బుల్లి బుజ్జి ఫైరింజన్‌!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఏదైనా అగ్నిప్రమాదం జరిగినప్పుడో, ఎవరైనా ఆపదలో చిక్కుకున్నప్పుడో వెంటనే ఫైరింజన్‌ కోసం ఫోన్‌ చేస్తాం కదా! రోడ్డు పక్కనో, మైదానంలాంటి ప్రాంతాల్లోనో అయితే మన ఫైరింజన్లు సులువుగా రాకపోకలు సాగించగలవు. అదే..

Published : 15 Sep 2022 01:02 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఏదైనా అగ్నిప్రమాదం జరిగినప్పుడో, ఎవరైనా ఆపదలో చిక్కుకున్నప్పుడో వెంటనే ఫైరింజన్‌ కోసం ఫోన్‌ చేస్తాం కదా! రోడ్డు పక్కనో, మైదానంలాంటి ప్రాంతాల్లోనో అయితే మన ఫైరింజన్లు సులువుగా రాకపోకలు సాగించగలవు. అదే.. చిన్న చిన్న గల్లీలైతే, అవి వెళ్లలేవు. ఇరుకు సందుల్లోనూ అగ్ని మాపక సేవలు అందించేలా మార్కెట్లోకి ఓ బుల్లి ఫైరింజన్‌ అందుబాటులోకి వచ్చేసింది. ఆ వివరాలే ఇవీ..

సాధారణంగా మన దగ్గర మండల కేంద్రాల స్థాయిలోనే ఫైరింజన్లు ఉంటాయి. ఆయా ప్రాంతాలకు దూరంగా ఉండే పల్లెల్లో ఏదైనా ప్రమాదం జరిగితే, అక్కడి నుంచే గంట కొడుతూ.. అలారం మోగించుకుంటూ వాహనం రావాల్సి ఉంటుంది. అది వచ్చే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. దీనికి పరిష్కారంగా కొత్తగా మార్కెట్లోకి వచ్చిందే ‘రోబెటా ఎలక్ట్రిక్‌ ఫైర్‌ ట్రక్‌’.

చిన్నదే అయినా..

ఈ ట్రక్‌ చూసేందుకు చిన్నగా కనిపిస్తున్నా.. మంటలను ఆర్పేందుకు అవసరమైన వ్యవస్థ మొత్తం ఇందులో ఉంటుంది. ఆటో కంటే కాస్త అటూఇటుగా ఉండే ఈ వాహనం ధర దాదాపు రూ.2 లక్షలు. అలాగని.. తక్కువ అంచనా వేయకుండి ఫ్రెండ్స్‌.. ఈ ట్రక్‌ గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదట. ఇందులో మంటలు ఆర్పేందుకు రెండు పరికరాలు, 60 మీటర్ల పొడవైన నీటి పైపుతోపాటు ఇతర సామగ్రి ఉంటుంది. ఇంకో విశేషం ఏంటంటే.. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్‌ వాహనం. అంటే పెట్రోల్‌, డీజిల్‌ అవసరం లేదన్నమాట. ఓ ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్‌ ఇటీవలే దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. అలా వచ్చిందో లేదో.. ఈ బుజ్జి ఫైరింజన్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. నెటిజన్లు కూడా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే.. గ్రామాల్లో ఉండే వారు, పెద్ద ఫైరింజన్లు పట్టే వీలులేని కాలనీల్లో నివసించే ప్రజలు తలాకొంత వేసుకొని.. ఇలాంటిదొకటి కొనుక్కుంటే, అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుందని కూడా సూచిస్తున్నారు. నిజంగా ఈ బుల్లి ఫైరింజన్‌ బాగుంది కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని