భలే భలే.. తకాహే!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. బాగున్నారా.. నేనో పక్షిని. ‘ఏంటి అలా వింతగా చూస్తున్నారు? నన్ను ఎప్పుడూ మీరు చూసి ఉండరు కదూ! ఎందుకంటే నేను మీ దేశంలో ఉండను కదా.

Published : 28 Nov 2022 00:08 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. బాగున్నారా.. నేనో పక్షిని. ‘ఏంటి అలా వింతగా చూస్తున్నారు? నన్ను ఎప్పుడూ మీరు చూసి ఉండరు కదూ! ఎందుకంటే నేను మీ దేశంలో ఉండను కదా. మరి నా పేరు ఏంటి? నేను ఎక్కడ ఉంటానో.. తెలుసుకోవాలని ఉందా? అయితే ఇంకెందుకాలస్యం? ఈ కథనం చదివేయండి.

నా పేరు తకాహే. నేను ఉండేది న్యూజిలాండ్‌లో. చూడ్డానికి కాస్త కోడిలా ఉంటాను. నిజానికి నేను ఎప్పుడో అంతరించిపోయి ఉండాల్సిన దాన్ని. ఏదో నా అదృష్టం బాగుండి ఇలా మిగిలాను. ఎందుకంటే నన్ను ఓ తెగవాళ్లు విపరీతంగా వేటాడేవాళ్లు. అందుకే మా సంఖ్య బాగా తగ్గిపోయింది. నేను గతంలో 1850లో మాత్రమే బతికుండగా కనిపించాను. అంతకు ముందన్నీ నా శిలాజాలు మాత్రమే పరిశోధకులకు దొరికాయి. నేను మళ్లీ తర్వాత 1898లో మరోసారి కనిపించాను. తర్వాత దాదాపు యాభై సంవత్సరాల వరకు  ఎవరికీ నా ఆచూకీ తెలియలేదు. అందరూ నన్ను అంతరించిపోయా... అనుకున్నారు. కానీ నేను తిరిగి 1948లో కనిపించాను. ప్రస్తుతం నన్ను న్యూజిలాండ్‌ ప్రభుత్వం వాళ్లు కంటికిరెప్పలా కాపాడుతున్నారు. ప్రస్తుతం మా సంఖ్య దాదాపు 440. 2013లో అయితే 263, 2016లో 306, 2017లో 347, 2019లో 418గా మాత్రమే ఉండేది. అంటే నేను ప్రపంచంలోకెల్లా అత్యంత అరుదైన పక్షినన్న మాట.

ఎగరలేని పక్షిని...

నేను 63 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాను. ఎత్తేమో దాదాపు 50 సెంటీమీటర్ల వరకు ఉంటాను. మాలో మగవి 2.7 కిలోల వరకు బరువు తూగుతాయి. ఆడవేమో 2.3 కిలోల వరకు పెరుగుతాయి. మాలో కొన్ని అరుదుగా 4.2 కిలోల వరకు కూడా పెరుగుతాయి. నేను 18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల వరకు జీవించగలను. నా కాళ్లు చాలా బలంగా ఉంటాయి. నేను చాలా గట్టిగా కొరకగలను. కానీ నేను బరువు ఎక్కువ ఉండటం వల్ల ఎగరలేను.

నీలి రంగులో...

నేను నీలిరంగులో ఉంటాను. రెక్కలు మాత్రం అచ్చంగా నెమలి రంగులో ఉంటాయి. తోక, రెక్కల కింద కాస్త ఆకుపచ్చ రంగు ఉంటుంది. నేను గడ్డిని, మొలకల్ని తింటాను. ఇంకా చిన్న చిన్న పురుగుల్ని కూడా ఎంచక్కా కరకరలాడించేస్తా. మాలో ఆడవి ఒకటి నుంచి మూడు వరకు గుడ్లు పెడతాయి. నేస్తాలూ.. మొత్తానికి ఇవండీ నా విశేషాలు. సరే ఇక ఉంటామరి బై.. బై..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని