కొంచెం కుందేలు... కొంచెం ఎలుక!

హాయ్‌ నేస్తాలూ! మీకు ఎలుక తెలుసా..! కచ్చితంగా తెలిసే ఉంటుంది. అలాగే మీకు కుందేలు తెలుసా...! ఇది కూడా తెలిసే ఉంటుంది. మరి మీకు కుందేలు, ఎలుకల రూపాలు కలగలిసిన జీవి గురించి తెలుసా? తెలియదు కదూ! ఏం ఫర్వాలేదు... ఇప్పుడు తెలుసుకోండి. ఇంకెందుకాలస్యం ఈ కథనం చదివేయండి మరి.

Published : 24 Oct 2022 00:42 IST

హాయ్‌ నేస్తాలూ! మీకు ఎలుక తెలుసా..! కచ్చితంగా తెలిసే ఉంటుంది. అలాగే మీకు కుందేలు తెలుసా...! ఇది కూడా తెలిసే ఉంటుంది. మరి మీకు కుందేలు, ఎలుకల రూపాలు కలగలిసిన జీవి గురించి తెలుసా? తెలియదు కదూ! ఏం ఫర్వాలేదు... ఇప్పుడు తెలుసుకోండి. ఇంకెందుకాలస్యం ఈ కథనం చదివేయండి మరి.

విచిత్రంగా కనిపిస్తున్న ఈ జీవి పేరు మార్కోటిస్‌ లాగోటిస్‌. పలకడానికి చాలా కష్టంగా ఉంది కదూ! దీనికి బిల్బీ అనే మరో పేరూ ఉంది నేస్తాలూ! నోరు తిరగని ఆ మొదటి పేరు మనకెందుకు కానీ... ఈ రెండో పేరుతోనే దీన్ని పిలుచుకుందాం సరేనా. ఈ బిల్బీలు కేవలం ఆస్ట్రేలియాలో మాత్రమే మనకు కనిపిస్తాయి. ఇవి ఎలుకల్లా కనిపించినప్పటికీ నిజానికి ఇవి కుందేలు జాతి జీవులు. ప్రస్తుతం ఇవి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి.

పరిమిత సంఖ్యలో...

ప్రస్తుతం ఈ జీవులు పరిమిత సంఖ్యలోనే మధ్య ఆస్ట్రేలియా, వాయువ్య ఆస్ట్రేలియాలో కనిపిస్తున్నాయి. ఇవి 29 నుంచి 55 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాయి. బరువేమో ఒక కేజీ నుంచి దాదాపు రెండున్నర కేజీల వరకు పెరుగుతాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇవి మూడున్నర కిలోల వరకూ బరువు తూగుతాయి. వీటిలో మగవాటికన్నా ఆడవి కాస్త చిన్నవిగా ఉంటాయి.

నీళ్లు తాగవు..

ఈ బిల్బీలు తమ జీవిత కాలంలో సాధారణంగా నీళ్లు తాగవు. తమకు కావాల్సిన నీటి శాతాన్ని, అవి తీసుకునే ఆహారం నుంచే గ్రహిస్తాయి. ఇవి కీటకాలు, సాలీళ్లు, చెదపురుగులు, పండ్లు, విత్తనాలు, ఇంకా చిన్న చిన్న జీవులను తమ ఆహారంగా తీసుకుంటాయి.

ఆరేళ్లే.. నిండు నూరేళ్లు!

బిల్బీల జీవిత కాలం చాలా తక్కువ. ఇవి కేవలం ఆరేళ్లే బతుకుతాయి. అవే వీటికి నిండు నూరేళ్లతో సమానం. ఎందుకంటే వీటిలో చాలా వరకు అంతకంటే ముందే చనిపోతాయి. అడవి పిల్లులు, నక్కలు వీటికి ప్రధాన శత్రువులు. ఇవి కంగారూల్లానే పూర్తిగా ఎదగని పిల్లల్ని కంటాయి. వాటిని పొట్టకింద ఉండే సంచిలో కొంతకాలం పాటు భద్రంగా కాపాడతాయి. నేస్తాలూ.. ఇవీ వింత బిల్బీల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. మొత్తానికి ఈ సంగతులు భలే ఉన్నాయి కదూ!


అద్భుతంగా వింటాయి!

వీటికి ఎలుకల్లా పొడవైన తోక, కుందేళ్లలా పొడవైన చెవులు, మెత్తని బొచ్చు ఉంటాయి. వీటికి పెద్దవైన చెవులు ఉండటం వల్ల చాలా చక్కని వినికిడి శక్తి ఉంది. వాసన పీల్చే సామర్థ్యం కూడా అమోఘం. ఇవి బొరియలు తవ్వుకొని అందులో నివసిస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని