ఎలుకను కాదు.. కంగారూనే!

హాయ్‌ నేస్తాలూ.. బాగున్నారా? చూస్తే ఎలుకలా ఉన్నాను కానీ... నేను నిజానికి ఎలుకను కాదు! నేనో కంగారూను.. నిజం ఫ్రెండ్స్‌.. మీరు అలా ముసిముసిగా నవ్వకండి.. నాకు చాలా కోపం వస్తుంది అసలు మీకు నా గురించి ఏం తెలుసని.. నవ్వుతారు చెప్పండి! మీకు నిజంగా తెలియదు కదా..! అందుకే ఇప్పుడు చెబుతాను తెలుసుకోండి సరేనా!

Updated : 25 Apr 2022 05:10 IST

హాయ్‌ నేస్తాలూ.. బాగున్నారా? చూస్తే ఎలుకలా ఉన్నాను కానీ... నేను నిజానికి ఎలుకను కాదు! నేనో కంగారూను.. నిజం ఫ్రెండ్స్‌.. మీరు అలా ముసిముసిగా నవ్వకండి.. నాకు చాలా కోపం వస్తుంది అసలు మీకు నా గురించి ఏం తెలుసని.. నవ్వుతారు చెప్పండి! మీకు నిజంగా తెలియదు కదా..! అందుకే ఇప్పుడు చెబుతాను తెలుసుకోండి సరేనా!

నేను ప్రపంచంలోకెల్లా అతిచిన్న కంగారూను. నన్ను మస్కీ ర్యాట్‌ కంగారూ అని పిలుస్తారు. నేను కేవలం ఈశాన్య ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాను. నా గురించి మీకు కేవలం 19వ శతాబ్దం చివర్లోనే తెలిసింది.

నా బరువు ఎంతంటే...

నేను ఎంత బరువుంటానో తెలుసా? కేవలం 500 గ్రాములు! అంటే అర్ధకిలో అన్నమాట. మాలో కొన్నిమాత్రం అత్యధికంగా 680 గ్రాముల వరకు బరువుంటాయి. అంతే ఇక అంతకు మించి బరువు పెరగం. మేం 155 మిల్లీమీటర్ల నుంచి 270 మిల్లీమీటర్ల వరకు పెరుగుతాం.

పగలంటే ఇష్టం..

మేం చూడ్డానికి ఎలుకల్లా ఉన్నా... ఎలుకలం కాదు. అందుకే వాటిలా రాత్రిపూట ఎక్కువగా సంచరించం. కేవలం పగలు మాత్రమే ఉత్తేజంగా ఉంటాం. అందులోనూ ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో మరింత చురుకుగా ఉంటాం.

ఏం తింటామంటే...

మేం ఎక్కువగా పండ్లు, రాలిన ఆకులు, సీతాకోకచిలుకలు, తూనీగల్లాంటి చిన్న చిన్న కీటకాలను ఆహారంగా తీసుకుంటాం. ఎంతైనా మాది బుజ్జి పొట్టే కదా. కాస్తంత ఆహారం తీసుకుంటే సరిపోతుంది.

మాకూ సంచి ఉంటుందోచ్‌!

పెద్ద కంగారూల పొట్టకు సంచి ఉన్నట్లే.. మాకూ ఉంటుంది. అందులో మా పిల్లల్ని 21 వారాల వరకు సంరక్షిస్తాం. అలాగే పెద్ద కంగారూల లాగానే మేం కూడా గెంతుతాం. మాకు కాస్త చెట్లు ఎక్కడం కూడా వచ్చు తెలుసా! నిజానికి మమ్మల్ని ఎవరైనా కొత్తవారు అంటే.. మా గురించి తెలియని వారు చూస్తే మమ్మల్ని ఎలుకలే అనుకుంటారు. కాస్త పరిశీలనగా చూస్తే కానీ మేం ర్యాట్‌ కంగారూలం అని గుర్తించలేరు. ఫ్రెండ్స్‌.. ఇప్పటికైనా నమ్ముతారా? మేం కంగారూలేమేనని.. ఎలుకలం కాదు అని!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని