నేనుగానీ కరిచానంటే...

హాయ్‌ ఫ్రెండ్స్‌... నేనో కీటకాన్ని. ‘ఓస్‌ అంతేనా..’ అని తేలిగ్గా తీసిపారేయకండి. ఎందుకంటే నేను కరిచాననుకో.. మామూలుగా ఉండదు మరి. ఎందుకంటే... ‘అబ్బ.. ఆశ, దోశ, అప్పడం, వడ..’ అన్నీ ఇక్కడే చెప్పేస్తానా ఏంటి? అదేం కుదరదు.. మీరే ఈ కథనం చదువుకోండి. మీకే తెలుస్తుంది.

Updated : 06 Mar 2022 05:58 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌... నేనో కీటకాన్ని. ‘ఓస్‌ అంతేనా..’ అని తేలిగ్గా తీసిపారేయకండి. ఎందుకంటే నేను కరిచాననుకో.. మామూలుగా ఉండదు మరి. ఎందుకంటే... ‘అబ్బ.. ఆశ, దోశ, అప్పడం, వడ..’ అన్నీ ఇక్కడే చెప్పేస్తానా ఏంటి? అదేం కుదరదు.. మీరే ఈ కథనం చదువుకోండి. మీకే తెలుస్తుంది.

నా పేరు ఆస్ట్రేలియన్‌ రాస్పీ క్రికెట్‌ (కీచురాయి). ఈ ప్రపంచం మొత్తంలో నా అంత గట్టిగా ఇంకే కీటకమూ కరవలేదంట. నేను మిగతా కీటకాల కన్నా... దాదాపు 1,200 రెట్లు ఎక్కువ గట్టిగా కరవగలను.

ఎక్కడుంటానంటే...

నేను ఈశాన్య ఆస్ట్రేలియాలోని అరణ్యాల్లో ఉంటాను. నాలుగు ఖండాల నుంచి సేకరించిన 650 కీటక జాతుల కన్నా నేనే గట్టిగా కరుస్తా. ఈ విషయం నేను చెప్పడం లేదు ఫ్రెండ్స్‌. నా మీద ఇటీవలే పరిశోధనలు చేసిన మీ పరిశోధకులే చెబుతున్నారు.

అరుస్తాను.. కరుస్తాను!

నాకు కేవలం కరవడమే కాదు.. అరవడమూ వచ్చు. నేను ఎక్కువగా పగటిపూట విశ్రాంతి తీసుకొని రాత్రిపూట బయటకు వస్తాను. గడ్డి, మొక్కలు, పువ్వులు, గింజల్ని ఆహారంగా తీసుకుంటాను. నేను దాదాపు 5 సెంటీమీటర్ల పొడవు పెరుగుతాను. మాలో రెక్కలున్నవి, రెక్కలు లేనివీ రెండు రకాలూ ఉంటాయి. రకమేదైనా అరవడం, కరవడం మాత్రం పక్కా.

సరే ఫ్రెండ్స్‌... మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఒక్కసారి మీ చేయి ఇలా ఇవ్వండి. అబ్బే.. భయపడకండి. కరవడానికి కాదు. మీకు షేక్‌హ్యాండ్‌ ఇచ్చి బై.. బై.. చెప్పేయడానికి. సరేలే.. మీరు మీ చేయి ఇవ్వడానికి భయపడుతున్నారు కానీ.. ఉంటా మరి బై..బై...!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని