చీమ చీమ.. అమ్మో చీమ!

చీమలు చాలా అల్పప్రాణులు.. చిరుజీవులు. కానీ ఇప్పుడు ఇవి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఊళ్లపైకి దండయాత్ర చేస్తున్నాయి. వాటి పుట్టలో వేళ్లు పెట్టకుండానే కుట్టేస్తున్నాయి.

Published : 03 Oct 2022 00:18 IST

చీమలు చాలా అల్పప్రాణులు.. చిరుజీవులు. కానీ ఇప్పుడు ఇవి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఊళ్లపైకి దండయాత్ర చేస్తున్నాయి. వాటి పుట్టలో వేళ్లు పెట్టకుండానే కుట్టేస్తున్నాయి. నరకాన్ని చూపిస్తున్నాయి. మరి ఆ సంగతులేంటో తెలుసుకుందామా?!

‘వేళ్లతో నలిపేస్తే చనిపోయే చీమకు ఇంత భయపడతారా.. ఎవరైనా?’ అని మీరు అనుకోవచ్చు. కానీ శ్రీకాకుళం జిల్లా ఇసుకలపేట గ్రామస్థులు మాత్రం చీమ పేరు చెబితేనే ఉలిక్కిపడుతున్నారు. సాధారణంగా చీమలు వాటి పని అవి చేసుకుంటాయి. వాటిని ఏమైనా అంటేనే అవి కుడతాయి. కానీ ఈ గ్రామంలో మాత్రం ఎక్కడ చూసినా చీమలే చీమలు!

నిమిషాల్లోనే...!
రోడ్డు మీద ఓ నిమిషం నిల్చుంటే చాలు.. చీమలు చుట్టుముడుతున్నాయి. కాళ్ల మీదకు పాకి కుడుతున్నాయి. ఇవి కుట్టిన చోట దద్దుర్లు, దురదలు వస్తున్నాయి. వీటిని గోకితే అవి పెద్ద పెద్ద గాయాలుగా మారుతున్నాయి. కొందరిలో అయితే ఏకంగా జ్వరాలు వస్తున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులున్నవారిలో ఇవి త్వరగా తగ్గడం లేదు.

రసాయనాలతో ప్చ్‌..!
బ్లీచింగ్‌ పౌడర్‌, కీటక సంహారాలను చల్లినా, పిచికారీ చేసినా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ఈ చీమలు మనుషులతోపాటు, మూగజీవాలనూ చిత్రహింసలకు గురి చేస్తున్నాయి. గడ్డిలో చీమలు చేరడంతో గేదెలు, ఆవులు ఆహారం లేకుండా బక్కచిక్కిపోతున్నాయి. పక్కనే నాగావళి నది ప్రవహించడం, పొదలు, చెట్లు, తోటలు ఎక్కువగా ఉండడం వల్లే చీమలు ఇలా ఇబ్బడి ముబ్బడిగా ఊళ్లోకి వస్తున్నాయని నిపుణులు అనుకుంటున్నారు. అచ్చంగా ఇదే పరిస్థితి ఇటీవల తమిళనాడులోని కొన్ని గ్రామాల్లో ఎదురైందట. అక్కడైతే చీమలు, మూగజీవాల కళ్ల మీద దాడి చేస్తున్నాయట. కొన్ని సంవత్సరాల క్రితం మిడతలదండు కూడా మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇలాగే విరుచుకు పడ్డాయి. ఇలాంటి విపత్తులన్నింటికీ మానవ తప్పిదాలు, పర్యావరణ మార్పులే కారణం అని నిపుణులు చెబుతున్నారు.

అక్కడైతే పచ్చడి పచ్చడే...  
ఝార్ఖండ్‌ రాష్ట్రంలోని ఓ తెగ ప్రజలు మాత్రం ఎంచక్కా చీమలు కనిపిస్తే చాలు గుటుక్కుమనిపిస్తున్నారు. వాళ్లైతే ఏకంగా పచ్చడి చేసుకుని మరీ తినేస్తున్నారు. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ చీమల దండయాత్ర సంగతులు. త్వరలోనే ఇసుకలపేట గ్రామస్థుల కష్టాలు తీరాలని మనమూ మనసారా కోరుకుందామా మరి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని