భలే.. భలే.. మృగరాజువోయ్‌!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనకేమో జుట్టు కాస్త పొడుగ్గా పెంచుకోవాలని ఉంటుంది. కానీ, ఇంట్లో వాళ్లు మాత్రం చదువుకునే పిల్లలకు జుట్టు పెద్దగా వద్దు.. చిన్నగానే ఉండాలని దగ్గరుండి మరీ కటింగ్‌ చేయిస్తుంటారు కదూ! మనలానే ఓ సింహానికి కూడా జుట్టు పెంచుకోవాలని అనిపించిందేమో.. దాని హెయిర్‌ స్టైల్‌ చూసిన ప్రతి ఒక్కరూ అవాక్కవుతున్నారు మరి. ఆ వివరాలేంటో మీరూ తెలుసుకోండి..  ...

Published : 07 Jun 2022 00:29 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనకేమో జుట్టు కాస్త పొడుగ్గా పెంచుకోవాలని ఉంటుంది. కానీ, ఇంట్లో వాళ్లు మాత్రం చదువుకునే పిల్లలకు జుట్టు పెద్దగా వద్దు.. చిన్నగానే ఉండాలని దగ్గరుండి మరీ కటింగ్‌ చేయిస్తుంటారు కదూ! మనలానే ఓ సింహానికి కూడా జుట్టు పెంచుకోవాలని అనిపించిందేమో.. దాని హెయిర్‌ స్టైల్‌ చూసిన ప్రతి ఒక్కరూ అవాక్కవుతున్నారు మరి. ఆ వివరాలేంటో మీరూ తెలుసుకోండి..  

చైనాలోని గ్వాంగ్జ్‌ నగరంలో ఒక జంతు ప్రదర్శనశాల(జూ) ఉంది. ఇటీవల కుటుంబంతో కలిసి సరదాగా ఆ జూకి వెళ్లిన ఓ వ్యక్తి.. అక్కడి జంతువుల ఫొటోలు తీయసాగాడు. వాటిలో ఓ వింత హెయిర్‌ స్టైల్‌తో ఉన్న సింహం చిత్రమూ ఉంది. అది కాస్త భిన్నంగా కనిపించడంతో దాని ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఇక చూడండి.. కొద్ది క్షణాల్లోనే ఆ సింహం ఫొటో వైరల్‌గా మారింది. ఆ మృగరాజు జుట్టు.. అదే నేస్తాలూ.. జూలే అందుకు కారణం.

ఓ వెబ్‌సైట్‌ ప్రచురించడంతో..

జూలుకు బేబీ కటింగ్‌ చేయించినట్లు ఉన్న సింహం ఫొటోలను చైనాలోని ఓ వెబ్‌సైట్‌ ప్రచురించడంతో.. ఆ విషయం ప్రపంచానికి తెలిసింది. సింహం కటింగ్‌ వార్త వైరల్‌గా మారిన విషయం అటు తిరిగీ.. ఇటు తిరిగీ సంబంధిత జూ ప్రతినిధులకూ చేరింది. దాంతో వెంటనే వారు స్పందించారు. ఏమనీ అంటే.. ‘హాంఘంగ్‌’ జాతికి చెందిన తెల్ల సింహాల వెంట్రుకలు సాధారణంగా పెరుగుతూనే ఉంటాయనీ, గ్వాంగ్జ్‌ ప్రావిన్స్‌లో ఉక్కపోత ఎక్కువగా ఉండటం వల్ల.. ఈ మృగరాజు జూలు దానంతట అదే గాలి తీవ్రతకు కటింగ్‌ చేసినట్లు మారి ఉంటుందని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కొందరు జంతు ప్రేమికులు మాత్రం జూ సిబ్బందే దాన్ని అలా మార్చారని అంటున్నారు.

బోలెడు స్పందన..

సింహం బేబీ కటింగ్‌ ఫొటోలను సదరు వ్యక్తి ఇంటర్నెట్‌లో పోస్టు చేయడానికంటే వారం రోజుల ముందే తాను ఆ జూకి వెళ్లాననీ, అప్పుడు ఆ మృగరాజు జూలు చాలా పెద్దగా ఉందనీ అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి చెబుతున్నాడు. ఏది ఏమైనా ఈ డిఫరెంట్‌ హెయిర్‌ స్టైల్‌పైన సోషల్‌ మీడియాలో చాలా మీమ్స్‌ వైరల్‌గా మారాయి. ‘ఈ సింహానికి కటింగ్‌ చేసింది ఎవరు భయ్యా.. నవ్వలేక చచ్చిపోతున్నా’ అనీ, ‘ఇప్పుడు ఈ హెయిర్‌ స్టైలే ట్రెండింగ్‌’ అనీ నెటిజన్లు రకరకాల కామెంట్లతో స్పందిస్తున్నారు. నిజంగా ఈ బేబీ కటింగ్‌లో సింహం భలే ఉంది కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని