కొత్తగా ఈకలొచ్చెనే!

పక్షులకు రెక్కలు అందం!  ఆ రెక్కలకు ఈకలే ప్రధానం. ఇవే లేకుంటే అవి ఎగరలేవు. అందుకే వీటికి చేయూతనిచ్చేందుకు చిట్టిచేతులు ముందుకు వస్తున్నాయి. ఎంతో జాగ్రత్తగా ఈకలను సేకరిస్తున్నాయి. ప్రమాదాల్లో ఈకలు కోల్పోయిన

Updated : 19 Apr 2022 04:16 IST

పక్షులకు రెక్కలు అందం!  ఆ రెక్కలకు ఈకలే ప్రధానం. ఇవే లేకుంటే అవి ఎగరలేవు. అందుకే వీటికి చేయూతనిచ్చేందుకు చిట్టిచేతులు ముందుకు వస్తున్నాయి. ఎంతో జాగ్రత్తగా ఈకలను సేకరిస్తున్నాయి. ప్రమాదాల్లో ఈకలు కోల్పోయిన పక్షులకు, అవి ప్రాణాధారం అవుతున్నాయి. ఆ వివరాలేంటో తెలుసుకుందామా!

ర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన చిన్మయి రాజశంకర వయసు 11 సంవత్సరాలు. ఈ చిన్నారి ‘పీపుల్‌ ఫర్‌ ఎనిమల్స్‌’ సంస్థలో వాలంటీర్‌గా పనిచేస్తోంది. కొన్ని రోజులుగా పక్షుల ఈకలు సేకరిస్తోంది. వాటిని ఈకల బ్యాంక్‌కు అందిస్తోంది. ఇలా అందిన ఈకలతో స్థానికంగా ఓ స్వచ్ఛంద సంస్థ వారు గాయపడ్డ పక్షులకు చికిత్స చేస్తున్నారు. అవి కోల్పోయిన ఈకల స్థానంలో వీటిని అమరుస్తున్నారు.

ఎన్నో పక్షులకు మేలు..

పోట్లాటలు, వేటగాళ్ల ఉచ్చులు, కరెంటు తీగల్లో చిక్కుకోవడం, గాలిపటాల మాంజాల వల్ల గాయపడటం.. ఇలాంటి కారణాలతో పక్షులు తమ ఈకల్ని కోల్పోతున్నాయి. దీంతో అవి ఎగరలేకపోతున్నాయి. ఇలాంటి పక్షులకు ఇలా చిన్నారులు సేకరించిన ఈకలను అతికిస్తున్నారు. దీంతో అవి తిరిగి ఎగరగలుగుతున్నాయి.

చాలా కష్టం...

ఈకల్ని కోల్పోయిన పక్షులకు సేకరించిన ఈకల్ని అతికించడం చాలా శ్రమతో కూడుకున్న పని. ఎలా పడితే అలా అతికిస్తే దాని వల్ల పక్షికి ప్రయోజనం లేకపోగా... దానికి ఇబ్బంది కలుగుతుంది. అందుకే నిపుణులు చాలా జాగ్రత్తలు తీసుకుని, ప్రమాణాలు పాటించి ఈకలను అతికిస్తారు. దీనికి కాస్త సమయం పడుతుంది.

ఎంతో మంది చిన్నారులు...

కేవలం చిన్మయి మాత్రమే కాదు, చాలా మంది చిన్నారులు పార్కులు, తోటలు, ఇళ్లలో దొరికే పక్షుల ఈకలను సేకరించి ఈ స్వచ్ఛంద సంస్థకు అందిస్తున్నారు. వీరంతా చిన్న వయసులోనే చాలా మంచి పని చేస్తున్నారు కదూ! వారంతా నిజంగా గ్రేట్‌ అనిపిస్తోంది కదా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని