వానరం కాదు.. మూషికమే!

హాయ్‌ నేస్తాలూ... ఈ జీవిని చూసి బుజ్జి వానరం అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే! ఎందుకంటే ఇది వానరం కాదు. ఇదో ఎలుక. ఇది చెట్ల మీదే బతుకుతుంది.

Updated : 31 Oct 2022 02:33 IST

హాయ్‌ నేస్తాలూ... ఈ జీవిని చూసి బుజ్జి వానరం అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే! ఎందుకంటే ఇది వానరం కాదు. ఇదో ఎలుక. ఇది చెట్ల మీదే బతుకుతుంది. ఈ జీవి ప్రపంచంలో కేవలం ఒక్కచోట మాత్రమే కనిపిస్తుంది. మరి ఈ విచిత్ర మూషికం పేరేంటి? దీని కథేంటో తెలుసుకుందామా. అయితే ఇంకెందుకాలస్యం ఈ కథనం చదివేయండి మరి.

మోనిటో డెల్‌, మోంటే, కోలోకోలో ఒపోసమ్‌, డోరమిసియోప్స్‌ గ్లిరాయిడ్స్‌, చుమైహుయెన్‌.. ఏంటి అలా విచిత్రంగా చూస్తున్నారు. ఇవన్నీ దీని పేర్లే. ఇవి పలకడానికి కష్టంగా ఉందా.. అయితే మనం చెట్లెక్కే ఎలుక అన పిలుచుకుందాం సరేనా. ఈ విచిత్ర ఎలుకలు కేవలం దక్షిణ అమెరికాలో, అదీ కొన్ని ప్రాంతాల్లోనే కనిపిస్తాయి. దూరం నుంచి చూస్తే ఇవి ఏవో చిన్న చిన్న కోతుల్లా కనిపిస్తాయి కానీ.. నిజానికి ఇవి ఎలుక జాతికి చెందిన జీవులు. ఇవి చాలా అరుదైనవి. ప్రస్తుతం అంతరించిపోతున్న జాబితాలో ఉన్నాయి.

దంతాలెన్నో తెలుసా!

నేస్తాలూ.. ఈ విచిత్ర ఎలుకకు 50 వరకు దంతాలుంటాయి. ఇవి 16 నుంచి 42 గ్రాముల వరకు బరువు తూగుతాయి. పొడవేమో 8 నుంచి 13 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. తోకేమో 9 నుంచి 13 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతుంది.

ఏం తింటాయంటే!

ఈ చెట్లెక్కే ఎలుకలు చిన్న చిన్న పురుగుల్ని తమ ఆహారంగా తీసుకుంటాయి. పండ్లనూ తింటాయి. ఇవి పండ్లను తినే క్రమంలోనే విత్తనాలు నేలపై పడి కొత్త మొక్కలు మొలకెత్తుతాయి. అంటే ఓ రకంగా ఇవి తమకు తెలియకుండానే పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్నాయన్నమాట. ఇవి సాధారణంగా కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే జీవిస్తాయి. ప్రత్యేక సందర్భాల్లో ఇవి కొన్ని ఎక్కువ సంవత్సరాలు కూడా జీవిస్తాయి. నేస్తాలూ మొత్తానికి ఇవీ చెట్లెక్కే మూషికం గురించి విశేషాలు

చెట్ల మీదే జీవనం!

ఈ ఎలుకలు అర్జెంటీనా, చిలీలోని అడవుల్లో కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా చెట్ల మీదే జీవిస్తాయి. ఇవి పక్షుల్లా ఆకులు, గడ్డితో ఎంచక్కా గూళ్లను కట్టుకుని అందులోనే నివసిస్తాయి. అయితే ఇవి గూళ్లను చాలా తెలివిగా నిర్మించుకుంటాయి. శత్రువులు తేలిగ్గా దాడి చేయకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటాయి. చెట్టులో బాగా గుబురుగా ఉండే ప్రాంతం, కొమ్మల దగ్గర] ఇవి తమ గూళ్లను నిర్మించుకుంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని