్థ వాలంటీర్లే సొంతంగా రూ.2 లక్షలతో బడిలో కంప్యూటర్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి విద్యార్థులకు బుక్స్‌తోపాటు రాత పుస్తకాలనూ వారే అందించారు.

మూడు తరగతులను కలిపి..

ఈ బడిలో సరిపడా గదులు లేకపోవడంతో 1 నుంచి 3, 4-5,   6-7 తరగతుల విద్యార్థులను కలిపేసి.. ఉమ్మడిగా పాఠాలు చెబుతున్నారట. పాత స్కూల్‌ కొత్తగా మారుతుండటంతో.. సమీప గ్రామాల్లోని ప్రజలూ తమ ఊళ్లలోని పాఠశాలలనూ బాగు చేయాలని సంస్థ వాలంటీర్లను కోరుతున్నారట. పదుకోట్‌లో 800 మంది గ్రామస్థులున్నా.. అందరూ పేదవారే కావడంతో ఇన్నాళ్లూ బడిని బాగుచేసుకోలేకపోయారు. ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేసి తరగతులు ప్రారంభించనున్నారట. మొత్తానికి ఈ సర్కారు బడి తళతళలాడుతూ భలే బాగుంది కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని