పప్పీ బైక్ యాత్ర..భలే భలే

హాయ్‌ ఫ్రెండ్స్‌.. పనిమీదనో, సరదాకో బయటకు వెళ్తే ఇంట్లో పెంచుకునే పప్పీలనూ మనతోపాటు తీసుకెళ్తుంటాం. అదే ఓ అయిదారు రోజులు దూర ప్రయాణం చేయాల్సి వస్తే.. బంధువుల దగ్గరో, తెలిసిన వారి ఇంట్లోనో లేకపోతే ‘డాగ్‌ హాస్టల్‌’లోనో వదిలేసి వెళ్తాం

Published : 17 May 2022 00:41 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. పనిమీదనో, సరదాకో బయటకు వెళ్తే ఇంట్లో పెంచుకునే పప్పీలనూ మనతోపాటు తీసుకెళ్తుంటాం. అదే ఓ అయిదారు రోజులు దూర ప్రయాణం చేయాల్సి వస్తే.. బంధువుల దగ్గరో, తెలిసిన వారి ఇంట్లోనో లేకపోతే ‘డాగ్‌ హాస్టల్‌’లోనో వదిలేసి వెళ్తాం. కానీ, ఓ కుక్క మాత్రం ఎంచక్కా బైక్‌ మీద దేశం మొత్తం తిరిగేస్తుంది. ఆ వివరాలే ఇవీ..

ఎవరైనా మనల్ని కాసేపు బండి మీద తిప్పితేనే సంబరపడిపోతాం. ఇంకాసేపు తిప్పితే బాగుండు అని అనిపిస్తుంది. అలాంటిది మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన 12 సంవత్సరాల పప్పీ మాత్రం నెలల తరబడి బైక్‌ మీద భలే తిరిగేస్తుంది.
బైక్‌ రైడ్‌ ఇష్టమని..
రాజత్‌ పరాశర్‌ కుటుంబం కొన్నేళ్లుగా జర్మన్‌ షెఫర్డ్‌ జాతికి చెందిన ఓ కుక్కను పెంచుకుంటోంది. దానికి ‘మ్యాగీ’ అనే పేరు పెట్టుకొని ఎంతో ప్రేమగా, కుటుంబ సభ్యుడి మాదిరి చూసుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం ఉన్నట్టుండి ఆ పప్పీ తినడం మానేసిందట. అలా రోజురోజుకీ నీరసించిపోయింది. ఆసుపత్రికి తీసుకెళ్తే జబ్బు చేసిందనీ, డాక్టర్లు ఆపరేషన్‌ చేశారట. ‘మ్యాగీ’ పూర్తిగా కోలుకొని ఇంటికి వచ్చాక.. దానికి ఎంతో ఇష్టమైన రోడ్‌ ట్రిప్‌కు తీసుకెళ్లాలని అనుకున్నాడు యజమాని.
ప్రత్యేక బెడ్‌...  
అనుకోవడమే ఆలస్యం.. రాజత్‌ తన బుల్లెట్‌ బండి వెనక సీట్లో అమర్చగలిగేంత, కుక్కకి సరిపడా ఓ బెడ్డులాంటిది తయారు చేయించాడు. అంతేకాదు, ప్రయాణంలో అటుఇటూ పడిపోకుండా దానికో బెల్టూ బిగించాడు. ఇంకేముంది.. పప్పీని తీసుకొని బండి మీద దేశం మొత్తం తిరగడం ప్రారంభించాడు.

ప్రస్తుతం గోవాలో..
ఆరు నెలల క్రితం మధ్యప్రదేశ్‌ నుంచి మొదలుపెట్టిన యాత్ర.. దిల్లీ, పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌, రాజస్థాన్‌, హరియాణా, గుజరాత్‌, మహారాష్ట్ర మీదుగా ప్రస్తుతం గోవాకు చేరిందట. ప్రయాణం మధ్యలో ముంబయిలో వారికి జర్మన్‌ షెఫర్డ్‌ జాతికే చెందిన మరో కుక్క కనిపించింది. యజమానులు వదిలేయడంతో అది రోడ్డున పడినట్లు తెలుసుకున్న రాజత్‌.. ‘మ్యాగీ’కి తోడుగా దాన్ని కూడా తన వెంట తీసుకెళ్లిపోయాడు. దొరికిన పప్పీకి ‘మార్వెల్‌’ అని పేరు పెట్టాడు.

సోషల్‌ మీడియా సాయంతో..
‘మరి ప్రయాణంలో ఉండటం, తిండి సంగతేంటి?’ అనే అనుమానం అక్కర్లేదు. బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఆగుతూ.. ప్రయాణం సాగిస్తున్నట్లు రాజత్‌ చెబుతున్నాడు. సోషల్‌ మీడియా సాయంతో ఆయా ప్రాంతాల్లోని జంతు ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థల వివరాలూ సేకరిస్తూ ముందుకు వెళ్తున్నారట. పాలు, చపాతీలు, టమోటోలు ఇష్టపడే ఈ మ్యాగీ బతికినన్నాళ్లు, దాన్ని సంతోషంగా ఉంచుతానని చెబుతున్నాడు రాజత్‌. నిజంగా ఈ పప్పీది భలే అదృష్టం కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు