Published : 13 Oct 2022 00:25 IST

పక్షులకు ప్రేమతో.. ఓ ఆసుపత్రి!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనకు ఆరోగ్యం బాగాలేకపోతేనో, దెబ్బలు తగిలినప్పుడో ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుంటాం. మరి, ‘మూగజీవాల పరిస్థితి ఏంటి?’ - అవి తమ ఆరోగ్య సమస్యలను ఎవరితోనూ చెప్పుకోలేవు కదా.. జంతువులకు ఉన్నా.. పక్షులకు మనలా ప్రత్యేక ఆసుపత్రులు ఉండవు. అంటే.. అనారోగ్యానికి గురైన పక్షుల పని ఇక అంతేనా?.. ఈ సమస్యలకు పరిష్కారంగానే ఏర్పాటైంది ఓ ఆసుపత్రి. ఆ వివరాలే ఇవీ..

పంజాబ్‌ రాష్ట్రంలో పక్షుల కోసం ఏకంగా ఓ పెద్ద ఆసుపత్రినే నిర్మించారు. లూథియానా నగరంలో సామాజిక కార్యకర్తలు కొందరు ఒక బృందంగా ఏర్పడి.. చాలా ఏళ్లుగా ఓ గోశాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల వారికి గోశాల ఆవరణలో కొన్ని పక్షులు, ఇతర మూగజీవాలు దెబ్బలతో విలవిల్లాడుతూ కనిపించాయి. వెంటనే స్పందించిన నిర్వాహకులు, వాటికి ప్రాథమిక చికిత్స అందించారు. అప్పుడే పక్షుల కోసం ఓ ఆసుపత్రి నిర్మించాలనే ఆలోచన వారికి వచ్చింది.

గోశాల ఆవరణలోనే..

గోశాల నిర్వాహకులు.. తమ ఆలోచనను కొందరు జంతు ప్రేమికులతో పంచుకోవడంతో, వారూ సహకరిస్తామని చెప్పారు. దాంతో ఆ గోశాల ఆవరణలోనే పక్షుల కోసం ఓ ఆసుపత్రిని నిర్మించారు. అలాగని.. ఏదో తూతూమంత్రంగా అని అనుకోకండి నేస్తాలూ.. అత్యవసర వైద్యం అవసరమైన వాటి కోసం ఓ ఐసీయూ వార్డు కూడా ఏర్పాటు చేశారు. నిపుణులైన వైద్యులనూ నియమించుకున్నారు. పావురాలు, చిలుకలు, పిచ్చుకల్లాంటి అనేక పక్షులకు ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. వారి ఆధ్వర్యంలోనే ప్రస్తుతం వేలాది పక్షులకు సేవలందిస్తున్నారు.

విరాళాలు సేకరించి.. 

పక్షుల వైద్య సేవలకు అయ్యే ఖర్చుల కోసం.. కొంతమంది జంతు ప్రేమికుల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. ఇళ్లలో పెంచుకునే వాటితోపాటు నిస్సహాయ స్థితిలో ఉన్న పక్షులను ఇక్కడికి తీసుకెళ్తే.. ఉచితంగానే చికిత్స అందిస్తున్నారు. మూగ జీవాల కోసం గోశాల ప్రాంగణంలోనే ఎప్పటికీ తిండి గింజలు, తాగునీటిని అందుబాటులో ఉంచుతున్నారు. వాతావరణ కాలుష్యం, రేడియేషన్‌ తదితర కారణాలతో రోజురోజుకు పక్షుల సంఖ్య విపరీతంగా తగ్గిపోతోందనీ, తమకు శక్తి ఉన్నంతవరకు మూగ జీవాలకు సేవలు కొనసాగిస్తామని గోశాల నిర్వాహకులు చెబుతున్నారు. ఈ గోశాలకు వచ్చిన నిధుల్లోంచి కూడా కొంత మొత్తాన్ని పక్షుల ఆసుపత్రి నిర్వహణకు వినియోగిస్తున్నారట. అందుకే.. బడి సమయంలోనో, ఇంకెక్కడికైనా బయటకు వెళ్లివచ్చేటప్పుడో పక్షులు ఏవైనా ప్రమాదానికి గురైనట్లు గుర్తిస్తే.. మన చేతనైన సాయం చేద్దాం నేస్తాలూ.. మూగ జీవుల కోసం నిస్వార్థంగా ఇంత సేవ చేస్తున్న గోశాల నిర్వాహకులు నిజంగా గ్రేట్‌ కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు