Updated : 24 Jan 2023 00:35 IST

హాచ్‌ఁ.. హాచ్‌ఁ.. నాకు తెగ తుమ్ములోచ్‌!

హాయ్‌ ఫ్రెండ్స్‌... ఏంటి నన్ను అలా చూస్తున్నారు. కాస్త వింతగా, ఇంకాస్త విచిత్రంగా ఉన్నా అనా?.. నేను కూడా అందుకే వచ్చానులెండి. నా గురించి మీకు చెప్పిపోదామని! మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది నేనో కోతిని అని. కానీ మామూలు వానరాన్ని కాదు. నాకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. అవేంటో తెలుసుకుంటారా మరి. అయితే ఇంకెందుకాలస్యం.. ఈ కథనం చకచకా చదివేయండి సరేనా!  

నా పేరు రైనోపితేకస్‌ స్ట్రైకెరీ. పలకడానికీ, చదువుకోవడానికీ కష్టంగా ఉంది కదూ! మీకే కాదు.. నాకూ కష్టమే. ఏం చేస్తాం చెప్పండి. మీ మనుషులే నాకు ఈ నోరు తిరగని పేరు పెట్టారు. నన్ను మీరు ‘మయన్మార్‌ స్నబ్‌ నోస్‌డ్‌ మంకీ’ అని పిలుచుకోండి సరేనా. నా ముక్కు పొట్టిగా ఉంటుంది, నేను మయన్మార్‌లో జీవిస్తాను అని మీకీపాటికే అర్థమై ఉంటుంది కదూ!

పదమూడేళ్ల క్రితం...

నేను అనే ఓ జీవిని ఈ భూమి మీద ఉన్నట్లు మీకు కేవలం పదమూడేళ్ల క్రితం నుంచి మాత్రమే తెలుసు. 2010వ సంవత్సరంలో నా గురించి స్థానికుల ద్వారా శాస్త్రవేత్తలకు తెలిసింది. నాకో ప్రత్యేక లక్షణం ఉన్నట్లు కూడా స్థానికులే గుర్తించి, దాన్ని శాస్త్రవేత్తల దృష్టికి తీసుకువెళ్లారు. అదేంటంటే నాకు వాన చినుకు అంటే వణుకు. వర్షం వచ్చిందంటే నాకు బెరుకే. ఎందుకంటే నాకు తెగ తుమ్ములు వస్తాయి మరి. పైగా అవి అస్సలు ఆగవు. ఆ తుమ్ములు ఆగాలంటే వాన ఆగాల్సిందే.

తలదాచుకుంటా....

మామూలుగా మీరు ఆశ్రయం పొందారు అనే చెప్పే అర్థంలో తలదాచుకున్నారు... అని వాడతారు కదా! నేను మాత్రం నిజంగా నా తలను దాచుకుంటా. ఇలా ఎందుకంటే.. వాన నుంచి రక్షణ పొందేందుకే. లేకపోతే హాచ్‌ఁ.. హాచ్‌ఁ... అని అలా వరుసగా తుమ్మడం నా వల్ల కాదు బాబు. అందుకే నేను వర్షం వస్తుందంటే చాలు చెట్ల గుబురుకొమ్మల్లోకి వెళ్లిపోతా. నా కాళ్లను ముడుచుకొని వాటి మధ్య నా తలను దాచుకుంటా. అంటే నేను వానంటే భయపడే వానరాన్ని అన్నమాట

మాకు బంధువులున్నారోచ్‌..

నాలా పొట్టి ముక్కున్న కోతులు చైనాలోనూ ఉన్నాయి. కాకపోతే నేను వాటికి భిన్నం. అవన్నీ గోధుమ, బంగారు వర్ణంలో మెరిసిపోతుంటే.. నేను మాత్రం ఎంచక్కా చక్కని, చిక్కని నలుపు రంగులో నిగనిగలాడుతూ ఉంటా. నన్ను మొట్టమొదట మయన్మార్‌లోని గయోలీగాంగ్‌ పర్వతప్రాంతాల్లో కనుగొన్నారు. స్థానికులు.. మే నావో, మ్యుక్‌ న టక్‌ టే అని పిలుస్తారు. ఈ రెండింటికీ అర్థం ఒక్కటే... ‘పైకి వంపు తిరిగిన ముఖమున్న కోతి’ అని.

క్లిక్‌..క్లిక్‌... స్మైల్‌ ప్లీజ్‌...

నన్ను గుర్తించడమైతే 2010లో చేశారు కానీ... నా ఫొటో సంపాదించడానికి మాత్రం మీకు దాదాపు రెండు సంవత్సరాలు పట్టింది. 2012లో కానీ మీరు నన్ను ఫొటో తీయలేకపోయారు. ఎందుకంటే నేను చాలా అరుదుగా కనిపిస్తా. పైగా నేను పర్వతాల్లో ఎక్కడో మారుమూలల్లో జీవిస్తా. మా సంఖ్య కూడా చాలా తక్కువే. సరిగ్గా ఇంత అని మాత్రం మీకు ఇంతవరకూ తెలియదు.  

మా తోక పొడవెంతంటే...!

చింపాంజీలు, గొరిల్లాలాంటివి నలుపు రంగులో ఉంటాయి కానీ. మాలాంటి కోతులు ఆ వర్ణంలో ఉండటం అరుదనే చెప్పాలి. నేను మాత్రం ఎంచక్కా నలుపురంగులో ఉంటాను. చెవుల దగ్గర మాత్రం కాస్త తెల్లగా ఉంటుంది. నా జుట్టు కొంచెం మీ మనుషుల తలకట్టును పోలి ఉంటుంది. మా కన్నా.. మా తోకే పొడవు ఎక్కువ ఉంటుంది. మాలో మగవి సగటున దాదాపు 55.5 సెంటీమీటర్ల ఎత్తుంటే, వాటి తోకేమో 78 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతుంది. బరువేమో 17 కిలోల వరకు ఉంటాయి. ఆడవేమో 53 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. వాటి తోకమాత్రం 64.5 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఇక బరువు విషయానికొస్తే 9 నుంచి 11.6 కిలోల వరకు తూగుతాయి.

ఎండాకాలం అలా...శీతాకాలం ఇలా...  

మేం ఎండాకాలంలో అడవుల్లో పై భాగానికి వెళ్లిపోతాం. శీతాకాలం మాత్రం కింది భాగానికి వచ్చేస్తాం. చలి నుంచి కాపాడుకోవడానికే ఇలా చేస్తామన్నమాట. మేం రోజులో ఎక్కువ సమయం చెట్లమీదే గడుపుతాం. మేం ఎక్కువగా పండ్లు, ఆకులను ఆహారంగా తీసుకుంటాం. అప్పుడప్పుడు చిన్న చిన్న పురుగులనూ తింటుంటాం. నాకో నిక్‌నేమ్‌ కూడా ఉంది తెలుసా.. అదేంటంటే ‘తుమ్ముల కోతి’ అని. మీరు మాత్రం అలా పిలవకండి సరేనా. నాకు తెగ కోపం. నన్నే కాదు.. మీ స్నేహితులు ఎవరికీ కూడా ఇలాంటి నిక్‌నేమ్స్‌ పెట్టకండి సరేనా. ఎందుకంటే వాళ్లు బాధపడతారు. పైగా ఇలా ఆటపట్టించడం మంచి పిల్లల లక్షణం కాదు. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటామరి... బై.. బై...!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు